సంక్రాంతి ఇండియన్ కిచెన్ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ నిమ్మగడ్డకు ‘అవుట్‌స్టాండింగ్ జార్జియా సిటిజన్’ గౌరవం
ABN , Publish Date - Nov 23 , 2026 | 01:48 PM
సంక్రాంతి ఇండియన్ కిచెన్ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ నిమ్మగడ్డ (నిమ్స్)కు అరుదైన గౌరవం దక్కింది. జార్జియా రాష్ట్ర సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ రాఫెన్స్‌పర్జర్ ఆయనను ‘అవుట్‌స్టాండింగ్ జార్జియా సిటిజన్’ (అత్యుత్తమ జార్జియా పౌరుడు)గా ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: సంక్రాంతి ఇండియన్ కిచెన్ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ నిమ్మగడ్డ (నిమ్స్)కు అరుదైన గౌరవం దక్కింది. జార్జియా రాష్ట్ర సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ రాఫెన్స్‌పర్జర్ ఆయనను ‘అవుట్‌స్టాండింగ్ జార్జియా సిటిజన్’ (అత్యుత్తమ జార్జియా పౌరుడు)గా ప్రకటించారు. జార్జియా స్టేట్ క్యాపిటల్‌లో ఈ మేరకు సర్టిఫికెట్‌ను అందజేశారు. అమెరికా అంతటా, ప్రపంచవ్యాప్తంగా జార్జియా రాష్ట్రానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా నిమ్మగడ్డను గుర్తించారు. ఈ గౌరవం తనకు ఎంతో విలువైనదని శ్రీనివాస్ నిమ్మగడ్డ పేర్కొన్నారు.
2001లో కనెక్టికట్‌లోని తన ఇంటి బేస్‌మెంట్‌లో వెన్సాయ్ టెక్నాలజీస్ పేరుతో తొలి సంస్థను ప్రారంభించిన ఆయన, దానిని భారత్, దుబాయ్, ఖతార్‌లలో కార్యాలయాలు కలిగిన బహుళజాతి ఐటీ సంస్థగా అభివృద్ధి చేశారు. అనంతరం 2018లో తొలి సంక్రాంతి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. గత ఐదేళ్లుగా అసలైన భారతీయ రుచులను తాజాగా, వేగంగా అమెరికన్లందరికీ అందించాలనే లక్ష్యంతో సంక్రాంతి ఇండియన్ కిచెన్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

మెక్సికన్ ఆహారానికి చిపోటిల్, మెడిటరేనియన్ ఆహారానికి కావా వంటి జాతీయ స్థాయి బ్రాండ్లు ఉన్నాయని, అదే తరహాలో భారతీయ ఆహారానికి కూడా ఒక జాతీయ స్థాయి క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) బ్రాండ్ ఉండాలన్నదే తమ లక్ష్యమని నిమ్మగడ్డ తెలిపారు. తన తొలి సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినట్లే, సంక్రాంతిని కూడా జాతీయ స్థాయికి విస్తరించనున్నట్లు చెప్పారు.
భారతీయ వంటకాలను వేగంగా వినియోగదారులకు అందించడం సంక్లిష్టమైన ప్రక్రియ అని, ఇందుకు అవసరమైన వ్యవస్థను రూపొందించడానికి ఐదేళ్లపాటు కఠినంగా పరీక్షలు నిర్వహించామని వివరించారు. ప్రస్తుతం ఆ వ్యవస్థ విజయవంతంగా పనిచేస్తోందన్నారు.

సంక్రాంతి ఇండియన్ కిచెన్ ప్రస్తుతం అట్లాంటా మిడ్‌టౌన్‌లో ఒక క్విక్ సర్వీస్ రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది. రాబోయే కొన్ని వారాల్లో బక్‌హెడ్, డౌన్‌టౌన్ అట్లాంటాలో మరో రెండు రెస్టారెంట్లను ప్రారంభించనుంది. జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్‌లోనూ ప్రతి నెలా ఆహార సేవలు అందిస్తోంది. అమెరికాలోని అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటైన ఈ కేంద్రానికి దేశ, విదేశాల నుంచి భారీ కార్యక్రమాల కోసం సందర్శకులు వస్తుంటారు.
ఈ వేసవిలో అట్లాంటాలో నిర్వహించిన ఫిఫా ఫ్యాన్ ఫెస్టివల్‌లోనూ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది సందర్శకులకు సంక్రాంతి ఇండియన్ కిచెన్ భోజనాన్ని అందించింది. తదుపరి దశలో 2027 నుంచి ఫ్రాంచైజీల ద్వారా పొరుగు రాష్ట్రాలకు తమ కార్యకలాపాలను విస్తరించాలని సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
తానా ఆధ్వర్యంలో న్యూజెర్సీ ఎడిసన్‌లో థ్యాంక్స్‌గివింగ్ వేడుకలు.. వందలాది కుటుంబాలకు సాయం
కెనడాలో కాల్పులు.. భారత సంతతి యువ జంట మృతి