Share News

తానా ఆధ్వర్యంలో న్యూజెర్సీ ఎడిసన్‌లో థ్యాంక్స్‌గివింగ్ వేడుకలు.. వందలాది కుటుంబాలకు సాయం

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:45 AM

థ్యాంక్స్‌గివింగ్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూజెర్సీ బృందం సేవా కార్యక్రమం నిర్వహించింది. శనివారం ఎడిసన్‌లోని ‘హ్యాండ్స్ ఆఫ్ హోప్’ కేంద్రంలో వందలాది స్థానిక కుటుంబాలకు ఆహారం, నిత్యవసర సరుకులను పంపిణీ చేసింది.

 తానా ఆధ్వర్యంలో న్యూజెర్సీ ఎడిసన్‌లో థ్యాంక్స్‌గివింగ్ వేడుకలు.. వందలాది కుటుంబాలకు సాయం

ఇంటర్నెట్ డెస్క్: థ్యాంక్స్‌గివింగ్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూజెర్సీ బృందం సేవా కార్యక్రమం నిర్వహించింది. శనివారం ఎడిసన్‌లోని ‘హ్యాండ్స్ ఆఫ్ హోప్’ కేంద్రంలో వందలాది స్థానిక కుటుంబాలకు ఆహారం, నిత్యవసర సరుకులను పంపిణీ చేసింది.

అమెరికన్ సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులంతా కలిసి థ్యాంక్స్‌గివింగ్ విందు చేసుకునేందుకు వీలుగా ఆ విందులో ప్రధాన వంటకమైన టర్కీతో పాటు చికెన్, నిత్యావసర సరుకులను అందజేశారు. ఒక్కో ఆహార కిట్ విలువ సుమారు 100 డాలర్లు. కార్యక్రమానికి వచ్చిన వారికి వేడి భోజనాలను కూడా పంపిణీ చేశారు.


nri-2.jpg

ఈ కార్యక్రమంలో ఎడిసన్ హైస్కూల్, సౌత్ బ్రన్స్‌విక్ హైస్కూల్‌లకు చెందిన సుమారు 60 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఆహార కిట్లు, భోజనాల పంపిణీలో సహకరించారు. తానా యువ వాలంటీర్లు అనిత్ రాంపురం, వంశీ చంద్ నరేపలేపు విద్యార్థులను సమన్వయం చేశారు.

తానా న్యూజెర్సీ బృందం స్థానిక ప్రజలకు అండగా నిలిచేందుకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్‌లు, పాఠశాల సామగ్రి అందించడంతో పాటు ఆహార సహాయం అవసరమైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, భోజనాలను పంపిణీ చేస్తోంది. స్థానిక సంఘాలు నిర్వహించే కార్యక్రమాల్లోనూ తానా వాలంటీర్లు పాల్గొని సహకరిస్తున్నారు. స్థానిక ప్రజలకు తానా అందిస్తున్న సేవలను ఎడిసన్, న్యూజెర్సీ రాష్ట్ర నాయకులు ప్రశంసించారు.


nri-3.jpg

ఈ కార్యక్రమ నిర్వహణలో తానా కోశాధికారి రాజా కాసుకుర్తి, న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి సుధీర్ చంద్ నరేపలుపు, యువజన సమన్వయకర్త శ్రీనివాస్ చెరుకూరి, తానా ఫౌండేషన్ కోశాధికారి శ్రీనివాస్ ఒరుగంటి, ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేక సహకరించారు. ప్రవీణ్ రెడ్డి కల్వకొల్లు, రవి మాచర్ల కార్యక్రమ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. సుధీర్ రాంపురం, హరీష్ కోయ, సుందర్ గోపీనాథ్, సతీష్ మాక, మూర్తి వాలంటీర్లుగా పాల్గొని పంపిణీ కార్యక్రమంలో సహకరించారు.


nri-4.jpg

థ్యాంక్స్‌గివింగ్ ఆహార పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన తానా న్యూజెర్సీ బృందాన్ని తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ లావు అభినందించారు.


తెలుగు సమాజం స్థానిక అమెరికన్ సమాజంతో మమేకమై, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవాలన్నదే తానా లక్ష్యం. తెలుగు పిల్లలు, యువత చిన్ననాటి నుంచే తాము నివసించే ప్రాంత ప్రజలతో కలిసి సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనేలా తానా ప్రోత్సహిస్తోంది.

Updated Date - Nov 22 , 2026 | 11:48 AM