తండ్రి కల కోసం 190 కి.మీ. ఈత.. రికార్డు సృష్టించిన స్వీడన్ మహిళ
ABN , Publish Date - Nov 24 , 2026 | 06:52 PM
స్వీడన్‌కు చెందిన అన్నా-కారిన్ అనే మహిళ 190 కిలోమీటర్ల గోటా కెనాల్ నదిని అత్యంత వేగంగా ఈది రికార్డు సృష్టించారు.
ఇంటర్నెట్ డెస్క్: స్వీడన్‌కు చెందిన అన్నా-కారిన్ అనే మహిళ అదే దేశంలో ఉన్న 190 కిలోమీటర్ల గోటా కెనాల్ నదిని అత్యంత వేగంగా ఈది రికార్డు సృష్టించారు. స్విమ్ చేస్తూ ఆ నదిని దాటేందుకు ఆమెకు 10 రోజుల 10 గంటల 9 నిమిషాలు పట్టింది. ఇంత వేగంగా ఈ ఘనత సాధించడంతో కారిన్కు గిన్నిస్ వరల్డ్ బుక్‌లో చోటు దక్కింది. కాగా మరణించిన తన తండ్రి కార్ల్-ఎరిక్ కోసం ఇదంతా చేశానని ఆమె చెప్పారు. లక్ష్యసాధనలో తాను ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. తన కలను సాకారం చేసుకునేందుకు పడిన కష్టాలను వెల్లడించారు.
తండ్రి కల కోసం..
తన కూతురు ప్రపంచ వ్యాప్తంగా స్విమ్మింగ్‌లో సత్తా చాటాలని కార్ల్-ఎరిక్ కలలు కన్నారు. ఈతలో అంతర్జాతీయ రికార్డులు నెలకొల్పాలనేదే అన్నా-కారిన్ ఆశయం కూడా. దీంతో రెండేళ్ల క్రితం తండ్రీకూతురు ఓ ప్రణాళిక వేశారు. 190 కి.మీ పొడవైన గోటా కెనాల్‌ను కారిన్ ఈదుకుంటూ దాటితే గిన్నిస్ రికార్డు దాసోహం అవుతుందని భావించారు. కానీ అనుకున్నట్టు జరగలేదు. స్ట్రోక్‌తో కార్ల్-ఎరిక్ అకాలంగా మరణించారు. ఇది కారిన్ను కుంగదీసింది. అయితే తన తండ్రి కలను నెరవేర్చాలని ఆమె నిశ్చయించుకున్నారు. ఆయనకు నివాళిగా గోటా కెనాల్‌ను స్విమ్ చేస్తూ దాటాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మే 17న లక్ష్య సాధనకు ముందడుగు వేశారు. రోజుకు 20 కిలోమీటర్లు స్విమ్ చేస్తూ గమ్యం వైపు కదిలారు. అత్యంత చల్లని నీరు ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించినా.. ఆగలేదు. ఇతర సవాళ్లు ఎదురైనా.. వెనక్కు తగ్గలేదు. సరిగ్గా పది రోజుల తరువాత ( మే 27) కారిన్ తన కలను నిజం చేశారు.
ఈ విజయంపై స్పందించిన కారిన్.. ‘ఈ ఘనత నాది మాత్రమే కాదు. మా నాన్నది కూడా’ అంటూ భావోద్వేగంతో చెప్పారు. ఈ మొత్తం ప్రయాణంలో తనకు ఎదురైన పెద్ద సవాలు ‘చల్లని నీరే’అని తెలిపారు. 12 డిగ్రీల నుంచి 14 డిగ్రీల మధ్యలో నీటి ఉష్ణోగ్రతలు ఉన్నాయని వివరించారు. తనకు గిన్నిస్ రికార్డు సొంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే కారిన్కు ఒక గిన్నిస్ రికార్డ్ ఉంది. ఓషన్స్ సెవన్ ఛాలెంజ్ పూర్తి చేసిన తొలి మహిళగా ఆమె 2013లో చరిత్ర లిఖించారు.
ఇవీ చదవండి
సంజయ్ గాంధీని దొంగ అన్నాడని చెంపదెబ్బ కొట్టా: ప్రియాంక గాంధీ
భారత సైన్యం కీలక నిర్ణయం.. సైనికుల మొబైల్ ఫోన్లలో 87 యాప్‌ల నిషేధం