ఉగాది శోభ ఉట్టిపడేలా...
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:39 AM
ఉగాది రోజున పండుగ శోభ ఉట్టిపడేలా ఇల్లంతా అందంగా అలంకరిస్తే... ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. చిన్న చిన్న చిట్కాలతో చిటికెలో ఇంటిని శోభాయమానంగా ఎలా...
ఉగాది రోజున పండుగ శోభ ఉట్టిపడేలా ఇల్లంతా అందంగా అలంకరిస్తే... ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. చిన్న చిన్న చిట్కాలతో చిటికెలో ఇంటిని శోభాయమానంగా ఎలా మార్చాలో తెలుసుకుందాం.. రండి...
ఉదయాన్నే ఇల్లు, వాకిలి శుభ్రం చేయాలి. ఇంటి ముందు రంగు రంగుల ముగ్గు వేసి ఆపైన పూల రెక్కలతో అలంకరించాలి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. వీటితోపాటు బంతిపూల దండలు చేరిస్తే ఇంటి ప్రవేశ ద్వారానికి పండుగ శోభ వచ్చేస్తుంది.
ఇంట్లో పూజా మందిరంతోపాటు మిగిలిన గదులను బంతి పూలు, లిల్లీ పూల దండలతో అలంకరిస్తే ఇల్లంతా సువాసనలు నిండి సంతోషంగా అనిపిస్తుంది.
మామిడి ఆకులను పువ్వులు లేదా చిలుకల ఆకారాల్లో మడిచి దండలా చేసి సోఫా వెనకాల, కిటికీలకు వేలాడదీస్తే హాలంతా పచ్చదనం నిండి పండుగ వాతావరణం ప్రతిబింబిస్తుంది.
సోఫా కవర్లు, కర్టెన్లు, బెడ్ షీట్లు, పిల్లో కవర్లు తదితరాల్లో తెలుపు, ఆకుపచ్చ, పసుపు, మావి చిగురు రంగులు మిళితమై ఉండేలా చూసుకుంటే సందర్భానికి తగ్గట్టు ఉంటుంది. అలాగే డిజైన్లలో మామిడి పిందెలు, మల్లెలు, కోయిల ఉంటే చాలా రోజుల వరకు పండుగ భావన నిలిచి ఉంటుంది.
ఇంట్లో అక్కడక్కడ చిన్న ముగ్గులు వేసి వాటిలో గులాబీ, బంతి, చేమంతి పూల రేకులు నింపితే కళగా ఉంటుంది.
హాల్ మధ్యలో టీపాయ్ లేదా చిన్న స్టూల్ వేసి దానిమీద పెద్ద గిన్నె పెట్టి నీటితో నింపాలి. అందులో మల్లెమొగ్గలు వేయాలి. మధ్య మధ్యలో గులాబీలు, చామంతులను అందంగా అమరిస్తే చూడడానికి బాగుంటుంది. సాయంత్రం కాగానే ఈ గిన్నె చుట్టూ రంగురంగుల ఫ్లోరసెంట్ బల్బులను పెడితే ఫెస్టివల్ లుక్‌తో ఇల్లంతా మెరిసిపోతుంది.
ఈ పండుగ స్పెషల్ ఉగాది పచ్చడి కాబట్టి డైనింగ్ టేబుల్ మధ్యలో అందమైన ట్రేను ఉంచి అందులో పచ్చడి గిన్నెను పెట్టాలి. చుట్టూ పూల మాలలతో విడి పూలతో అలంకరిస్తే బాగుంటుంది. పిల్లలు కూడా ఆసక్తిగా ఉగాది పచ్చడి విశేషాలు అడిగి మరీ తెలుసుకుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చర్యలు: సీఎం చంద్రబాబు
మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామం.. మరో నిందితుడిని విచారిస్తున్న సిట్
గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు: మంత్రి నారాయణ
Read Latest AP News And Telangana News And International News And Telugu News