డాలస్‌లో ఘనంగా ‘నెల నెలా తెలుగువెన్నెల’ 227వ సాహిత్య సదస్సు
ABN , Publish Date - Jun 29 , 2026 | 08:14 AM
అమెరికాలోని డాలస్ నగరంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నెల నెలా తెలుగువెన్నెల’ 227వ సాహిత్య సదస్సు ఆదివారం ఘనంగా జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని డాలస్ నగరంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నెల నెలా తెలుగువెన్నెల’ 227వ సాహిత్య సదస్సు ఆదివారం ఘనంగా జరిగింది. గత 19 సంవత్సరాలుగా నిరంతరాయంగా ప్రతి నెల మూడవ ఆదివారం నిర్వహిస్తున్న ఈ సాహిత్య కార్యక్రమం తెలుగు భాషా, సాహిత్యాభిమానులను ఒకే వేదికపైకి తీసుకువస్తూ విశేష ఆదరణ పొందుతోంది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న పారుపల్లి కోదండరామయ్య ‘తెలుగదేల యన్న’ అనే అంశంపై ప్రసంగించారు. తెలుగు భాష ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆధునిక జీవనశైలి ప్రభావం, ఆంగ్ల పదాల పెరుగుతున్న వినియోగం వల్ల అచ్చమైన తెలుగు పదాలు క్రమంగా కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోదండరామయ్య ప్రసంగం సాహితీ, భాషా ప్రియులను విశేషంగా అలరించింది.
సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడా స్వాగత వచనాలు పలుకుతూ సాహిత్య వేదిక గత 19 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రతి మూడవ ఆదివారం సాహిత్య కార్యక్రమాలని నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా, తెలుగు భాషా సాహిత్యాలని సుసంపన్నం చేసిన ఎందరో మహామహులు ఈ వేదికని అలంకరించారని, అలాగే ఎన్నో సాహిత్య ప్రక్రియల ప్రదర్శన జరిగిందని తెలిపారు. గత మూడేళ్లుగా ఈ కార్యక్రమ నిర్వహణ తనకెంతో తృప్తి నివ్వడమే కాక, ఎంతోమంది సాహితీ ఉద్దండులతో సాన్నిహిత్యాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
తొలుత '‘మహా గణపతిమ్ మనసా స్మరామి’ అంటూ ప్రార్థన గేయాన్ని చిరంజీవులు సాహితీ వేముల ,సింధు వేముల వీనుల విందుగా ఆలపించడంతో సదస్సును ప్రారంభించారు. ప్రముఖ కవి కీ.శే. వడ్డేపల్లికృష్ణ రాసిన 'నెల నెలా తెలుగు వెన్నెల' గీత విశిష్ఠాతను కొనియాడి, రికార్డు చేసిన ఆ సుమధుర గీతాన్ని శ్రోతలకు మరొకసారి వినిపించారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న నాన్న పండుగ (ఫాదర్స్ డే ) సందర్భాన్ని పురస్కరించుకొని 'నాన్నెందుకో వెనుక బడ్డాడు’ అనే కవితను సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడా చదివి వినిపించారు. అనంతరం నేటి ముఖ్య అతిథిని సాహిత్య ప్రియులకు పరిచయం చేశారు.

ముఖ్య అతిథి పారుపల్లి కోదండ రామయ్య మాట్లాడుతూ.. గత కొంతకాలంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరితో తెలుగు భాష అంతరిస్తున్న సూచనలు మన కళ్లముందు ఆవిష్కృతమవుతోందని తెలిపారు. ఈ విషయాన్ని యునెస్కో గణాంకాలతో సహా తేల్చి చెప్పింనీ పేర్కొన్నారు. మన గ్రామీణ ప్రాంతాల్లో కాలానుగుణంగా అందుబాటులో ఉండే తాటిముంజలు, సీమ చింతకాయలు, జామకాయలు, కలే కాయలు, తాటిముంజలు వంటి వృక్ష ఆధారిత ఫలాలు, మన పూర్వీకుల నుంచి పండుగల సమయంలో తయారుచేస్తున్న ఆవిరి కుడుములు వంటి పిండివంటలు, ఇంటిముంగిట ముగ్గులు వేసి అందంగా అలంకరించడానికి సాయపడే తంగేడు పూలు వంటివి పశ్చిమ దేశాలవారికి తెలియకపోవడంతో ఇక్కడ పెరిగిన మన వారసులకు ఆ తెలుగు పేర్ల పదాలు తెలిసే అవకాశమే లేదని అన్నారు. సరికొత్త ఆంగ్ల పదాల ప్రభావం, సామాజిక మార్పులతో మన తెలుగు భాషలోని ఎన్నో అచ్చమైన, అర్థవంతమైన పదాలు కనుమరుగవుతున్నాయని అత్యంత ఆవేదనతో పేర్కొన్నారు.

మనం బంధువులను పిలిచే సమయంలో ఉపయోగించే నాయన, అయ్య, తల్లి, అమ్మ, అవ్వ, అత్త, అత్తయ్య, తోడికోడలు,మేనమామ, మామయ్యలకు బదులు మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్ వంటి పిలుపులే ఎక్కువగా వినిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. తమిళనాడు, కేరళం, నాగాలాండ్ , మిజోరాం వాసులు తమ మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తున్నారని మన తెలుగు భాషా రాష్ట్రాల పాలకుల అలసత్వం కారణంగా తెలుగుకు ఆ ప్రాధాన్యం దక్కడం లేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి ఇక్కడ కొన్ని తెలుగు పదాలను ఆంగ్లభాషా పదాలకు బదులుగా వాడతామనీ, న్యాయస్థానాలతో సహా అన్ని శాఖల ఉత్తర్వుల్లోనూ తెలుగును విధిగా వాడాలని విజ్ఞాపనను ఈమెయిల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల పాలకులకూ, ఇంకా అధికారులకూ అభ్యర్ధనలు పంపుతామని అందరితో ప్రమాణం చేయించారు .
పారుపల్లి కోదండరామయ్య తెలుగు భాషా ఉద్యమం చేపట్టిన నాటి నుంచీ వారిని స్ఫూర్తిగా చేసుకొని తెలుగు భాషను చిన్నపిల్లలకు నేర్పిస్తున్నామని గోవర్ధనరావు నిడిగంటి పేర్కొన్నారు. వయసును కూడా లెక్కచేయకుండా తెలుగుభాషను బతికించడానికి అలుపెరుగని పోరాటం చేస్తున్న పారుపల్లి కోదండరామయ్యపై తాను రాసిన స్వీయకవితాను చదివి వినిపించారు. సాహితీప్రియులనందరినీ భాగస్వాములను చేస్తూ గత 96 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి ధారావాహిక 'మన తెలుగు సిరిసంపదలు' కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. పర్వదినమైనా సరే సభకు స్థానిక సాహితీ మిత్రులు ప్రత్యక్షంగానూ, జూంలోనూ పెద్ద సంఖ్యలో పాల్గొని సభని జయప్రదం చేశారు.

ఈ కార్యక్రమంలో సంస్థ పూర్వ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, నరసింహారెడ్డి ఊరిమిండి, సతీశ్ బండారు, చినసత్యం వీర్నపు, రాజారెడ్డి, ప్రస్తుత కార్యవర్గ సభ్యులు పవన్ నర్రా, కమలాకర్ దేవరకొండ పాల్గొన్నారు. వీరితో పాటు ప్రొఫెసర్ పుదూరు జగదీశ్వరన్, చంద్రహాస్ మద్దుకూరి, అనంత్ మల్లవరపు, లెనిన్ బండ, లెనిన్ వేముల, కిరణ్మయి గుంట, డాక్టర్ బల్లూరి ఉమాదేవి , విజయ మామునూరి, గోవర్ధనరావు నిడిగంటి, డా ఇస్మైయిల్ వంటి అనేకమంది సాహితీ ప్రియులు పాల్గొని వీక్షించడంతో ఈ సదస్సు విజయవంతమైంది. తర్వాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ తరపున దయాకర్ మాడ నేటి ముఖ్య అతిథికి సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి సన్మానించారు. వందన సమర్పణ గావించిన దయాకర్ మాడ.. సంస్థ పూర్వ అధ్యక్షులకూ సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా సహకరిస్తున్న దాతలకూ ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.