Share News

గులాబీ వజ్రాల్లో మోనాలిసా @ రూ.137 కోట్లు

ABN , Publish Date - Nov 12 , 2026 | 03:13 AM

లేత గులాబీ రంగులో అద్భుతంగా మెరిసిపోతున్న ఈ వజ్రాన్ని చూశారా..! దీనికి ‘గులాబీ రంగు వజ్రాల్లో మోనాలిసా’ అనే పేరుంది

గులాబీ వజ్రాల్లో   మోనాలిసా @  రూ.137 కోట్లు
diamond

  • మన గోల్కొండ గనుల్లో దొరికిన అపురూపమైన డైమండ్‌

లేత గులాబీ రంగులో అద్భుతంగా మెరిసిపోతున్న ఈ వజ్రాన్ని చూశారా..! దీనికి ‘గులాబీ రంగు వజ్రాల్లో మోనాలిసా’ అనే పేరుంది. ఈ వజ్రాన్ని పొదిగిన ఉంగరాన్ని క్రిస్టీస్‌ సంస్థ ఇటీవల జెనీవాలో వేలానికి పెడితే 12.1 మిలియన్‌ స్విస్‌ ఫ్రాంకుల ధర (అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.137 కోట్ల రూపాయలు) పలికింది. ప్రయోగశాలల్లో తయారుచేసే సింథటిక్‌ వజ్రాల సంగతి పక్కన పెడితే.. భూమిలో లభించే వజ్రాల్లో ఈ రంగువి అత్యంత అరుదు. భూమిలో దొరికే ప్రతి 100 వజ్రాల్లో ఈ రంగువి సగటున రెండే ఉంటాయి. అది కూడా సగటున ఒక క్యారెట్‌లోపే బరువుంటాయి. కానీ ఇది ఏకంగా 24 క్యారెట్ల బరువున్న టైప్‌-2ఏ వజ్రం కావడం విశేషం. ‘టైప్‌2ఏ’ అంటే.. నైట్రోజన్‌, బోరాన్‌ పరమాణువులు లేకుండా దాదాపు స్వచ్ఛమైన కర్బన అణువులతోనే ఏర్పడిన వజ్రాలు. ఇవి మరీ అరుదు. ఇంకో విశేషం ఏంటంటే.. ప్రపంచ ప్రసిద్ధ వజ్రాలైన కోహినూర్‌, హోప్‌ డైమండ్‌ వంటివాటికి పుట్టినిల్లయిన గోల్కొండ మైన్స్‌లోనే ఈ వజ్రం కూడా లభ్యమైంది. కానీ, దశాబ్దాల క్రితమే విదేశాలకు తరలిపోయింది! ఇటలీకి చెందిన ప్రముఖ లగ్జరీ బ్రాండ్‌ సంస్థ 1950ల్లో దీన్ని ఒక ఉంగరంలో పొదిగి విక్రయించింది. అందుకే దీనికి బుల్గారీ పింక్‌ డైమండ్‌గా పేరు. 70 ఏళ్లుగా ఇది ఒక ప్రైవేటు వ్యక్తి సేకరణలో ఉంది.

ఇవి కూడా చదవండి..

వివాహేతర బంధంపై అభ్యంతరం.. ప్రియుడితో కలిసి కుమారుడిని చంపిన తల్లి

దీపావళి వస్తేనే కాలుష్యం గుర్తుకొస్తోందా.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Nov 12 , 2026 | 04:21 AM