Share News

ఢిల్లీ మెట్రోలో మహిళ ఫొటోలు తీసిన సీఐఎస్ఎఫ్ జవాన్.. వీడియో వైరల్..

ABN , Publish Date - Aug 17 , 2026 | 07:37 AM

ఓ మహిళకు తెలియకుండా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి చెందిన జవాన్ ఫొటోలు తీయడం కలకలం రేపింది. మహిళ సహా తోటి ప్రయాణికులు ఆ జవానును ప్రశ్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఢిల్లీ మెట్రోలో మహిళ ఫొటోలు తీసిన సీఐఎస్ఎఫ్ జవాన్.. వీడియో వైరల్..
CISF jawan

న్యూఢిల్లీ: ఓ మహిళకు తెలియకుండా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(CISF)కి చెందిన జవాన్ ఫొటోలు తీయడం కలకలం రేపింది. మహిళ సహా తోటి ప్రయాణికులు ఆ జవానును ప్రశ్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారి మధ్య వాగ్వాదం కాస్తా తోపులాట, ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన ఢిల్లీ మెట్రో రైలులో జరగ్గా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


శనివారం అర్ధరాత్రి ఢిల్లీ మెట్రోలో ఓ మహిళ ప్రయాణిస్తోంది. సీఐఎస్ఎఫ్ జవాన్ కూడా అదే రైలులో ఉన్నాడు. అయితే, మహిళకు తెలియకుండా ఆమె ఫొటోలను అతను తీశాడు. ఇది గమనించిన ప్రయాణికురాలు.. జవాన్ వద్దకు వెళ్లి నిలదీసింది. తన ఫొటోలు ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించింది. మహిళతో పాటు తోటి ప్రయాణికులూ సదరు వ్యక్తిని నిలదీశారు. తాను ఫొటోలు తీయలేదని జవాన్ గట్టిగా వాదించాడు. అయితే ఫోన్‌లోని ఫొటో గ్యాలరీని చూపించాలని వారంతా డిమాండ్ చేశారు. ఇందుకు తొలుత అతను ఒప్పుకోకపోవడంతో.. తర్వాత చూపించక తప్పని పరిస్థితి ఎదురైంది. మహిళకు సంబంధించిన చిత్రాలు ఫోన్‌లో కనిపించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.


మహిళ తన ఫొటోలను తొలగించాలని డిమాండ్ చేయగా.. కొంతమంది ప్రయాణికులు అతని చేతిలోని ఫోన్‌ను తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న జవానును వెంటనే సస్పెండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఫొటోలు తీసినట్లు తేలితే తగిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. కాగా, ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందినప్పటికీ.. బాధితురాలు అధికారికంగా ఫిర్యాదు చేయలేదు.


ఈ వార్తలు కూడా చదవండి

ఎలుగుబంటికి నిద్రాభంగం కలిగించినందుకు రూ.5 లక్షల జరిమానా

నేలను తవ్వుతుండగా రూ.98 కోట్ల నిధి.. 18 ఏళ్ల కుర్రాడికి షాక్

Updated Date - Aug 17 , 2026 | 07:37 AM