చిన్నారిపై వీధి కుక్క దాడి.. కాపాడేందుకు మెుదటి అంతస్తు నుంచి దూకిన సోదరుడు..
ABN , Publish Date - Jun 23 , 2026 | 08:49 AM
వీధి, పిచ్చి కుక్కలు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది మనుషులపై అవి దాడి చేసి ప్రాణాలు తీశాయి. తాజాగా ఓ శునకం దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
కేరళం: వీధి, పిచ్చి కుక్కలు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది మనుషులపై అవి దాడి చేసి ప్రాణాలు తీశాయి. రోడ్డుపై వెళ్తున్న వారిని, ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులను ఇలా ఎక్కడపడితే అక్కడ దాడులు చేసి ప్రాణాలు తీసిన ఉద్దంతాలు కోకొల్లలు. వీటికి సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట హల్‌చల్ చేసిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ శునకం ముగ్గురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన కేరళంలోని మలప్పురం జిల్లాలో చోటు చేసుకుంది.
మలప్పురం జిల్లా చంగరంకుళంలోని అలంకోడ్‌లో ఓ ఇంటి ముందు ఇద్దరు చిన్నారులు ఆడుకుంటున్నారు. అయితే అటుగా వచ్చిన వీధి కుక్క ఒక్కసారిగా చిన్నారులపై విరుచుకుపడింది. ఓ బాలుడిని కింద పడేసి కరవడం ప్రారంభించింది. దీంతో చిన్నారి కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన బాలుడి సోదరుడు ఏకంగా మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. తన తమ్ముడిని కాపాడేందుకు శునకంతో పోరాడాడు. గ్రామసింహం నుంచి సోదరుడిని రక్షించుకున్నాడు. అయితే ఈ దాడిలో బాలుడికి గాయాలు అయ్యాయి. ఇంతలో అదే కుటుంబానికి చెందిన ఓ మహిళ ఇద్దరు చిన్నారులను సురక్షితంగా ఇంట్లోకి తీసుకెళ్లింది. మరోవైపు కుక్కను తరిమేందుకు ఆ యువకుడు కర్ర తీసుకుని దాని వెంట పడ్డాడు. ఇంటి ప్రాంగణం నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నించాడు.
అయితే కొంత దూరం వెళ్లిన ఆ శునకం ఒక్కసారిగా వెనక్కి తిరిగి యువకుడిపై దాడి చేసింది. కింద పడేసి తీవ్రంగా కరిచింది. దాని నుంచి తప్పించుకునేందుకు అతను తీవ్రంగా ప్రయత్నించాడు. అతి కష్టం మీద పైకి లేచి కర్రతో దాడి చేశాడు. దీంతో శునకం అక్కడికక్కడే కుప్పకూలింది. నిమిషాల వ్యవధిలోనే మళ్లీ తేరుకుని పైకి లేచింది. అనంతరం రోడ్డుపై వెళ్తున్న మరో వ్యక్తిపై దాడికి దిగింది. అతన్ని కూడా కింద పడేసి కొరికేసింది. దీంతో ఆ యువకుడు రోడ్డుపైకి వెళ్లి కుక్కపై మరోసారి దాడి చేశాడు. పెద్ద కర్రతో పదేపదే కొట్టి చంపేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఆ ఇంటి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సోదరుడిని కాపాడేందుకు ఆ యువకుడు చూపిన తెగువ నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. మరోవైపు ఈ ఘటన వీధి కుక్కల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చినట్లయింది.
ఈ వార్తలు కూడా చదవండి
యూఎస్‌కు మకాం మార్చేందుకు సిద్ధమైన స్టార్టప్ ఫౌండర్! భారత్‌లో సహనం తక్కువంటూ..
ఇక నాకు ఐటీ జాబ్ రాదా? ఇటీవలే బీటెక్ చేసిన యువతి ఆవేదన