నోట్ల కట్ట ఎదురుగా ఉన్నా.. ఒక్క రూ.500 నోటే చోరీ.. చివరికి..
ABN , Publish Date - Nov 25 , 2026 | 08:53 AM
దొంగతనం చేయాలనుకున్నాడు.. కానీ మొత్తం డబ్బు తీసుకోకుండా కేవలం ఒక్క రూ.500 నోటుతో సరిపెట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో ఓ గృహ కార్మికుడి వింత దొంగతనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ కావడంతో అతడి వ్యవహారం బయటపడింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో వింత దొంగతనం ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో పనిచేసే కార్మికుడు యజమాని నిద్రపోతున్న సమయంలో అతడి కుర్తా జేబులో ఉన్న నగదు కట్ట నుంచి కేవలం ఒక్క రూ.500 నోటును మాత్రమే దొంగిలించాడు. మిగిలిన డబ్బును ఏమాత్రం ముట్టుకోకుండా తిరిగి జేబులో పెట్టేశాడు. అంతేకాదు, ఏమీ తెలియనట్టుగా పక్కనే ఉన్న మంచంపై వెళ్లి నిద్రపోయాడు. టిల్ బేగంపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన యజమాని కల్లు మేవాటి ఇంట్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. మరుసటి రోజు ఫుటేజీని పరిశీలించిన యజమాని అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.
పోలీసుల భయంతో పరారైన పనివాడు..
సీసీటీవీ దృశ్యాలను కార్మికుడికి చూపించి యజమాని నిలదీయడంతో అతడు తన తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పినట్లు సమాచారం. అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తారేమోనన్న భయంతో ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. నగదు కట్టలో నుంచి మొత్తం డబ్బు తీసుకోకుండా కేవలం ఒక్క రూ.500 నోటు మాత్రమే దొంగిలించడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. దీంతో నెటిజన్లు, స్థానికులు అతడిని సరదాగా 'నీతిమంతుడైన దొంగ' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వింత దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ వీడియో కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
సీనరేజ్ కాంట్రాక్టుకు త్వరలో టెండర్లు
Read Latest AP News And Telangana News