Share News

Tornado: మ్యూజియంలో ‘టోర్నడో’!

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:10 PM

రాకాసిలా విరుచుకుపడి విధ్వంసం సృష్టించే టోర్నడోలను టీవీల్లో చూసే ఉంటారు. గాలి సుడులు తిరుగుతూ ఇళ్ల పైకప్పులను లేపేస్తూ... అవి సృష్టించే విధ్వంసం గురించి చెప్పాలంటే మాటలు చాలవు.

Tornado: మ్యూజియంలో ‘టోర్నడో’!

సుడిగాలిలా గింగిరాలు తిరుగుతూ అత్యంత వేగంగా దూసుకొచ్చే టోర్నడోలను టీవీల్లో చూడటమే! అమెరికా లాంటి దేశాల్లో తరచుగా ఏర్పడే వీటిని దూరం నుంచే చూసి బెదిరిపోతారు! ఒకవేళ వాటిని దగ్గరి నుంచి చూడా లనుకుంటే... పులి నోట్లో తలపెట్టినట్టే. అలాంటి భయంకరమైన టోర్నడోలను ఒక భవనంలో... దగ్గరి నుంచి చూడాలంటే జర్మనీకి వెళ్లాల్సిందే!

రాకాసిలా విరుచుకుపడి విధ్వంసం సృష్టించే టోర్నడోలను టీవీల్లో చూసే ఉంటారు. గాలి సుడులు తిరుగుతూ ఇళ్ల పైకప్పులను లేపేస్తూ... అవి సృష్టించే విధ్వంసం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. మైదానాల్లో అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఏర్పడే సుడిగాలిని నిలుచుని చూస్తుండి పోతాం. కానీ టోర్నడో ఏర్పడిన చోట అలా సాఽధ్యం కాదు. అయితే జర్మనీలోని స్టగార్ట్‌లో ఉన్న ‘మెర్సిడెస్‌ బెంజ్‌ మ్యూజియం’లో మాత్రం టోర్నడోను దగ్గరి నుంచి చూడొచ్చు. కృత్రిమ టోర్నడోను సృష్టించేవ్యవస్థ ఈ మ్యూజియంలో తప్ప మరెక్కడా లేదు. అందుకే ‘గిన్నిస్‌ బుక్‌ రికార్డు’ల్లోకి ఎక్కింది.


book6.2.jpg

అగ్ని ప్రమాదం జరిగితే...

ఈ కృత్రిమ టోర్నడో వ్యవస్థ సందర్శకులను ఆకర్షించడం కోసం ఏర్పాటు చేసింది కాదు. భవనంలో అగ్నిప్రమాదం జరిగితే క్షణాల్లో పొగను బయటకు పంపేందుకు ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అత్యంత బలమైన కృత్రిమ టోర్నడోగా దీనికి గుర్తింపు ఉంది. భవనం 112 అడుగుల ఎత్తులో సుడిగాలి ఏర్పడుతుంది. అగ్నిప్రమాదం జరిగినప్పుడు మ్యూజియం ప్రధాన గోడల వెంట ఉన్న 144 అవుట్‌లెట్‌లు... లోపలి ప్రాంగణంలోకి గాలిని పంపుతాయి. ఇది ఒక కృత్రిమ సుడిగాలిని ఉత్పత్తి చేస్తుంది. ఈ సుడిగాలి అగ్ని ప్రమాదం వల్ల ఏర్పడిన పొగను తీసుకుంటూ భవనం పైభాగంలో ఉన్న ఎగ్జాస్ట్‌ ద్వారం గుండా బయటకు పంపిస్తుంది.


book6.3.jpg

ఈ క్రమంలో బయటకు వెళుతున్న పొగ టోర్నడోను తలపిస్తుంది. పొగ గిర్రున తిరుగుతూ అతి వేగంగా బయటకు వెళుతుంది. కొన్ని క్షణాల్లోనే భవనంలో ఉన్న పొగ మాయమవుతుంది. ఫలితంగా భవనంలో ఉన్నవారు పొగబారిన పడకుండా, సురక్షితంగా బయటకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదు. ప్రత్యేకంగా మెర్సిడెస్‌ బెంజ్‌ మ్యూజియం కోసమే ఈ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే అత్యంత అత్యాధునిక మ్యూజియంగానూ దీనికి గుర్తింపు ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి, వెండి ధరల్లో కొనసాగుతున్న పెరుగుదల! నేటి రేట్స్ ఇవీ..

శబరిమల బంగారం చోరీ కేసు.. సిట్‌కు చేరిన శాస్త్రీయ నివేదిక

Read Latest Telangana News and National News

Updated Date - Jan 18 , 2026 | 01:41 PM