మార్కెట్‌లోకి మళ్లీ గోల్డ్ స్పాట్.. ఢిల్లీలో అందుబాటులో ఉన్న ఓజీ డ్రింక్
ABN , Publish Date - Nov 29 , 2026 | 06:37 PM
ఒకప్పుడు అందరి నోళ్లను ఊరించిన గోల్డ్ స్పాట్.. మరోసారి పలకరిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: సరిగ్గా 26 సంవత్సరాల తరువాత మార్కెట్‌లోకి ఓజీ డ్రింక్ ‘గోల్డ్ స్పాట్’ మళ్లీ అడుగుపెట్టింది. ప్రస్తుతం ఇది దేశరాజధాని ఢిల్లీ వ్యాప్తంగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్‌లో అందుబాటులో ఉంది. ఒకప్పుడు అందరి నోళ్లను ఊరించిన ఈ శీతలపానీయం.. మరోసారి పలకరిస్తోంది. మొదట ఈ డ్రింక్ బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో లాంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో మాత్రమే లభ్యమవుతుందని ఈ నెల 25న సాఫ్ట్ డ్రింక్ కంపెనీ ది కోకా-కోలా ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా 1953లో ‘గోల్డ్ స్పాట్’ మొదటిసారి మార్కెట్‌లోకి వచ్చింది. 1980, 90ల కాలంలో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ శీతలపానీయం ఓ వెలుగు వెలిగింది. 1993లో దీన్ని పార్లే సంస్థ నుంచి ది కోకా-కోలా కొనేసింది. తరువాత తన అంతర్జాతీయ బ్రాండ్ ఫాంటా కొనుగోళ్లు పెంచుకునేందుకు.. ‘గోల్డ్ స్పాట్’ తయారీని 2000 సంవత్సరంలో నిలిపివేసింది. అప్పటి నుంచి ఈ డ్రింక్ పూర్తిగా కనుమరుగైంది. మళ్లీ 26 ఏళ్ల తరువాత ‘గోల్డ్ స్పాట్’ను మార్కెట్‌లోకి తెచ్చింది ది కోకా-కోలా. ప్రస్తుతం ‘నో-షుగర్’, ‘లో-షుగర్’ కేటగిరీల్లో ఈ డ్రింక్ అందుబాటులో ఉంది. కాగా ఈ ‘గోల్డ్ స్పాట్ 2.0’ని రుచి చూసిన వారు.. తమకు పాత రోజులు గుర్తొచ్చాయని చెబుతున్నారు. అయితే ఈ డ్రింక్‌ని కేవలం క్యాన్లలోనే ది కోకా-కోలా విక్రయిస్తోంది. గతంలో మాదిరిగా తమకు గాజుసీసాలో ‘గోల్డ్ స్పాట్’ కావాలని కొందరు కోరుకుంటున్నారు.
ఈ వార్తలూ చదవండి
నేపాల్‌లో భారతీయ మహిళకు షాక్.. గుహలో చిక్కుకుపోయి..
స్మార్ట్ కళ్లద్దాల చోరీ.. తనను తానే రికార్డు చేసుకున్న దొంగ