Share News

CNG స్టేషన్‌లో గ్యాస్ నింపుతుండగా పేలిన కారు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:26 PM

కర్జాన్‌లోని CNG స్టేషన్‌లో గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా కారు పేలిపోయింది. కర్జాన్ సమీపంలోని NH-48పై అక్టోబర్ 1న జరిగిన ఈ ఘటనతో స్టేషన్ పరిసరాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

CNG స్టేషన్‌లో గ్యాస్ నింపుతుండగా పేలిన కారు.. త్రుటిలో తప్పిన ప్రమాదం
CNG Station Car Explosion

ఇంటర్నెట్ డెస్క్: జాతీయ రహదారి-48పై కర్జాన్ సమీపంలోని ఓ CNG స్టేషన్‌లో గ్యాస్ నింపుతుండగా కారు పేలిపోయింది. అక్టోబర్ 1న మధ్యాహ్నం జిందాల్ కంపెనీకి ఎదురుగా ఉన్న CNG స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. గ్యాస్ నింపే సమయంలో కారు CNG ట్యాంక్ పగిలిపోవడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతినగా, కిటికీలు పగిలిపోయాయి. లోహం, గాజు శకలాలు కొన్ని మీటర్ల దూరం వరకు ఎగిరిపడటంతో స్టేషన్ పరిసరాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో సమీపంలో ఉన్న మరో రెండు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.


అయితే.. అదృష్టవశాత్తూ పేలుడు జరిగిన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే కర్జాన్ అగ్నిమాపక బృందం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తదుపరి అగ్నిప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక సిబ్బంది ముందుజాగ్రత్త చర్యలు చేపట్టగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు CNG ట్యాంక్ పగిలిపోవడమే కారణంగా తెలుస్తున్నప్పటికీ, ట్యాంక్ ఎందుకు పగిలిందన్న ఖచ్చితమైన కారణం వెంటనే తెలియరాలేదు. ఘటనకు దారితీసిన పరిస్థితులతో పాటు CNG స్టేషన్‌లోని భద్రతా ఏర్పాట్లపై అధికారులు పరిశీలన ప్రారంభించారు. ఇంధనం నింపే సమయంలో ప్రయాణికులు వాహనం నుంచి బయటకు దిగాలనే భద్రతా నిబంధన ప్రాధాన్యతను ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

పోలవరం పనులు పరిశీలించిన పీపీఏ సీఈవో

Updated Date - Oct 04 , 2026 | 01:46 PM