భార్యపై అర్ధరాత్రి వింత ఫిర్యాదు.. విచారణలో భర్త చెప్పింది విని నోరెళ్లబెట్టిన పోలీసులు
ABN , Publish Date - Jul 21 , 2026 | 04:22 PM
సాధారణంగా ఆస్తి, డబ్బు లేదా ఇతర కుటుంబ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదులు వస్తుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో దంపతుల మధ్య జరిగిన వివాదం ఆసక్తికరంగా మారింది..
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఆస్తి, డబ్బు లేదా ఇతర కుటుంబ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదులు వస్తుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో కూర విషయంలో దంపతుల మధ్య జరిగిన వివాదం ఆసక్తికరంగా మారింది. కూర విషయంలో దంపతుల మధ్య జరిగిన వివాదం పోలీసులను అర్థరాత్రి గ్రామానికి రప్పించింది. వజీర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నివసిస్తున్న దంపతుల మధ్య ఆదివారం రాత్రి కూర విషయంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భర్తకు వేపుడు అంటే ఇష్టం కాగా.. భార్య మాత్రం రోజూ పులుసు కూరనే వండేది. అదే విషయంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వివాదానికి దారితీసింది. ఎంత చెప్పినా భార్య తన మాట వినడం లేదని ఆగ్రహించిన భర్త చివరకు అత్యవసర సేవ డయల్ 112కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబంలో గొడవ జరుగుతోందని సమాచారం అందడంతో పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకున్నారు.
గ్రామానికి చేరుకున్న పోలీసులు.. అసలు విషయం తెలుసుకుని ఒక్కసారిగా అవాక్క య్యారు. తనకు రోజూ వేపుడు కూర కావాలని, కానీ తన భార్య ఎప్పుడూ పులుసు కూరే చేస్తోందని, తన మాట పట్టించుకోవడం లేదని పోలీసుల ఎదుట భర్త వాపోయాడు. మరోవైపు భార్య కూడా తన వాదనను వివరించింది. అనంతరం పోలీసులు ఇద్దరినీ ప్రశాంతంగా కూర్చోబెట్టి మాట్లాడించారు. కుటుంబ సభ్యులతో కూడా చర్చించి చిన్న విషయాన్ని పెద్ద గొడవగా మార్చుకోవద్దని సూచించారు. పరస్పర అవగాహనతో సమస్యను పరిష్కరించుకుని, ఒకరి అభిరుచిని మరొకరు గౌరవించాలని దంపతులకు సూచించారు. దీంతో ఇద్దరూ రాజీకి రావడంతో పోలీసులు ఫిర్యాదును ముగించారు. కూర వండిన విధానంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం అరుదైన ఘటన కావడంతో ఈ విషయం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
తండ్రిని కాపాడిన తనయుడు! వరద నీటిలో 3 గంటల పాటు ఈది..