యూఎస్‌కు మకాం మార్చేందుకు సిద్ధమైన స్టార్టప్ ఫౌండర్! భారత్‌లో సహనం తక్కువంటూ..
ABN , Publish Date - Jun 22 , 2026 | 06:18 PM
బెంగళూరులోని ఒక స్టార్టప్ సంస్థ ఓనర్ తాజాగా అమెరికాకు మకాం మార్చేందుకు నిర్ణయించిన వైనం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులోని ఒక స్టార్టప్ సంస్థ ఓనర్ తాజాగా అమెరికాకు మకాం మార్చేందుకు నిర్ణయించిన వైనం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. 2024లో అనఘా రాజేశ్ బయోకంప్యూట్ స్టార్టప్ సంస్థను ప్రారంభించారు. అయితే, సంస్థను మరింత అభివృద్ధి చేసేందుకు అమెరికా అనువైనదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెప్పారు. ఈ ఉదంతంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, డీఎన్‌ఏను వినియోగించి డేటా నిల్వ చేసే టెక్నాలజీని అభివృద్ధి చేసే లక్ష్యంతో అనఘా రాజేశ్ ఈ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతమున్న సాంకేతికతతో డీఎన్ఏలో ఒక ఎంబీ డేటా నిల్వకు రూ.3.5 లక్షల ఖర్చు అవుతోంది. ఈ ఖర్చును రూ.100లకు తగ్గించడమే లక్ష్యంగా ఆమె రంగంలోకి దిగారు. డేటా స్టోరేజీ మరింత చవగ్గా చేసేందుకు, ఇంధన వినియోగం తగ్గించేందుకు డీఎన్ఏ డేటా స్టోరేజీ విధానం అనువైనదని ఆమె చెబుతున్నారు. ఈ దిశగా పరిశోధన కోసం ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటివరకూ వేల కొద్దీ ప్రయోగాలు చేశారు. చివరకు ఒక ప్రయోగాత్మక స్టోరేజీ సాధనాన్ని కూడా రూపొందించారు. పలు ఇన్వెస్టర్ల నుంచి రూ.5 కోట్ల వరకూ పెట్టుబడిని సమీకరించారు. డబ్ల్యూటీఎఫ్ ఫండ్, గ్రాడ్ క్యాపిటల్, 1517 ఫండ్ వంటి సంస్థలు బయోకంప్యూట్‌లో పెట్టుబడి పెట్టాయి. అయితే, సంస్థను మరింతగా అభివృద్ధి చేసేందుకు శాన్‌ఫ్రాన్‌సిస్కో బెటరని అనఘా రాజేశ్ నమ్ముతున్నారు.
దీర్ఘకాలిక పరిశోధనతో కూడుకున్న ప్రాజెక్టులకు అండగా నిలిచే స్టార్టప్ వ్యవస్థ శాన్‌ఫ్రాన్‌సిస్కోలో ఉందని ఆమె చెప్పారు. తన లక్ష్యాన్ని యూఎస్ అర్థం చేసుకుందని వ్యాఖ్యానించారు. తాము పెట్టిన పెట్టుబడులపై తక్షణ ఆదాయం కోరకుండా తాను లక్ష్యంవైపు అడుగులు వేసేలా సహకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఏమిటీ డీఎన్ఏ ఆధారిత స్టోరేజీ..
ప్రస్తుతం డేటాను డిజిటల్ (0, 1) రూపంలో నిల్వ చేస్తున్న విషయంలో తెలిసిందే. ఇందుకు బదులుగా డీఎన్‌ఏలోని న్యూక్లియోటైడ్ బేసెస్ రూపంలో డేటా స్టోరేజీతో అనేక ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోని డేటా మొత్తాన్ని చిన్న డబ్బాలో పట్టేలా డీఎన్ఏతో డేటా సేవ్ చేయొచ్చు. వేల సంవత్సరాల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. అయితే ప్రస్తుత సాంకేతికతతో డీఎన్ఏ స్టోరేజీ అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. ఈ ఖర్చును తగ్గించేందుకు అనేక మంది శాస్త్రవేత్తలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు ప్రయాత్నాలు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
యోగాలో పాల్గొన్న ఏనుగులు.. నెట్టింట వీడియో వైరల్..
క్యాబ్ డ్రైవర్‌కు జాక్‌పాట్.. రూ.500తో టికెట్ కొంటే రూ.3 కోట్లు..