తెగించిన దొంగలు.. కత్తితో బెదిరించి ట్రక్కు నుంచి డీజిల్ దోపిడీ.. వీడియో వైరల్
ABN , Publish Date - May 14 , 2026 | 07:21 AM
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో సాయుధ దొంగలు ఒక ట్రక్కు నుంచి డీజిల్‌ను దోచుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. పటాన్ బైపాస్ రోడ్డుపై సాయుధ దొంగలు ఒక ట్రక్కును అడ్డగించి, డ్రైవర్‌ను ప్రాణాలు తీస్తామని బెదిరించి డీజిల్‌ను దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో, పటాన్ బైపాస్ మీదుగా వెళ్తున్న ఒక ట్రక్కును కొందరు దుండగులు అడ్డుకున్నారు. వారి వద్ద కత్తులు, తుపాకులు వంటి మారణాయుధాలు ఉండటంతో డ్రైవర్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిందితులు డ్రైవర్‌ను ఆయుధాలతో బెదిరించి, ట్రక్కు ట్యాంకు నుంచి భారీగా డీజిల్‌ను కంటైనర్లలోకి నింపుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ దోపిడీ దృశ్యాలను ఎవరో మొబైల్‌లో చిత్రీకరించగా, అది కాస్తా వైరల్‌గా మారింది. ప్రధాన రహదారిపై, అందరూ చూస్తుండగానే ఇంత సాహసంగా దోపిడీకి పాల్పడటం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని, వైరల్ వీడియోను పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. హైవేలపై ప్రయాణించే డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
భారత రియలెస్టేట్ రంగంపై ఎన్నారై మహిళ కామెంట్.. నెట్టింట పోస్టు వైరల్
ఆ మహిళ తన భార్యే అని తెలియక భర్త చాటింగ్! చివరకు..