Share News

బ్రెజిల్ హోటల్‌లో ఘోరం.. ఏడో అంతస్తు నుంచి పడి మహిళ మృతి.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 06 , 2026 | 08:28 PM

ఈశాన్య బ్రెజిల్‌లోని ఓ హోటల్ కిటికీ నుంచి మహిళ కిందపడి మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. ఏడో అంతస్తులోని కిటికీ అల్యూమినియం ఫ్రేమ్ విరిగిపోవడంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు చికిత్స పొందుతూ మృతిచెందింది.

బ్రెజిల్ హోటల్‌లో ఘోరం.. ఏడో అంతస్తు నుంచి పడి మహిళ మృతి.. వీడియో వైరల్
Brazil Viral Video

బ్రెజిల్: ఈశాన్య బ్రెజిల్‌లోని ఓ హోటల్ కిటికీ నుంచి మహిళ కిందపడి మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. ఏడో అంతస్తులోని కిటికీ అల్యూమినియం ఫ్రేమ్ విరిగిపోవడంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు చికిత్స పొందుతూ మృతిచెందింది. ప్రమాద సమయంలో మహిళ, ఆమె ప్రియుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మహిళ కిటికీ నుంచి పడిపోయిన ఘటన హోటల్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన బ్రెజిల్‌లోని మారన్‌హావో రాష్ట్ర రాజధాని సావో లూయిస్‌లో ఉన్న రియో పొటీ హోటల్‌లో చోటుచేసుకుంది. రెనాటా రెబెకా నెగ్రావో సల్దాన్హా డోస్ శాంటోస్ (26) అనే మహిళ తన ప్రియుడితో కలిసి హోటల్‌లో బస చేసింది. మద్యం మత్తులో ఉన్న వారిద్దరూ నవంబర్ 3వ తేదీ తెల్లవారుజామున సుమారు 1:30 గంటలకు గది తాళాల కోసం హోటల్ కారిడార్‌లో వెతుకుతున్నారు. ఈ క్రమంలో రెనాటా కారిడార్‌లోని కిటికీ అల్యూమినియం ఫ్రేమ్‌కు ఆనుకుంది. అయితే, ఆమె బరువును తట్టుకోలేక కిటికీ ఫ్రేమ్ ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో ఆమె ఏడో అంతస్తు నుంచి కింద ఉన్న హోటల్ ప్రవేశ ద్వారం పైకప్పుపై పడిపోయింది. వెంటనే వైద్య సహాయం అందించినప్పటికీ, తీవ్ర గాయాల కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది.


ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాద సమయంలో ఆమెతో ఉన్న ప్రియుడినీ ప్రశ్నించారు. అయితే, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అతడి ప్రమేయం లేదని తెలిపారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా ప్రాథమికంగా నిర్ధారించారు. కిటికీ ఫ్రేమ్ ఎందుకు ఊడిపోయిందనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు, ఈ ఘటనపై హోటల్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది. ఇద్దరు పిల్లలకు తల్లైన రెనాటా మరణంతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. సరదాగా గడిపేందుకు వెళ్లిన తమ కుమార్తె విగతజీవిగా తిరిగి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.


ఈ వార్త కూడా చదవండి

బలూచ్ లిబరేషన్ ఆర్మీలో కలకలం.. బషీర్ జెబ్‌పై వేటు..

ఎయిర్‌ఇండియా టాయిలెట్‌లో మా ఆయన పట్టట్లేదు: ప్రయాణికురాలి సరదా కామెంట్

Updated Date - Nov 06 , 2026 | 08:28 PM