సత్సంకల్పంతో స్వాగతిద్దాం
ABN , Publish Date - Mar 13 , 2026 | 01:47 AM
సృష్టిని బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమినాడు ప్రారంభించినట్టు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అది యుగం ఆరంభమైన ఆ రోజు... యుగాది. అదే కాలక్రమంలో ‘ఉగాది’ అయింది.
పర్వదినం
సృష్టిని బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమినాడు ప్రారంభించినట్టు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అది యుగం ఆరంభమైన ఆ రోజు... యుగాది. అదే కాలక్రమంలో ‘ఉగాది’ అయింది. తెలుగువారికి ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. దీన్ని ‘సంవత్సరాది’ అని కూడా పిలుస్తారు. సృష్టి ప్రభవించిన తొలి సంవత్సరానికి ‘ప్రభవ’ అని పేరు. చాంద్రమానం ప్రకారం... కాలచక్రం ప్రభవ నుంచి క్షయ వరకూ... అరవై సంవత్సరాలు పరిభ్రమించి, తిరిగి ప్రభవకు వస్తుంది. వీటిలో నలభయ్యోది అయిన ‘పరాభవ’ నామ సంవత్సరంలోకి కొద్ది రోజుల్లో ప్రవేశించబోతున్నాం.
అనంతమైన కాలాన్ని దైవ స్వరూపంగా భారతీయ సంస్కృతి భావన చేసింది. మన పూర్వులు దాన్ని మహాయుగం, యుగం, శకం, సంవత్సరాలు... ఇలా వివిధ ప్రమాణాల్లో విభజన చేశారు. ఒక మహాయుగానికి నాలుగు యుగాలు ఉంటాయి. అవి కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలు. సంవత్సర కాలంలో రెండు ఆయనాలు, ఆరు ఋతువులు, పన్నెండు మాసాలు, ఇరవై ఏడు నక్షత్రాలు, రెండు పక్షాలు... ఇలా సూర్య, చంద్ర గ్రహాల ప్రమాణాలను అనుసరించి ప్రాచీన జ్యోతిష శాస్త్రవేత్తలు ఒక పద్ధతిని నిర్దేశించారు. భారతదేశంలో ప్రాంతాల మధ్య కొన్ని తేడాలు ఉన్నా... అందరూ పరిగణించే జ్యోతిష శాస్త్రం, గణన సూత్రం ఒక్కటే. దక్షిణాదిన సౌర, చాంద్రమానాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ మాసాలు సూర్య, చంద్రుల ఆధీనమైన కాలచక్రభ్రమణంలో ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో చాంద్రమానాన్ని పాటిస్తారు.
ఆచరించాల్సినవి:
మంచి సంకల్పాలతో, సత్సంప్రదాయాలతో ఉగాదిని స్వాగతించాలి. సంవత్సరాది నాడు అనుసరించవలసిన విధి విధానాలను పూర్వులు నిర్దేశించారు. ముందురోజే పుజామందిరాన్ని అలంకరించాలి. గుమ్మాలకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి. ద్వారాలకు మామిడి ఆకులు కట్టాలి. ముంగిళ్ళలో ముగ్గులను తీర్చిదిద్ది... వసంతమాస లక్ష్మిని ఆహ్వానించాలి. ఉగాది నాడు తెల్లవారుజామునే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, అభ్యంగన స్నానం చేయాలి. నూతన వస్త్రాలను ధరించాలి. దేవుడి ముందు జ్యోతిని వెలిగించాలి. ఇష్ట దేవతను పూజించాలి. పెద్దలకు నమస్కరించి, ఆశీర్వాదాలు తీసుకోవాలి. భగవంతుడికి నివేదించిన ఉగాది పచ్చడిని పరగడుపున ప్రసాదంగా స్వీకరించాలి. వేప పూత, కొత్త బెల్లం, నెయ్యి, మామిడి ముక్కలు, లవణం, మిరియాల పొడుల మిశ్రమం అయిన ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి. దీన్ని స్వీకరిస్తే త్రిదోషాల నుంచి, అంటే... వాత, పిత్త, కఫ వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుందని, ఆరోగ్యం చేకూరుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అనంతరం పంచాంగ పఠనం లేదా శ్రవణం చెయ్యాలి. ‘తిథి, వార, నక్షత్ర, కరణ యోగా’లనే అయిదు అంగాలతో కూడినది పంచాంగం (సంపద కోసం తిథి, దీర్ఘాయుష్షు కోసం వారం, పాప విముక్తికి నక్షత్రం, ఆరోగ్యానికి యోగం, కార్య సిద్ధికి కరణం). పంచాంగ శ్రవణం వల్ల రాబోయే సంవత్సర కాలంలో గ్రహాల సంచారం, అవి కలిగించే శుభ, అశుభ ఫలితాలు తెలుస్తాయి. ఏవైనా ఒడుదొడుకులు ఆ ఫలితాల్లో కనిపిస్తే... దేవ ప్రార్థన, పూజల ద్వారా వాటిని నివారించుకోవడం దీని వెనుక ముఖ్యమైన ఉద్దేశం, ఉగాది నాడు ఆలయానికి వెళ్ళి, భగవద్దర్శనం చేసుకోవడం వల్ల శ్రేయస్కరమైన ఫలితాలు కలుగుతాయి. లోకం అంతటికీ శుభం కలగాలని ఆశిస్తూ ఉగాదిని ఆహ్వానిద్దాం.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వదేశీ రక్షణ తయారీకి సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ ఊతం: మంత్రి నారాయణ
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు
జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
Read Latest International News And Telangana News And AP News And Telugu News