భారత రియలెస్టేట్ రంగంపై ఎన్నారై మహిళ కామెంట్.. నెట్టింట పోస్టు వైరల్
ABN , Publish Date - May 10 , 2026 | 01:28 PM
భారత రియలెస్టేట్ రంగంపై ఒక ఎన్నారై మహిళ పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో రియలెస్టేట్ రంగం పరిస్థితిపై ఒక ఎన్నారై మహిళ పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. యూకేలో ఇటీవలే ఒక ఇల్లు కొన్నామని నేహా శర్మ అనే మహిళ నెట్టింట పోస్టు పెట్టారు. అక్కడ నల్ల ధనం ప్రసక్తే లేదని కూడా అన్నారు. భారత్‌లో ఉండగా ఇద్దరి సంపాదన ఉన్నా కూడా తాము ఇల్లు కొనలేకపోయామని చెప్పారు. యూకేకు వెళ్లిన రెండేళ్లల్లోనే ఒక్కరి సంపాదనతో మూడు బెడ్‌రూమ్‌లు ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు కొన్నామని చెప్పారు. తమ ఇంట్లో అత్యాధునిక వసతులు అన్నీ ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. మొదటిసారి ఇల్లు కొంటున్నందుకు తమకు ఫస్ట్ టైమ్ బయ్యర్ డిస్కౌంట్ కూడా లభించిందని అన్నారు. ఇంటి కొనుగోలు సమయంలో తమను ఎవరూ బ్లాక్ మనీ ఇవ్వమని అడగలేదని అన్నారు.
ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. యూకేలో ఎన్నారైల అనుభవాలన్నీ ఒకేలా ఉండవని కొందరు చెప్పుకొచ్చారు. బ్రిటన్‌లో ఉంటున్న తన మిత్రుడు ఒకరు రెండు ఇళ్లు కొని రుణభారంతో సతమతం అవుతున్నారని ఒక నెటిజన్ తెలిపారు. భారతీయ రియలెస్టేట్ రంగం మధ్యతరగతి ఐటీ ఉద్యోగులపై ఆధారపడి లేదని మరో వ్యక్తి అన్నారు. ‘ఇలాంటి పోస్టులతో మార్పు వస్తుందని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. భారత్‌లో రియలెస్టేట్ రంగంలో వ్యాపారవేత్తలు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోళ్లు చేస్తుంటారు. మధ్యతరగతి ఐటీ ఉద్యోగులపై ఇక్కడి బిల్డర్‌లు ఆధారపడలేదు. అయితే, ఐటీ ఉద్యోగులు త్వరలో దిగువ మధ్యతరగతికి చేరుకుంటారు’ అని మరొక వ్యక్తి కామెంట్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
కృత్రిమ మేధ.. అన్నీ తానై.. అంతటా తానై
ఆ వీధిలో... అడుగడుగున పుస్తక రాశులు