Share News

సాహసం అతడి ఇంటిపేరు!

ABN , Publish Date - Feb 15 , 2026 | 11:23 AM

ఐదంతస్తుల మేడను మెట్ల ద్వారా ఎక్కడానికే ఆపసోపాలు పడుతుంటాం. అలాంటిది 101 అంతస్తుల భవనాన్ని గంటన్నరలో అలవోకగా ఎక్కాడు అలెక్స్‌. అది కూడా తాడు, ఇతరత్రా భద్రతా పరికరాల్లేకుండా.

సాహసం అతడి ఇంటిపేరు!

ఐదంతస్తుల మేడను మెట్ల ద్వారా ఎక్కడానికే ఆపసోపాలు పడుతుంటాం. అలాంటిది 101 అంతస్తుల భవనాన్ని గంటన్నరలో అలవోకగా ఎక్కాడు అలెక్స్‌. అది కూడా తాడు, ఇతరత్రా భద్రతా పరికరాల్లేకుండా. కేవలం ఒట్టి చేతులతో ఇటీవల ‘తైపీ’ ఆకాశహర్మ్యాన్ని ఎక్కి చరిత్ర సృష్టించాడు. తన సాహసాలతో అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్న అతడి విశేషాలివి...

1985లో కాలిఫోర్నియాలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు అలెక్స్‌ హోన్నోల్డ్‌. బాల్యంలో తోటి పిల్లలంతా ఆట, పాటలతో సరదాగా గడిపితే అలెక్స్‌ మాత్రం చెట్లు, రాళ్లు ఎక్కడానికి ఆసక్తి చూపేవాడు. అతడి ఇష్టాన్ని గమనించిన తల్లి ఇంటికి సమీపంలో ఉన్న ఒక క్లైంబింగ్‌ జిమ్‌లో చేర్పిం చింది. అప్పుడు ఆ చిన్నారి వయసు కేవలం ఐదేళ్ల్లే. పొద్దున్న బడిలో పాఠాలు, సాయంత్రం జిమ్‌లో మెలకువలు నేర్చుకునేవాడు. అలా ఎనిమిదేళ్లపాటు ఇండోర్‌ క్లైంబింగ్‌లో సాధన చేశాడు. అందులో భాగంగా మొదట రోప్‌ క్లైంబింగ్‌ నేర్చుకున్నాడు. తాడు, సేఫ్టీగేర్‌తో ఎక్కడం సాధన చేశాక... తన మీద తనకు నమ్మకం పెరిగింది. టీనేజ్‌లోకి వచ్చాక తక్కువ ఎత్తున్న కొండలను తాడు లేకుండా ఒట్టి చేతులతో ఎక్కడం మొదలెట్టాడు. అలా ఫ్రీ సోలోయింగ్‌ (తాడు లేకుండా, భద్రతా పరికరాలు లేకుండా ఎక్కడం)కి అలవాటు పడ్డాడు. 19 ఏళ్ల వయసులో ఇంజనీరింగ్‌ చదువును మధ్యలో వదిలేసి, రాక్‌ క్లైంబింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు.


book5.2.jpg3 వేల అడుగులు... 3 గంటల్లో...

2008లో అమెరికాలోని రెండు అత్యంత క్లిష్టమైన పర్వత మార్గాలు (యోసెమిటీ నేషనల్‌ పార్క్‌లోని హాఫ్‌ డోమ్‌, యుటాలోని మూన్‌లైట్‌ బట్ర్టెస్‌)ను తాడు లేకుండా సునా యాసంగా ఎక్కి మొదటిసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. 2008లో హాఫ్‌ డోమ్‌ను ఫ్రీ-సోలో చేసిన తొలి వ్యక్తిగానూ చరిత్ర స్పష్టించాడు. ఆ తర్వాత వరుసగా అనేక ఫీట్లు చేశాడు. అవన్నీ ఒకెత్తయితే 2017లో అలెక్స్‌ యోసెమిటీ నేషనల్‌ పార్క్‌లోని ‘ఎల్‌ క్యాపిటాన్‌’ (3వేలు అడుగుల)ను అధిరోహించడం మరో ఎత్తు. ఆ పర్వతాన్ని తాడు లేకుండా ఎక్కడం అంటే మాటలా? అదికూడా కేవలం 3 గంటల్లో ఎక్కి చూపించాడు. మొదట్లో చాలామంది ‘ఇది అసాధ్యం’ అని కొట్టిపడేసినా... అలెక్స్‌ దాన్ని సుసాధ్యం చేసి చూపాడు. దాంతో ఒక్కసారిగా అలెక్స్‌ పేరు మార్మోగింది.


90 నిమిషాల్లో...

తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనం ‘తైపీ 101’ను ఇటీవల సునాయసంగా అధిరోహించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ సాహసాన్ని వేలాది మంది వీధుల్లో నిలబడి ప్రత్యక్షంగా వీక్షించారు. మొత్తం 1,667 అడుగుల (508 మీటర్లు) ఎత్తుకు చేరుకొనేందుకు అతడికి 90 నిమిషాల సమయం పట్టింది. ఈ భారీ నిర్మాణంలో మధ్యలో ఉన్న 64 అంతస్తులను ఎక్కడమే అత్యంత క్లిష్టమైన అంశం. వెదురు బాక్సుల ఆకారంలో చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అయినాసరే నడుముకు తగిలించుకున్న ఒక క్యాన్‌లో ఉన్న పౌడర్‌ను అప్పుడప్పుడు చేతులకు రాసుకుంటూ ఈ సాహస యాత్రను విజయవంతంగా పూర్తిచేశాడు. దీన్ని నెట్‌ఫ్లిక్స్‌ ‘స్కైస్ర్కాపర్‌ లైవ్‌’ పేరుతో ప్రసారం చేసింది.


book5.3.jpgపక్కా ప్రణాళికతో...

ఫ్రీ- సోలో క్లైంబింగ్‌కి శారీరక, మానసిక బలం ఎంతో అవసరం. ఏ చిన్న పొరపాటు జరిగినా జీవితం మీద ఆశలు వదులుకోవా ల్సిందే. అందుకే అలెక్స్‌ దేనినైనా అధిరోహించే ముందు... మొత్తం మార్గాన్ని తన మనసులోనే ఊహించుకుంటాడు. ఎక్కడ జాగ్రత్త అవసరం, ఎక్కడ ప్రమాదం ఉంటుందో ఓ అంచనాకు వస్తాడు. కేవలం వేసే అడుగు మీదే దృష్టి పెడతాడు.


సాధన ఎలా అంటే...

అలెక్స్‌ రోజుకు 4-6 గంటల పాటు వివిధ రకాల కొండలు, గుట్టలను అధిరోహిస్తూ, సాధన చేస్తుంటాడు. ఎక్కడ గ్రిప్‌ ఉంచాలి, ఎక్కడ శరీర బరువును మార్చాలి, ఎక్కడ బ్యాలెన్స్‌ అవసరమో... నిరంతరం అభ్యాసం చేస్తుంటాడు. అలాగే వేళ్ల బలం పెంచే ప్రత్యేక వ్యాయామాలు, పుల్‌- అప్స్‌, పుష్‌-అప్స్‌, లెగ్‌ రైజెస్‌... నడుము, పొట్ట భాగం బలంగా ఉండేందుకుగాను ప్లాంక్‌ వంటి వ్యాయామాలు చేస్తాడు. కూరగాయలు,పండ్లు, కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటాడు. శక్తి కావాలి కాబట్టి తేలికగా జీర్ణమయ్యే ఆహారానికే ప్రాధాన్యమిస్తాడు.


‘ఫ్రీ సోలో’ డాక్యుమెంటరీ...

అలెక్స్‌ అసాధారణ ప్రదర్శనకు సంబంధించి 2018లో ‘ఫ్రీ సోలో’ అనే ఒక డాక్యుమెంటరీ వచ్చింది. అందులో ‘ఎల్‌ క్యాపిటాన్‌’ని తాడు లేకుండా ఎలా ఎక్కాడో చూపించారు. దాని కోసం నెలల తరబడి ఎలా సన్నద్దమయ్యాడు?, కష్టమైన చోట్ల ఒక్కో అడుగు ఎలా వేశాడు? కింద పడిపోతే ఏమవుతుందో తెలిసినా ఎలా కంట్రోల్‌గా ఉన్నాడు? వంటి ఆసక్తికర అంశాలను వివరంగా చూపించారు. ఈ డాక్యు మెంటరీ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. 2019లో ఆస్కార్‌ (బెస్ట్‌ డాక్యు మెంటరీ ఫీచర్‌) అవార్డు గెలుచుకుంది.


ప్రేమ పెళ్లి...

అలెక్స్‌ 2020లో సాన్నీ మెక్‌క్యాండ్లెస్‌ని వివాహం చేసుకున్నాడు. క్లైంబింగ్‌ కమ్యూనిటీ ద్వారా ఏర్పడిన వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి, ఆ తర్వాత పెళ్లిపీటలు ఎక్కారు. ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు. నెట్‌ఫ్లిక్స్‌ ‘స్కైస్ర్కాపర్‌’ లైవ్‌లో వారితో అతడి అనుబంధాన్ని కూడా చూడొచ్చు. ‘‘ఇదంతా డబ్బు కోసం, పేరు కోసం కాదు... మనుసుకు నచ్చిన పని చేయడంలోనే కదా అసలైన మజా’’ అంటాడు అలెక్స్‌ సింపుల్‌గా. ఈ జీవిత సూత్రమే అతడిని అందరికన్నా ‘టాప్‌’లో నిలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

‘నేనే రాజు.. నేనే మంత్రి..’ అదే నిజమా..!

గుమ్మడి నర్సయ్యకు గౌరవ డాక్టరేట్‌

Read Latest Telangana News and National News

Updated Date - Feb 15 , 2026 | 11:23 AM