Share News

స్పృహ తప్పి పడిపోయిన వధువు! పెళ్లి రద్దు చేసుకున్న వరుడి ఫ్యామిలీ

ABN , Publish Date - Feb 23 , 2026 | 07:39 AM

వధువు అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోవడంతో వరుడి కుటుంబం పెళ్లి రద్దు చేసుకున్న ఘటన బిహార్‌లో తాజాగా వెలుగుచూసింది. వధువుకు ఎలాంటి అనారోగ్యం లేదని డాక్టర్లు చెప్పినా వరుడి కుటుంబం వినిపించుకోలేదని వధువు తరఫు వారు ఆవేదన వ్యక్తం చేశారు.

స్పృహ తప్పి పడిపోయిన వధువు! పెళ్లి రద్దు చేసుకున్న వరుడి ఫ్యామిలీ
Bihar Bride Faints, Wedding Cancelled

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లిలో వధువు స్పృహతప్పి పడిపోవడంతో (Bihar Bride Faints) వరుడి కుటుంబం వివాహాన్ని రద్దు చేసుకున్న ఘటన బిహార్‌లో వెలుగు చూసింది (Wedding Cancelled). భోజ్‌పూర్ జిల్లా ఆరాలో గత శనివారం ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వరుడు తన కుటుంబంతో సహా ఊరేగింపుగా వధువు స్వగ్రామానికి వెళ్లారు. ఆ తరువాత పెళ్లి కార్యక్రమాలు చాలా వరకూ సజావుగానే సాగిపోయాయి. జయమాల కార్యక్రమం జరుగుతుండగా వధువు స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే యువతి కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆందోళన చెందాల్సిందేమీ లేదని వైద్యులు తెలిపారు. వధువుకు అలసట, బలహీనత ఎక్కువ కావడంతో స్పృహ తప్పిందని వివరించారు.


కానీ, వరుడి కుటుంబం పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ప్రకటించింది. వధువుకు ఎలాంటి అనారోగ్యాలు లేవని వైద్యులు చెప్పినా వారు వినిపించుకోలేదని వధువు తరఫు వారు ఆవేదన వ్యక్తం చేశారు. యువతి కుటుంబం బహుమతిగా ఇచ్చిన బైక్‌‌ను వరుడి కుటుంబం తిరిగిచ్చేసింది.

సడెన్‌గా పెళ్లి ఆగిపోవడంతో వధువు కుటుంబం షాక్‌లో కూరుకుపోయింది. ‘మేము పెళ్లి ఏర్పాట్ల కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాము. అదంతా వృథాగా మారిపోయింది. మా కలలన్నీ కల్లలయ్యాయి’ అని వధువు తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. ‘పెళ్లి హడావుడి కారణంగా కొన్ని రోజులుగా నా కూతురు సరిగా ఆహారం తీసుకోవడం లేదు. దీంతో ఆమె బలహీనపడింది. అది తప్ప మరే సమస్యా లేదు’ అని వధువు తల్లి పేర్కొన్నారు. వరుడి కుటుంబానికి నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ వార్తలూ చదవండి:

కాపీ కొడుతూ దొరికిపోయి.. ఇన్విజిలేటర్‌పై పిడిగుద్దులు

వరుడిని చూడగానే ట్రాన్స్‌జెండర్‌లకు డౌట్! ఆ తరువాత..

Updated Date - Feb 23 , 2026 | 10:22 AM