Share News

మంజుల ఘట్టమనేనిచే నాట్స్ వెల్‌నెస్ వెబినార్‌

ABN , Publish Date - Apr 21 , 2026 | 08:00 PM

అమెరికాలో నాట్స్ సంస్థ ప్రవాస భారతీయుల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు వెల్‌నెస్ వెబినార్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, వెల్‌నెస్ కోచ్, సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మంజుల ఘట్టమనేనిచే నాట్స్ వెల్‌నెస్ వెబినార్‌
NATS Manjula Ghattamaneni webinar

జూమ్ అంతర్జాల వేదిక: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రవాస భారతీయుల కోసం శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకకు వెల్‌నెస్ వెబినార్ నిర్వహించింది. ప్రముఖ నిర్మాత, వెల్‌నెస్ కోచ్, సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని ఈ వెబినార్‌లో ప్రధాన వక్తగా హాజరయ్యారు. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బిందు యలమంచిలి ఈ వెబినార్‌ని ఈ కార్యక్రమాన్ని చక్కగా సమన్వయం చేశారు.


ఒకప్పుడు తాను ఎదుర్కొన్న తీవ్రమైన మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యల నుంచి ధ్యానం ద్వారా ఎలా బయటపడ్డారో ఈ వెబినార్‌లో మంజుల వివరించారు. ప్రతి ఒక్కరూ సెలబ్రిటీల స్థాయి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని సొంతం చేసుకోవడానికి అవసరమైన మూడు రహస్యాలను ఆమె పంచుకున్నారు. అందులో మొదటిది 'సూపర్ బాడీ'. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ మానేసి, ఇంట్లో వండిన సహజమైన పోషకాహారం తీసుకోవాలని ఆమె సూచించారు. మన శరీరం కదలిక కోసం పుట్టిందని, కాబట్టి నిరంతరం ఏదో ఒక వ్యాయామం చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా తన సోదరుడు మహేష్ బాబు తనను తాను ఎలా మలుచుకున్న విధానాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు 115 కిలోల పైగా బరువుతో ఉన్న మహేష్, పట్టుదలతో జంక్ ఫుడ్ మానేసి, రోజూ రెండు గంటలు జాగింగ్ చేస్తూ 'రాజకుమారుడు' సినిమా నాటికి సిక్స్ ప్యాక్ సాధించాడని అనే ఆసక్తికరమైన విషయాన్ని ఆమె పంచుకున్నారు.


రెండవ రహస్యంగా 'సూపర్ మైండ్' గురించి మంజుల వివరించారు. సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం, ప్రకృతితో మమేకం అవ్వడం ద్వారా మెదడును ప్రశాంతంగా ఉంచుకోవచ్చని చెప్పారు. ముఖ్యంగా మనం పీల్చే శ్వాస విధానం సరిగ్గా ఉండాలని, గాలి పీల్చినప్పుడు కడుపు బెలూన్‌లా బయటకు రావాలని, వదిలినప్పుడు లోపలికి వెళ్లాలని, దీనినే డయాఫ్రమాటిక్ లేదా బెల్లీ బ్రీతింగ్ అంటారని వివరించారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వరుసగా 14 సినిమాలు ఫ్లాప్ అయినా స్థిరంగా, ప్రశాంతంగా ఉండటానికి ఆయనలోని ఈ సహజమైన శ్వాసక్రియే కారణమని ఆమె గుర్తుచేసుకున్నారు. అలాగే మంచి పుస్తకాలు చదవడం ద్వారా మెదడును చురుకుగా ఉంచుకోవచ్చని సూచించారు.


మూడవ రహస్యంగా 'సూపర్ సెల్ఫ్'ను మంజుల పరిచయం చేశారు. ఆత్మతో అనుసంధానం కావడానికి ధ్యానమే ఏకైక మార్గమని, తన 32 ఏళ్ల అనుభవంలో పది వేల గంటలకు పైగా ధ్యానం చేశానని ఆమె చెప్పారు. మనకు ఉచితంగా లభిస్తున్న సూర్యరశ్మి, ప్రేమించే కుటుంబం, నిరంతరం కొట్టుకునే గుండె.. ఇలా ప్రతిదాని పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని కోరారు. ఇతరులను, మనల్ని మనం క్షమించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని వివరించారు.

ఇకపై తాను సినిమాలు నిర్మించనని, ప్రజలకుఆరోగ్యంపై ఇలాంటి అవగాహన కల్పించడమే తన జీవిత లక్ష్యమని, ఇందుకోసం 'మన్ ఘట్' అనే వెల్‌నెస్ వేదికను నడుపుతున్నానని మంజుల స్పష్టం చేశారు. ఈ వెబినార్‌లోనాట్స్ సభ్యుల ప్రశ్నలకు చక్కటి సమాధానాలు ఇచ్చి వారి జీవితాలను ఎలా అందంగా మలుచుకోవాలో సూచించారు. ఇదే కార్యక్రమంలో నాట్స్ హెల్ఫ్ లైన్ ద్వారా అందిస్తున్న ఇమ్మిగ్రేషన్ సమస్యలకు పరిష్కార సూచనలు, గృహహింస బాధితులకు సాయం, వైద్యపరమైన సెకండ్ ఒపీనియన్ వంటి అనేక సామాజిక సేవల గురించి నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి వివరించారు.


Also Read:

జర్మనీలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

మెల్‌బోర్న్‌లో ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు

For More Latest News

Updated Date - Apr 21 , 2026 | 08:02 PM