Share News

ఆయుష్షు పెరిగినా.. ఆరోగ్యం అంతంతే!

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:44 AM

అత్యాధునిక వైద్య సేవల కారణంగా.. ఇదివరకటితో పోలిస్తే భారతీయుల సగటు ఆయుర్దాయం పెరిగింది. కానీ.. ఆ అదనపు ఆయుష్షును ఆస్వాదించే వీల్లేకుండా జీవనశైలి లోపాలు ప్రజలను రోగాలపాలు చేస్తున్నాయి.

ఆయుష్షు పెరిగినా.. ఆరోగ్యం అంతంతే!
GoQii India Fit Report 2026

  • జీవితంలో సగటున చివరి 12 ఏళ్లు మంచానికి, ఆసుపత్రులకే పరిమితం అవుతున్న భారతీయులు

  • 865 శాతం మంది మహిళల్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు

  • 43.7 శాతం మందిలో ప్రమాదకర స్థాయిలో విజరల్‌ ఫ్యాట్‌

  • కూర్చునే కొలువులు, నిద్రలేమితో యువత రోగాలపాలు

  • ‘గోకీ ఇండియా ఫిట్‌ రిపోర్ట్‌ -2026’ హెచ్చరిక

  • తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనకరంగా జీవనశైలి వ్యాధులు

  • శారీరక శ్రమ, వ్యాయామంతో అధిగమించవచ్చు: వైద్యులు

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): అత్యాధునిక వైద్య సేవల కారణంగా.. ఇదివరకటితో పోలిస్తే భారతీయుల సగటు ఆయుర్దాయం పెరిగింది. కానీ.. ఆ అదనపు ఆయుష్షును ఆస్వాదించే వీల్లేకుండా జీవనశైలి లోపాలు ప్రజలను రోగాలపాలు చేస్తున్నాయి. ఫలితంగా.. పదవీ విరమణ వయసుకు చేరుకునే సరికే అనారోగ్యాలతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు, కొందరు దీర్ఘకాలం మంచాన పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల విడుదలైన ‘గోకీ ఇండియా ఫిట్‌ రిపోర్ట్‌-2026’.. దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి వెల్లడించిన అత్యంత ఆందోళనకరమైన వాస్తవాలివి. భారతీయులు తమ జీవితకాలంలో చివరి 11 నుంచి 12 సంవత్సరాల పాటు ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధితో, భరించలేని శారీరక సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే గడుపుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది.


స్వాతంత్ర్యానంతరం వైద్య సదుపాయాలు మెరుగవడంతో మన ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది. 1975లో భారతీయుల సగటు ఆయుర్దాయం కేవలం 52 ఏళ్లు ఉండగా.. నేడు అది 70.4 ఏళ్లకు చేరింది. కానీ.. ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులూ లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే కాలం (హెల్దీ అడ్జస్టెడ్‌ లైఫ్‌ ఎక్స్‌పెక్టెన్సీ- హెచ్‌ఏఎల్‌ఈ) మాత్రం 59 ఏళ్లకే పరిమితమైందని ఆ నివేదిక పేర్కొంది.. అంటే.. బతికే కాలానికి, ఆరోగ్యంగా ఉండే కాలానికి మధ్య ఏకంగా 12 ఏళ్ల భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఆ నివేదిక ప్రకారం.. దేశంలో సంభవిస్తున్న మొత్తం మరణాల్లో 63శాతం మరణాలకు గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి నాన్‌-కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ.. ఇవి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించేవి కావు) కారణమవుతుండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.


ఐసీఎంఆర్‌, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స) గణాంకాల ప్రకారం.. దేశంలోనే అత్యధికంగా మధుమేహం, రక్తపోటు కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముందువరుసలో ఉన్నాయి. ఐటీ, కార్పొరేట్‌ ఉద్యోగాల వల్ల ‘కూర్చునే సంస్కృతి’ విపరీతంగా పెరగడమే ఇందుకు కారణం. అలాగే.. 2050 నాటికి దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు (సుమారు 30 కోట్ల మంది) 60 ఏళ్లుపైబడినవారే ఉంటారని, ఇప్పటి నుంచే మేల్కోకపోతే తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రులు వృద్ధాప్య రోగులతో కిక్కిరిసిపోవడం ఖాయమని నివేదిక హెచ్చరించింది.


మహిళల ఆరోగ్యాన్ని కబళిస్తున్న వ్యాధులు..

పురుషులతో పోలిస్తే.. మహిళలు ఎక్కువ కాలం జీవిస్తున్నప్పటికీ, అనారోగ్య సమస్యలతో అత్యధికంగా సతమతమవుతున్నది వారేనని నివేదిక స్పష్టం చేసింది. దాని ప్రకారం.. పురుషుల్లో 58శాతం మంది ఆరోగ్యకరమైన విభాగంలో ఉంటే.. మహిళల్లో కేవలం 35శాతం మంది మాత్రమే ఆరోగ్యంగా ఉన్నారు. మిగిలిన 65శాతం మంది ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు. ముఖ్యంగా 43.7 శాతం మంది మహిళలు విజరల్‌ ఫ్యాట్‌ (అంటే అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుపోయే ప్రమాదకరమైన కొవ్వు)తో ఇబ్బంది పడుతున్నారు. పురుషుల్లో ఈ సంఖ్య 12.7 శాతం మాత్రమే.


దీనివల్ల మహిళల్లో టైప్‌-2 డయాబెటిస్‌, పీసీఓడీ, గుండె జబ్బులు, అకాల పక్షవాతం ముప్పు పెరుగుతోంది. కుటుంబ బాధ్యతల భారం, విశ్రాంతి లేకపోవడం వల్ల 21శాతం మంది మహిళలు నిత్యం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పురుషుల్లో 61శాతం మంది నాణ్యమైన నిద్ర పొందుతుండగా.. మహిళల్లో సగం మందికి కంటి నిండా నిద్ర కరువైంది. రుతుక్రమం ఆగిపోయే (మెనోపాజ్‌) దశలో హార్మోన్ల మార్పుల వల్ల ఎముకల బలహీనత వేధిస్తున్నా... మహిళలకు సరైన వైద్య సలహాలు అందట్లేదని నివేదిక పేర్కొంది.


యుక్తవయసు నుంచే..

జీవనశైలి వ్యాధులు వృద్ధాప్యంలోనే వస్తాయనేది భ్రమ మాత్రమేనని.. ఇటీవలికాలంలో యువత కూడా వాటి బారిన ఎక్కువగా పడుతున్నారని నివేదిక పేర్కొంది. స్ర్కీన్‌ అడిక్షన్‌ (ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, టీవీ వీక్షణకు బానిసలు కావడం), జంక్‌ ఫుడ్‌, నిద్రలేమి వల్ల యువత రోగాల బారిన పడుతున్నారని స్పష్టం చేసింది. దేశంలో 50 శాతం మంది రోజుకు 5 నుంచి 8గంటలపాటు, మరో 26శాతం మంది 8 గంటలకు పైగా కదలకుండా కూర్చుని పనిచేస్తున్నారని.. దీనివల్ల కండరాల క్షీణత, ఏకాగ్రత లోపించడం, ఇన్సులిన్‌ నిరోధకత పెరిగి చిన్న వయసులోనే హృద్రోగాల బారిన పడుతున్నారని వెల్లడించింది.


కాగా.. భారతదేశంలో ఆయుర్దాయం పెరుగుతుండటం సంతోషకరమే అయినప్పటికీ, ఆ అదనపు సంవత్సరాలను మందులతో, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ గడపడం తీవ్ర ఆందోళనకరమని గోకీ వ్యవస్థాపకుడు విశాల్‌ గోండల్‌ అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇప్పటికైనా నివారణే మార్గంగా భావించి, తమ దైనందిన జీవితంలో, జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటేనే ముప్పు నుంచి బయటపడగలరని ఆయన స్పష్టం చేశారు. శారీరక శ్రమ చేయడం, నిత్యం కొద్దిసేపైనా వ్యాయామం చేయడం వంటివాటితో ఈ సమస్యను అధిగమించవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.


30-40 ఏళ్ల వయస్సులోనే బైపాస్‌ సర్జరీలు...

కుర్చీల్లోంచి కదలకుండా ఎక్కువసేపు కూర్చునే జీవనశైలే పలు అనారోగ్యాలకు ప్రధాన కారణమవుతోంది. 30-40 ఏళ్ల వయసులోనే బైపాస్‌ సర్జరీలు చేయించుకునేవారి సంఖ్య పెరుగుతోంది. జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే 80శాతం అకాల హృద్రోగాలను, మధుమేహం వంటివాటిని నివారించవచ్చు. ఇందుకోసం కఠినమైన డైట్‌లు, గంటల తరబడి జిమ్‌ చేయాల్సిన పనిలేదు. రోజూ కనీసం 15 నిమిషాలు శారీరక శ్రమ చేయడం, కూర్చుని పనిచేసేవారు ప్రతి గంటకూ 2 నిముషాలు నడవడం వంటివి ఎంతో మేలు చేస్తాయి. వృద్ధాప్యంలోనూ ఎవరిపైనా ఆధారపడకుండా నడవడానికి, మెట్లు ఎక్కడానికి సాధారణ స్ర్టెంత్‌ వ్యాయామాలు చేయాలి. వారాంతాల్లో ఎక్కువ సేపు నిద్రపోయి సరిపెట్టుకోవడం కాకుండా.. రోజూ ఒకే సమయానికి నిద్రపోయి, ఒకే సమయానికి లేచే క్రమశిక్షణ పాటించాలి. అన్నింటికంటే ముఖ్యంగా వ్యాధి లక్షణాలు బయటపడ్డాక అసుపత్రికి వెళ్లడం కాకుండా.. ఏటా విజరల్‌ ఫ్యాట్‌, బ్లడ్‌ షుగర్‌, కొలెస్ర్టాల్‌, థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకోవడం ద్వారా 12 ఏళ్ల ‘హెల్త్‌స్పాన్‌ గ్యాప్‌’ను అధిగమించవచ్చు.

- డాక్టర్‌ వి.శ్రీనివాస్‌,

ఎండి- ఇంటర్నల్‌ మెడిసిన్‌,

యశోద హాస్పిటల్‌, హైదరాబాద్‌

Updated Date - Nov 17 , 2026 | 04:44 AM