Share News

ప్రియురాలిపై రూ.3.5 కోట్ల ఖర్చు.. బ్రేకప్‌ తర్వాత తిరిగి ఇవ్వాలంటూ కేసు.. చివరకు సీఈవోకు షాక్‌

ABN , Publish Date - Sep 12 , 2026 | 07:46 PM

ప్రియురాలిపై దాదాపు రూ.3.5 కోట్లు ఖర్చు చేసిన భారత సంతతికి చెందిన ఓ సీఈవోకు బ్రేకప్‌ తర్వాత ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తాను ఖర్చు చేసిన మొత్తాన్ని ఆమె రుణంగా తీసుకున్నారని, తిరిగి చెల్లించాలంటూ సింగపూర్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే..

ప్రియురాలిపై రూ.3.5 కోట్ల ఖర్చు.. బ్రేకప్‌ తర్వాత తిరిగి ఇవ్వాలంటూ కేసు.. చివరకు సీఈవోకు షాక్‌
Chandar Aggarwal Felicia Lee

ఇంటర్నెట్ డెస్క్: ప్రియురాలిపై కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఓ సీఈవోకు బ్రేకప్‌ తర్వాత షాక్‌ తగిలింది. తాను ఖర్చు చేసిన డబ్బును తిరిగి ఇవ్వాలని మాజీ ప్రియురాలిపై కోర్టులో కేసు వేశారు. అయితే కోర్టు మాత్రం ఆ డబ్బులో ఎక్కువ భాగం బహుమతులేనని తేల్చింది. భారతీయ లాజిస్టిక్స్‌ సంస్థ టీసీఐ ఎక్స్‌ప్రెస్‌ లిమిటెడ్‌ సీఈవో, ఎండీ చందర్‌ అగర్వాల్‌ తన మాజీ ప్రియురాలు ఫెలీషియా లీ కోసం దాదాపు రూ.3.5 కోట్లు ఖర్చు చేశారు. వారిద్దరూ కొంతకాలం ప్రేమలో ఉన్నారు. ఈ సమయంలో ఆమె కోసం ఖరీదైన వస్తువులు కొనడంతో పాటు పలు ఇతర ఖర్చులు చేశారు.

అయితే కొంతకాలం తర్వాత ఇద్దరూ విడిపోయారు. దీంతో తాను ఆమె కోసం ఖర్చు చేసిన రూ.3.5 కోట్లను తిరిగి ఇవ్వాలని అగర్వాల్‌ కోరారు. ఆ డబ్బును తాను వడ్డీ లేని రుణంగా ఇచ్చానని, ఆమె తిరిగి చెల్లించాల్సి ఉందని వాదిస్తూ సింగపూర్‌ హైకోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు ఆయన వాదనను అంగీకరించలేదు. అగర్వాల్‌ ఖర్చు చేసిన డబ్బులో ఎక్కువ భాగం లీకి ఇచ్చిన బహుమతులేనని న్యాయమూర్తి తేల్చారు. అందువల్ల ఆ మొత్తాన్ని ఆమె తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో ప్రియురాలిపై ఖర్చు చేసిన డబ్బును తిరిగి పొందాలనుకున్న సీఈవోకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.


ఖరీదైన బహుమతులు.. విదేశీ పర్యటనలు

అగర్వాల్‌, లీ తొలిసారి 2019లో ఓ విమానంలో కలుసుకున్నారు. ఆ తర్వాత 2022 సెప్టెంబరులో ఇద్దరి మధ్య ప్రేమ బంధం మొదలైంది. అయితే లీ తనను మోసం చేస్తోందని అగర్వాల్‌ అనుమానించడంతో 2023 డిసెంబరులో ఇద్దరూ విడిపోయారు. వీరి బంధం కొనసాగిన సమయంలో అగర్వాల్‌ లీ కోసం భారీగా ఖర్చు చేశారు. హెర్మెస్‌, డియోర్‌, ప్రాడా వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఖరీదైన వస్తువులను కొనిచ్చారు. అలాగే ఫస్ట్‌క్లాస్‌ విమాన ప్రయాణాలు, విదేశీ పర్యటనలు, జీవిత బీమా ప్రీమియంలు, క్రెడిట్‌ కార్డు ఖర్చులు, స్టాన్‌ఫోర్డ్‌-ఎన్‌యూఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌ ఫీజు వంటి వాటికీ డబ్బు చెల్లించారు.

లీ నివసించే ఫ్లాట్‌కు ఫెంగ్‌షుయ్‌ నిపుణుడి సలహాలు తీసుకునేందుకు కూడా అగర్వాల్‌ సుమారు 17 వేల సింగపూర్‌ డాలర్లు ఖర్చు చేశారు. అయితే తనకు ఫెంగ్‌షుయ్‌పై నమ్మకం లేదని, అందుకే ఆ మొత్తాన్ని కూడా రుణంగానే పరిగణించాలని ఆయన కోర్టులో వాదించారు. కానీ కోర్టు మాత్రం ఈ వాదనను అంగీకరించలేదు. ఫెంగ్‌షుయ్‌ సేవలను అగర్వాల్‌ స్వయంగా ఏర్పాటు చేశారని గుర్తించింది.


రుణంగా ఇచ్చినట్లు ఆధారాలు లేక..

తన వద్ద నుంచి లీ డబ్బును అప్పుగా తీసుకున్నారని, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని ఆమె అంగీకరించిందని అగర్వాల్‌ కోర్టుకు తెలిపారు. ఇందుకు ఆధారంగా లీ పేరులోని మొదటి అక్షరాలు ఉన్న ఓ చేతిరాత పత్రాన్ని కూడా సమర్పించారు. అయితే ఆ పత్రంపై తాను సంతకం చేయలేదని లీ కోర్టుకు చెప్పారు. లీ డబ్బును రుణంగా అడిగారని, తిరిగి చెల్లించేందుకు అంగీకరించారని నిరూపించేంత బలమైన ఆధారాలను అగర్వాల్‌ సమర్పించలేకపోయాడు. అంతేకాదు.. లీ ఖర్చులను తానే భరిస్తానని అగర్వాల్‌ పలుమార్లు చెప్పినట్లు ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి తెలిపారు. అలాగే ఆమెకు ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు కూడా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఆ మొత్తాన్ని రుణంగా ఇచ్చినట్లు అగర్వాల్‌ చేసిన వాదనకు తగిన ఆధారాలు లేవని కోర్టు తేల్చింది.


బహుమతులే.. రుణాలు కావు

తీర్పు సందర్భంగా సీనియర్‌ జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. అగర్వాల్‌.. లీ పట్ల ఆకర్షితుడై, ఇష్టపూర్వకంగానే ఆమెకు ఖరీదైన బహుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఇద్దరూ విడిపోయిన తర్వాత అగర్వాల్‌ అసంతృప్తికి గురయ్యారని, తాను ఖర్చు చేసిన డబ్బును తిరిగి పొందేందుకు ప్రయత్నించారని తెలిపారు. అగర్వాల్‌ లీ కోసం చేసిన ఖర్చులన్నీ రుణాలు కాదని, ఎక్కువ భాగం ఆమెకు ఇచ్చిన బహుమతులేనని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆ మొత్తాన్ని లీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చింది. అంతేకాకుండా ఈ కేసులో లీ తరఫున అయిన న్యాయ ఖర్చులను కూడా అగర్వాల్‌ భరించాలని ఆదేశించింది.


Also Read:

ఐర్లాండ్ వ్యక్తి ప్రశ్నకు గ్రోక్ అద్భుత సమాధానం.. ఎలాన్ మస్క్ స్పందనిదే..

1980ల రెట్రో ఫొటో ఎడిటింగ్ ట్రెండ్ ఫాలో అవుతున్నారా.. అయితే జాగ్రత్త..

Updated Date - Sep 12 , 2026 | 07:56 PM