బోల్తా పడిన పైనాపిల్ వ్యాన్.. మానవత్వం చాటిన స్థానికులు.. వీడియో వైరల్
ABN , Publish Date - Nov 28 , 2026 | 08:26 AM
రోడ్డు ప్రమాదం జరిగితే చాలు.. సరుకు కోసం ఎగబడే జనాలను చూస్తుంటాం. కానీ కేరళలో అందుకు భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. పైనాపిల్స్‌తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడటంతో స్థానికులు సహాయం చేసేందుకు పరుగెత్తుకొచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కొందరు బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వస్తుంటే.. కొందరు మాత్రం వాహనాల్లోని సరుకును దోచుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే కేరళలో ఇందుకు పూర్తి భిన్నమైన సంఘటన చోటుచేసుకుంది. పైనాపిల్స్‌తో వెళ్తున్న ఓ వ్యాన్ రోడ్డు పక్కన అదుపుతప్పి బోల్తా పడటంతో స్థానికులు మానవత్వం చాటుకున్నారు.
ప్రమాదాన్ని గమనించిన వెంటనే అక్కడికి పరుగెత్తుకొచ్చి డ్రైవర్‌కు, ఇతరులకు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. అంతటితో ఆగకుండా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన పైనాపిల్స్‌ను ఒక్కొక్కటిగా ఏరి తిరిగి వ్యాన్‌లోకి ఎక్కించారు. అనంతరం పలువురు కలిసి బోల్తా పడిన వాహనాన్ని తిరిగి నిలబెట్టేందుకు శ్రమించారు. ప్రమాదం జరిగిన సమయంలో సరుకును ఎత్తుకెళ్లడం కాకుండా, బాధితులకు అండగా నిలవడం ద్వారా తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
రంజిత్ క్రియేట్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో తిరువనంతపురంలోని పల్లిచల్ ప్రాంతంలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. వీడియోలో రోడ్డు పక్కన బోల్తా పడి ఉన్న పైనాపిల్ వ్యాన్ చుట్టూ స్థానికులు గుమిగూడి సహాయక చర్యల్లో పాల్గొనడం కనిపిస్తోంది. కొందరు కలిసి వాహనాన్ని నెట్టి తిరిగి యథాస్థానంలోకి తీసుకురాగా, మరికొందరు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన పైనాపిల్స్‌ను సేకరించి వ్యాన్‌లోకి ఎక్కించారు. సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సరుకు కోసం ఎగబడే ఘటనలు కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ స్థానికులు చూపించిన బాధ్యతాయుతమైన ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కేరళ వాసుల మానవత్వాన్ని ప్రశంసిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడానికి పెద్దగా పరిచయం అవసరం లేదని, మంచి మనసు ఉంటే చాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. చిన్నపాటి సహాయం కూడా ఇతరులకు ఎంతో మేలు చేస్తుందని, సమాజంలో ఇలాంటి ఐక్యత, పరస్పర సహకారం ఎంతో అవసరమని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన మానవత్వం ఇంకా బతికే ఉందని చాటిచెప్పేలా నిలిచింది.
ఈ వార్తలనూ చదవండి:
భారతీయుడి ప్రపంచ రికార్డు.. 10 లక్షల మంది యూట్యూబ్ పెయిడ్ ఛానల్ మెంబర్స్..
ప్రశ్నలు మీవే.. సమాధానాలూ మీవే.. ఐఐటీలో ఇలాంటి పరీక్షలా?