Share News

SVK ఆధ్వర్యంలో 6వ శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం

ABN , Publish Date - Nov 19 , 2026 | 10:53 PM

పవిత్ర కార్తీక మాసంలో, వసుధైవ కుటుంబకం (SVK) శ్రీ బాలాజీ ఆలయం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస (బాలాజీ) కళ్యాణ మహోత్సవం ఐండ్‌హోవెన్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

SVK ఆధ్వర్యంలో 6వ శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం
Sri Srinivasa Kalyana Mahotsavam

ఐండ్‌హోవెన్, నెదర్లాండ్స్, నవంబర్ 15, 2026: పవిత్ర కార్తీక మాసంలో, వసుధైవ కుటుంబకం (SVK) శ్రీ బాలాజీ ఆలయం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస (బాలాజీ) కళ్యాణ మహోత్సవం ఐండ్‌హోవెన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. SVK నిర్వహించిన ఈ ఆరవ కళ్యాణ మహోత్సవానికి నెదర్లాండ్స్ నలుమూలల నుండి 1300 మంది భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి, స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి, తన్మయులయ్యారు.

తిరుపతి సాంప్రదాయంలో దివ్య కళ్యాణం

ఈ మహోత్సవానికి ప్రధాన ఆకర్షణ, తిరుపతి సాంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా జరిగిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. SVK ఆహ్వానం మేరకు వచ్చిన వేద పండితుల ఆధ్వర్యంలో, సుప్రభాత సేవతో ప్రారంభమై, తోమాల సేవ, అర్చన జరిగాయి. అనంతరం సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదికపై, వేద మంత్రోచ్చారణలు, మంగళ వాద్యాల మధ్య స్వామివారి కళ్యాణం, వస్త్ర సమర్పణ కన్నుల పండువగా జరిగాయి. తిరుమలలో జరిగే కళ్యాణోత్సవాన్ని తలపించేలా జరిగిన ఈ వేడుకతో తిరుమల వైభవాన్ని ఐరోపాలోనే అనుభూతి చెందామని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

సేవల్లో పాల్గొన్న భక్తుల పేర్లు, గోత్రాలతో వేద పండితులు సంకల్పం చెప్పి, ఆ కుటుంబాలన్నింటి తరఫున స్వామివారికి సేవలు సమర్పించారు. ఇంటికి దూరంగా ఉన్నా, తమ పేరుతో స్వామివారి కళ్యాణంలో సంకల్పం జరగడం భక్తులకు ఎంతో ఆనందాన్ని, తృప్తిని కలిగించింది. వేద ఆశీర్వచనం అనంతరం భక్తులందరికీ SVK సర్వదర్శనం, ప్రసాదం అందించింది. స్వయంగా రాలేకపోయిన ఎంతోమంది భక్తులు ఈ కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి, స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

5.jpg


SVK సంకల్పం

మాతృభూమికి దూరంగా ఉన్నా, మన సంప్రదాయాలు, ఆచారాలు, భక్తి పరంపర తర్వాతి తరానికి అందాలి. నెదర్లాండ్స్‌లోని ప్రతి భారతీయ కుటుంబానికి స్వామివారి సేవ, దర్శనం అందుబాటులో ఉండాలి. ఇదే SVK సంకల్పం. ఈ సంకల్పంతోనే 2022లో SVK మొదటి శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం నిరాటంకంగా నిర్వహిస్తూ, ఈ సంవత్సరం ఆరవ కళ్యాణ మహోత్సవాన్ని భక్తులకు అందించింది.

శ్రీ శ్రీనివాస కళ్యాణంతో పాటు, శ్రీరామ నవమికి శ్రీ సీతారామ కళ్యాణం, మహా శివరాత్రికి శ్రీ శివపార్వతుల కళ్యాణం వంటి ఎన్నో కళ్యాణాలను, ఎన్నో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను SVK నిర్వహిస్తూ, మన సనాతన ధర్మాన్ని ఐరోపాలో పరిరక్షిస్తూ, ముందుకు తీసుకువెళ్తోంది. ఈ మహోత్సవంలో పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా భారతీయ సంప్రదాయ కార్యక్రమాన్ని SVK నిర్వహించింది. ప్రతి ఏటా పెరుగుతున్న భక్తుల భాగస్వామ్యం SVK సంకల్పానికి లభిస్తున్న స్వామివారి ఆశీస్సులకు నిదర్శనం.

7.jpg


స్వచ్ఛంద సేవకులే ఈ మహోత్సవానికి వెన్నెముక

ఈ మహోత్సవ విజయం వెనుక స్వచ్ఛంద సేవకుల అవిశ్రాంత కృషి ఉంది. ఎంతోమంది వాలంటీర్లు తమ నిస్వార్థ సేవతో ముందుకు వచ్చారు. వారాల ముందు నుండే ప్రణాళిక, రిజిస్ట్రేషన్, ప్రచారం, వేదిక అలంకరణ, ప్రసాద వితరణ, భక్తుల సౌకర్యాల వరకు ప్రతి పనిని ఎంతో అంకితభావంతో చేశారు. పెద్దలతో పాటు యువత, పిల్లలు కూడా ఉత్సాహంగా సేవలో పాల్గొనడం విశేషం. తర్వాతి తరం ఇలా ముందుకు వచ్చి సేవ చేయడం మన సంస్కృతి, సంప్రదాయాలు భవిష్యత్తులోనూ సజీవంగా ఉంటాయన్న నమ్మకాన్ని కలిగించింది.

6.jpg


తెలుగు అసోసియేషన్ ఆఫ్ నెదర్లాండ్స్ (TANE), భారతీయ సమాజ సంస్థల అండ

2022 నుండి ప్రతి కళ్యాణంలోనూ SVKకి అండగా నిలుస్తున్న మా మద్దతుదారులలో ఒకటైన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నెదర్లాండ్స్ (TANE), ఈసారి కూడా పెద్ద సంఖ్యలో స్వచ్ఛంద సేవకులతో మహోత్సవానికి అండగా నిలిచింది. TANE వాలంటీర్లు భక్తుల స్వాగతం నుండి ప్రసాద వితరణ వరకు అనేక సేవల్లో SVK బృందంతో కలిసి ఉత్సాహంగా సేవ చేశారు. అలాగే Shrigandha, SAMUKA, EMM, HSS Netherlands వంటి నెదర్లాండ్స్‌లోని భారతీయ సమాజ సంస్థలు కూడా ఈ కార్యక్రమానికి అండగా నిలిచాయి. తెలుగు, కన్నడ, ఒడియా, మరాఠీ, హిందీ మాట్లాడే కుటుంబాలన్నీ ఒకే వేదికపై స్వామివారి సేవలో పాల్గొనడం "వసుధైవ కుటుంబకం" స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

1.jpg


SVK గురించి..

వసుధైవ కుటుంబకం (SVK), నెదర్లాండ్స్‌కు చెందిన ఒక లాభాపేక్షలేని సంస్థ. SVK శ్రీ బాలాజీ ఆలయం ద్వారా, కళ, విద్య, సామాజిక కార్యక్రమాలతో సమాజ సమైక్యతను పెంపొందించడానికి, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, విశ్వ విలువలను ప్రోత్సహించడానికి ఈ సంస్థ కృషి చేస్తోంది.

శ్రీనివాసుని కళ్యాణం కేవలం ఒక పూజా కార్యక్రమం కాదు, ఇది మనందరినీ ఒక్కటిగా చేర్చే పండుగని SVK ప్రతినిధి ఒకరు అన్నారు. ‘వాలంటీర్ల సేవ, సమాజ సంస్థల సహకారం, భక్తుల భక్తి, ఇవన్నీ కలిసినప్పుడే ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్న వసుధైవ కుటుంబకం భావనకు నిజమైన రూపం వస్తుంది.’ అని అన్నారు.

ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అద్భుత విజయంగా మలచిన వేద పండితులకు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నెదర్లాండ్స్ (TANE), దాని స్వచ్ఛంద సేవకులకు, మద్దతుగా నిలిచిన భారతీయ సమాజ సంస్థలకు, దాతలకు, అంకితభావం గల SVK స్వచ్ఛంద సేవకులకు, తరలివచ్చిన భక్తులందరికీ SVK హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ఆలయ కార్యక్రమాలు, సేవల వివరాల కోసం https://sribalajitemple-eu.org సందర్శించవచ్చు.

3.jpg4.jpg


ఈ వార్తలనూ చదవండి:

శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలకు సియాటెల్‌లో విశేష స్పందన

కాలేజ్ విల్లేలో తానా ఇంటర్నేషనల్ మెన్స్ డే వేడుకలు విజయవంతం

Updated Date - Nov 19 , 2026 | 10:56 PM