Share News

సముద్రంలో కదిలే టౌన్‌‘షిప్‌’

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:00 PM

పడవలో మహా అంటే పదిమంది ప్రయాణిస్తారు. అదే పెద్ద షిప్‌ అయితే వంద మంది ఉంటారు. కానీ ఈ మహాక్రూజ్‌లో మాత్రం ఏకంగా పదివేల మంది ప్రయాణించే చోటుంటుంది. అందుకే ప్రపంచంలోనే అతి పెద్ద క్రూజ్‌ షిప్‌గా ‘ఐకాన్‌ ఆఫ్‌ ది సీస్‌’ గుర్తింపు పొందింది.

సముద్రంలో కదిలే టౌన్‌‘షిప్‌’

నడి సంద్రంలో అలల సవ్వడి వింటూ నిద్రలేవడం, సూర్యోదయంలో మెరిసే నీటిని చూస్తూ కాఫీ సిప్‌ చేయడం... మాటల్లో వర్ణించలేం. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్‌లో ప్రయాణిస్తూ ఆ అనుభూతి పొందితే.... ఆ మధుర జ్ఞాపకాలను జీవితాంతం మరిచిపోలేం. ఇరవై అంతస్తుల్లో సకల సదుపాయాలతో సముద్రజలాలపై తేలియాడే టౌన్‌‘షిప్‌’... రాయల్‌ కరేబియన్‌కు చెందిన ‘ఐకాన్‌ ఆఫ్‌ ది సీస్‌’ క్రూజ్‌....

పడవలో మహా అంటే పదిమంది ప్రయాణిస్తారు. అదే పెద్ద షిప్‌ అయితే వంద మంది ఉంటారు. కానీ ఈ మహాక్రూజ్‌లో మాత్రం ఏకంగా పదివేల మంది ప్రయాణించే చోటుంటుంది. అందుకే ప్రపంచంలోనే అతి పెద్ద క్రూజ్‌ షిప్‌గా ‘ఐకాన్‌ ఆఫ్‌ ది సీస్‌’ గుర్తింపు పొందింది. సాగర జలాలపై తేలియాడే ఈ టౌన్‌‘షిప్‌’... ఎంత పొడవు ఉంటుందంటే... 35 బస్సులను వరుసగా ఒకదాని వెనక ఒకటి పెట్టినంతగా. ఇక దీని బరువు టైటానిక్‌ షిప్‌ కన్నా ఐదు రెట్లు ఎక్కువ. 20 అంతస్తుల్లోని సౌకర్యాలు చూస్తే మాత్రం మళ్లీ మళ్లీ క్రూజ్‌ ఎక్కాల్సిందే అంటారెవరైనా. 1200 అడుగుల పొడవున్న ఈ క్రూజ్‌లో 7,500 మంది ప్రయాణికులను అనుమతిస్తారు. వారి అవసరాలను అనుక్షణం కనిపెట్టుకుని తీర్చేందుకు 2,350 మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తుంటారు.


book7.2.jpgసకల సదుపాయాలు

ఈ క్రూజ్‌లో ఎనిమిది రకాల ప్రదేశాలు ప్రయాణికులను విశేషంగా అలరిస్తాయి. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి డైనింగ్‌ వరకు, కిడ్స్‌ ప్లే ఏరియా నుంచి అడల్ట్స్‌ ఓన్లీ ఒయాసిస్‌ జోన్లు ప్రయాణికులకు రాత్రింబవళ్లు కావాల్సినంత వినోదాన్ని పంచుతాయి. రుచికరమైన భోజనంతో పాటు 40 రకాల లిక్కర్‌, కాక్‌టెయిల్స్‌, మిల్క్‌షేకులు, ఇతర డ్రింకులు లభిస్తాయి. క్రూజ్‌లో మరో ప్రధానాకర్షణ ఆక్వాడోమ్‌. సాయంత్రం వేళల్లో ఆక్వా థియేటర్‌లో డైవింగ్‌ విన్యాసాలు ఆకట్టుకుంటాయి. రెండు బార్లు, డైనింగ్‌ రెస్టారెంట్లు ఉన్నాయి. రాయల్‌ కరేబియన్‌లోని మొదటి ఫుడ్‌హాల్‌ కాన్సెప్ట్‌ అయినటువంటి ఆక్వాడోమ్‌ మార్కెట్‌లో భోజనప్రియులు పండగ చేసుకోవచ్చు. క్రూజ్‌లో మరో ఆకర్షణ సెంట్రల్‌ పార్క్‌. అక్కడ కొన్ని వేల మొక్కలు కొలువుదీరి ఉంటాయి. వాటిని చూస్తూ ఎవరైనా సంభ్రమాశ్చర్యాలకు గురి కావాల్సిందే. క్రూజ్‌లో ఉన్నామా? పార్కులో తిరుగుతున్నామా? అనే సందేహం కలుగుతుంది. అక్కడ కూర్చుని రాత్రుళ్లు నక్షత్రాలను చూస్తూ నచ్చిన డ్రింక్‌ సిప్‌ చేయవచ్చు. సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించవచ్చు.


ఏడు ఈత కొలనులు...

ఇప్పటిదాకా క్రూజ్‌లలో ఒకటి రెండు ఈతకొలనులు ఉండటమే ఎక్కువ. కానీ ఇందులో ఏకంగా ఏడు ఈత కొలనులున్నాయి. డెక్‌ చైర్స్‌లో కూర్చుని డ్రింక్స్‌ సేవిస్తూ చిల్‌ కావచ్చు. అందుకే ఈ ప్రదేశాన్ని ‘చిల్‌ ఐలాండ్‌’ అంటారు. సూర్యాస్తమయంలో లైవ్‌ మ్యూజిక్‌ వింటూ ఎంజాయ్‌ చేయడమనేది మరో మర్చిపోలేని అనుభవం. కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేసేందుకు సర్ఫ్‌సైడ్‌ బెస్ట్‌ ఆప్షన్‌. యంగ్‌ ట్రావెలర్స్‌ కోసం డిజైన్‌ చేసిన ప్రదేశం ఇది. ముఖ్యమైన అతిథులు ఉంటే వారికోసం ప్రైవేట్‌ పూల్‌, బార్‌, రెస్టారెంట్‌ను కేటాయిస్తారు. ఆ ప్రదేశాన్ని ‘కోస్టల్‌ కిచెన్‌’ అని పిలుస్తారు.


book7.3.jpgమొత్తానికి ఈ క్రూజ్‌లో ప్రయాణించే వారికి అనుక్షణం వినోదానికి కొదవే ఉండదు. ప్యాకేజ్‌లోని ఏడు రాత్రులు ఇట్టే గడిచిపోతాయి. అర్థరాత్రి ఆకలి అనిపించిన వారి కోసం ప్రత్యేకంగా ‘పెరల్‌ కేఫ్స్‌’ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఇరవై నాలుగుగంటలు ఎప్పుడు కావాలన్నా స్నాక్స్‌, కాఫీ అందుబాటులో ఉంటాయి. రకరకాల దేశాల రుచులను ఆస్వాదించేందుకు ప్రత్యేకమైన డైనింగ్‌ ఏరియాలతో కలిపి మొత్తంగా క్రూజ్‌లో 40 డైనింగ్‌ వెన్యూలు ఉంటాయి. బోర్‌ కొడితే ఎంచక్కా షాపింగ్‌ కూడా చేసుకునే వీలుంటుంది. మొత్తానికి సాగర జలాలపై కదిలే ఒక భారీ టౌన్‌‘షిప్‌’ను గుర్తుకుతెస్తుంది. ఈ క్రూజ్‌లో ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది. అందుకే పర్యాటకులు ఛలో క్రూజ్‌ అంటుంటారు.


ఈ భారీ క్రూజ్‌లో ప్రయాణం చేయాలనుకుంటే రాయల్‌ కరేబియన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఆ సంస్థ వెబ్‌సైట్‌లో క్రూజెస్‌ ఆప్షన్‌ని సెలక్ట్‌ చేసి ‘ఐకాన్‌ ఆఫ్‌ ది సీస్‌’ని ఎంచుకోవాలి. టికెట్‌ ధర లక్ష రూపాయల నుంచి రెండున్నర లక్షల వరకు ఉంటుంది. రూమ్‌ టైప్‌ను బట్టి ప్యాకేజీలను సెలెక్ట్‌ చేసుకోవచ్చు. సాగర ప్రయాణంలో భాగంగా మియామి నుంచి బయలుదేరి మెక్సికోలోని హోండరస్‌కు చేరుకుంటుంది. రౌండ్‌ ట్రిప్‌ ప్రయాణం 7 రాత్రులు ఉంటుంది. కాస్త తక్కువ ధరలో టికెట్‌ బుక్‌ చేసుకోవాలనుకుంటే ఏడాది ముందుగానే ప్లాన్‌ చేసుకోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి.

ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

కుప్పానికి ప్రగతి కళ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 01 , 2026 | 12:00 PM