Share News

‘ఎకో’ గ్రామాలు.. యువతరం గమ్యస్థానాలు..

ABN , Publish Date - Jan 25 , 2026 | 09:26 AM

నాగాలాండ్‌ రాజధాని కోహిమాకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ‘కోనోమా’. పొదరిల్లు లాంటి ఈ గ్రామం ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఆకుపచ్చని గ్రామం’గా రికార్డుల కెక్కింది. గత 700 ఏళ్లుగా అనగామి నాగా తెగ ప్రజల ఆవాస నిలయం ఈ గ్రామం.

‘ఎకో’ గ్రామాలు.. యువతరం గమ్యస్థానాలు..

ఎప్పుడూ ఆకాశహర్మ్యాలు... తళుకుబెళుకులు... వింతలూ విశేషాల మహానగరాల దగ్గరికేనా పరుగులు? ‘‘ఈసారి కాస్త రూటు మార్చుకుని, పచ్చదనం, స్వయం సమృద్ధి, స్వచ్ఛతతో... ఆహ్వానిస్తున్న ‘ఎకో విలేజ్‌’లను చూసొద్దాం’’ అంటోంది యువ పర్యాటకం. నేడు (25) ‘జాతీయ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా... మనదేశంలో ప(స్వ)చ్చదనానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన కొన్ని ‘ఎకో’ గ్రామాల విశేషాలివి...

ఊరంతా కోటీశ్వరులే...

హివారే బజార్‌... మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఓ గ్రామం. ఒకప్పుడు ఇక్కడ 12 శాతం మాత్రమే సాగుభూమి ఉండేది. వర్షాకాలంలో మాత్రమే బావుల్లో నీళ్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ గ్రామంలో దాదాపు వంద మంది కోటీశ్వరులు నివసిస్తున్నారు. ఒక నిర్ణయం గ్రామ రూపురేఖల్ని ఎలా మారుస్తుందో తెలుసుకోవడానికి కేస్‌స్టడీగా ‘హివారే బజార్‌’ను చూపుతాయి అంతర్జాతీయ సంస్థలు. 1989లో సర్పంచ్‌గా ఎన్నికైన పోపట్‌ రావు పవార్‌ ఎన్నో సంరక్షణ పథకాలను అంచెలంచెలుగా రూపొందించి... నీటి నిల్వలు, అటవీ సంపద, వ్యవసాయోత్పత్తి పెంపొందేలా చేశారు. గ్రామస్తులంతా కలిసి సమష్టిగా సాధించిన విజయం ఇది. అంతా పచ్చదనం, పొలాలు, పూల వనాలు, పండ్ల తోటలు, అడుగడుగునా చెక్‌ డ్యామ్‌లు... ‘హివారే బజార్‌’ను చూస్తే స్వర్గం ఎక్కడో లేదనిపిస్తుంది.


ప్రపంచానికి ఆశాకిరణం

భారతదేశంలో స్వయం సమృద్ధి సాధించిన తొలి గ్రామం ‘ఒదాంతురరై. తమిళనాడులోని కోయంబత్తూర్‌ జిల్లాలో ఉన్న ఒదాంతురైను స్మార్ట్‌ విలేజ్‌గా అభివర్ణిస్తారు. పునరుత్పాదక వనరులైన సూర్యరశ్మి, పవన విద్యుచ్ఛక్తిలతో సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి... స్వయం సమృద్ధి సాధించిందీ గ్రామం. తమ అవసరాలు తీరాక, మిగిలిన విద్యుత్తును ప్రభుత్వానికి అమ్ముతున్నారు. అలా వచ్చిన ఆదాయాన్ని గ్రామ అభివృద్ధికి వినియోగిస్తూ స్మార్ట్‌ విలేజ్‌ లిస్టులో చేర్చారు. చక్కటి ఇళ్లు, విశాలమైన రోడ్లు, వసతులు, పారిశుద్ధ్యం లాంటి అన్ని వసతులను ఓ ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసుకుని, గ్రామీణ జీవనానికి ఇదొక రోల్‌ మోడల్‌గా నిలిచింది. అంతేకాదు... పునరుత్పాదక వనరులకు సంబంధించి... ప్రపంచానికి ‘ఒదాంతురై’ ఓ ఆశాకిరణం.


మూడు ఒకట్ల గ్రామం...

book3.2.jpg‘ఆడపిల్ల పుట్టిందోచ్‌’ అని గర్వంగా చెప్పుకునే గ్రామం ‘పిప్లాంత్రి’. రాజస్థాన్‌లోని రాజసమంద్‌ జిల్లాలో ఓ మారుమూల గ్రామమిది. మహిళా సాధికారత, పర్యావరణం, పచ్చదనం, శిశుసంక్షేమానికి సంబంధించి ఆ కుగ్రామమే పెద్ద ఉదాహరణగా నిలిచింది. ఒకప్పుడు ఈ గ్రామంలో నీటి ఎద్దడి మామూలుగా ఉండేది కాదు. 800 అడుగుల లోతులో నీళ్లు ఉండేవి. అలాంటిది ఇప్పుడు పది అడుగుల లోపే నీళ్లు అందుతున్నాయి. కారణం... సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఆ గ్రామ సర్పంచ్‌ శ్యామ్‌ సుందర్‌ చేపట్టిన వినూత్న పథకం.


ఆడపిల్ల పుట్టిన వెంటనే గ్రామస్తులంతా కలిసి ఆమె పేరు మీద 111 మొక్కలు నాటుతారు. అలాగే వారంతా కలిసి 21 వేల రూపాయలు జమచేసి తల్లిదండ్రులకు ఇస్తారు. వాళ్లు ఆ డబ్బుకు మరో 10 వేల రూపాయలు జతచేసి ఆ పాప పేరు మీద బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తారు. ఆమెకు ఇరవై ఏళ్లు దాటిన తరవాతే ఆ డబ్బును వినియోగించొచ్చు. గ్రామంలో నాటిన 111 మొక్కలనూ సామూహికంగా పెంచుతారు. అలా ఇప్పుడక్కడ వెయ్యి హెక్టార్ల స్థలంలో పచ్చదనం విస్తరించి, గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ‘పిప్లాంత్రి’ జీవనాన్ని అధ్యయనం చేయడానికి ఎక్కడెక్కడి నుంచో పరిశోధకులు అక్కడ వాలుతారు.


దేవుడి సొంత పూదోట...

book3.3.jpgమేఘాలయలోని ‘మవ్లిన్నాంగ్‌’ గ్రామం గురించి చెప్పాలంటే... అందాల లోయలు, స్వచ్ఛమైన సరస్సులతో అలలారుతుంది. అంతేకాదు... అక్కడి స్థానికులు అద్భుతమైన క్రమశిక్షణగలవారని గొప్పగా చెప్పాలి. ఎందుకంటే అక్కడ అన్నీ అద్దంలా మెరిసే రోడ్లే. ఎక్కడ చూసినా పచ్చదనమే. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారు. ఎండిపోయి, రాలిన ఆకుల్ని కూడా ఎత్తి చెత్తబుట్టల్లో వేస్తూ తమ గ్రామాన్నంతా స్వచ్ఛంగా తీర్చిదిద్దుకుంటున్నారు అక్కడి ఖాసీ ప్రజలు. అందుకే మవ్లిన్నాంగ్‌కు ‘దేవుడి సొంత పూదోట’ అనే పేరు వచ్చింది. 2003లోనే ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా ‘డిస్కవర్‌ ఇండియా’ మ్యాగజైన్‌ మవ్లిన్నాంగ్‌ను గుర్తించింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ఈ గ్రామం అంతా కొండా కోనలమయమే. నగరంలోని రణగొణ ధ్వనులకు దూరంగా... హాయిగా సేదతీరాలనుకునే వారు మవ్లిన్నాంగ్‌కు క్యూ కడుతుంటారు.


నిజాయితీకి చిరునామా

book3.4.jpgనాగాలాండ్‌ రాజధాని కోహిమాకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ‘కోనోమా’. పొదరిల్లు లాంటి ఈ గ్రామం ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఆకుపచ్చని గ్రామం’గా రికార్డుల కెక్కింది. గత 700 ఏళ్లుగా అనగామి నాగా తెగ ప్రజల ఆవాస నిలయం ఈ గ్రామం. వీరు నీతి నిజాయితీకి ఎంతో ప్రాముఖ్యం ఇస్తారు. అందుకేనేమో ఈ గ్రామంలో ఇళ్లకే కాదు షాపులకూ తాళం ఉండదు. కావాల్సిన వస్తువుని తీసుకుని, అక్కడ పేర్కొన్న డబ్బును వేసి వెళ్తుంటారు గ్రామస్థులు. ఈనాటికీ అంచెలంచెల వ్యవసాయంలో వరి సాగు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. సహజ పర్యావరణాన్ని, పూర్వీకుల సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం గ్రామస్థులు పాటుపడుతున్నారు. పోడు వ్యవసాయ పద్ధతులను కోనోమాలో పాటిస్తున్నారు. నమ్మకం, పరస్పర సహకారం వీరి సమాజంలో ఎంతో ముఖ్యమైనవి. ఇన్ని విశేషాలున్నాయి కాబట్టే కోనోమాను చూడడానికి ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తుంటారు.


చెత్త కనిపించదు...

book3.5.jpgమన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సర్పంచ్‌ ఎన్నిక లేని గ్రామం ‘బఘువార్‌’. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఎన్నో విశేషాలతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించిన గ్రామం ఇది. ఇక్కడ ప్రతి ఇంటికీ బయోగ్యాస్‌ ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. ఇంటింటికీ భూగర్భ మురుగు కాలువ ఉండడం విశేషం. 2007లోనే పూర్తి పారిశుద్ధ్య గ్రామంగా బఘువార్‌ పేరు తెచ్చుకుంది. స్వచ్ఛతకు మారుపేరైన ఈ గ్రామంలో ఎక్కడా చెత్తాచెదారం కనిపించదు. ఈ విషయంలో ఇప్పటికే రికార్డులకెక్కింది. వంటలకే కాదు... గ్రామంలో విద్యుచ్ఛక్తికీ బయోగ్యాస్‌ను ఉపయోగిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో అత్యధిక బయోగ్యాస్‌ ప్లాంట్‌లున్న గ్రామం ఇదే.

రెగ్యులర్‌ పట్టణాలు, నగరాలకు కాకుండా ఇలాంటి ప్రత్యేకతలున్న ‘ఎకో’ గ్రామాలను చూసేందుకు యువతరం ఆసక్తిని చూపుతోంది. సోషల్‌ మీడియాలో ఇలాంటి గ్రామాలకు ప్రచారం బాగానే లభిస్తోంది. దాంతో జాతీయంగానే కాకుండా, అంతర్జాతీయంగా కూడా వీటికి గుర్తింపు వస్తోంది. ప్రస్తుతం నవతరం పర్యాటకరంగం లిస్టులో వీటికి పెద్దపీట వేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి.

చిల్లర పనులకు రాలేదు

అమరావతిని అడ్డుకోలేరు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 25 , 2026 | 09:39 AM