కెనడాలో కాల్పులు.. భారత సంతతి యువ జంట మృతి
ABN , Publish Date - Nov 21 , 2026 | 08:13 PM
కెనడాలో ఇటీవల భారత సంతతికి ఓ యువకుడు (23), అతడి గర్ల్‌ఫ్రెండ్ (24) హత్యకు గురయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో ఇటీవల భారత సంతతికి ఓ యువకుడు (23), అతడి గర్ల్‌ఫ్రెండ్ (24) హత్యకు గురయ్యారు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రీలో నవంబర్ 15న ఈ ఘటన వెలుగు చూసింది. మృతులను గగన్‌ప్రీత్ రెహాల్, సుఖ్‌జీత్ కౌర్‌గా గుర్తించారు. ఎవరో కావాలనే వారిని టార్గెట్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అక్కడికి కొంత దూరంలో దగ్ధమవుతున్న ఓ కారును కూడా పోలీసులు గుర్తించారు. నిందితుల జాడ కనుక్కునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
వాల్‌మార్ట్ మార్కెట్‌కు చెందిన పార్కింగ్ స్థలంలో నవంబర్ 15న రాత్రి 10.38 గంటల సమయంలో కాల్పులు జరిగినట్టు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ తూటా గాయాలతో అచేతనంగా పడి ఉన్న ఓ యువతి, యువకుడిని గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అక్కడి ముఠాలు ఏవైనా ఆ జంటను టార్గెట్ చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గతంలో వెలుగు చూసిన ఆయుధాలకు సంబంధించి కేసుల్లో రెహాల్ పేరు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కౌర్ గురించి ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు.
కాల్పులు జరిగిన కొన్ని నిమిషాల తరువాత సమీపంలో మంటల్లో దగ్ధమవుతున్న ఓ కారును పోలీసులు గుర్తించారు. ఎవరో కావాలనే కారును తగలబెట్టినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ కారును నిందితులు వాడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇక రెహాల్ మరణంపై ఆయన తండ్రి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువకుడి మృతి
SVK ఆధ్వర్యంలో 6వ శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం