Share News

బస్సును ప్రమాదం నుంచి బయటపడేసిన విద్యార్థులు.. వీడియో వైరల్..

ABN , Publish Date - Apr 30 , 2026 | 03:52 PM

ఉత్తర అమెరికాలోని మిసిసిపీలో ఓ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థుల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చిన్న వయసులోనే తోటి వారిని పెను ప్రమాదం నుంచి తప్పించడాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..

బస్సును ప్రమాదం నుంచి బయటపడేసిన విద్యార్థులు.. వీడియో వైరల్..
Mississippi Students Save Driver

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికాలోని మిసిసిపీలో ఓ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థుల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చిన్న వయసులోనే తోటి వారిని పెను ప్రమాదం నుంచి తప్పించడాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రాణాలకు తెగించి ఇతరులను కాపాడిన వారిని చూసి శభాష్ అంటున్నారు. విద్యార్థుల ధైర్యసాహసాలు, తెగువ, సమయస్ఫూర్తికి నెటిజన్లు సలామ్ కొడుతున్నారు. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..


హాన్కాక్ కౌంటీ స్కూల్ డిస్ట్రిక్ట్ బస్సు డ్రైవర్ లియా టేలర్‌ విద్యార్థులను పాఠశాల నుంచి ఇళ్లకు తీసుకెళ్తోంది. స్కూల్ నుంచి బయలుదేరిన కాసేపటికే మార్గమధ్యంలో డ్రైవర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. ఆస్తమా కారణంగా ఊపిరాడక అకస్మాత్తుగా స్పృహ కోల్పోయింది. ఇది గమనించిన ఓ విద్యార్థిని మిగతా వారిని అలర్ట్ చేసింది. స్పృహ కోల్పోయిన డ్రైవర్‌ను లేపేందుకు ప్రయత్నించగా కొన్ని సెకన్లపాటు మేల్కొంది.


అనంతరం మళ్లీ స్పృహ కోల్పోయి స్టీరింగ్‌పై పడిపోయింది. డ్రైవర్ చుట్టూ చేరిన ఐదుగురు విద్యార్థులు సమయస్ఫూర్తితో స్పందించారు. ఓ బాలుడు స్టీరింగ్ పట్టుకుని ఇతర వాహనాలను, డివైడర్‌ను ఢీకొట్టకుండా చూసుకున్నాడు. అనంతరం అతి కష్టం మీద బ్రేక్ నొక్కి బస్సును ఆపేశాడు. ఓ విద్యార్థిని వెంటనే డ్రైవర్‌కు నెబ్యులైజర్‌తో శ్వాస అందించింది. పోలీసులు, వైద్య సిబ్బందికి మరో విద్యార్థిని సమాచారం అందించింది. ఇలా ఐదుగురు విద్యార్థులు పెను ప్రమాదం నుంచి తమను, తోటి విద్యార్థులను రక్షించుకున్నారు.


విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం ఐదుగురు చిన్నారులను అభినందించింది. బస్సులో దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాజాగా వైరల్‌గా మారింది. విద్యార్థుల ధైర్యసాహసాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

బైక్‌కు ట్రాలీ కట్టి.. అందులో చిన్న పిల్లలతో ప్రయాణం

ఇదెక్కడి ట్యాలెంట్ నాయనా.. ఇటుకలు, సిమెంట్‌తో కారును ఎలా రిపేర్ చేస్తున్నాడో చూడండి..

Updated Date - Apr 30 , 2026 | 04:22 PM