Share News

పండుగకి సరికొత్తగా

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:36 AM

ఉగాది పండుగ రోజున ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడితోపాటు రకరకాల వంటకాలు చేసుకుంటూ ఉంటాం. ఎప్పటిలా కాకుండా ఈ ఉగాదికి కాస్త విభిన్నంగా...

పండుగకి సరికొత్తగా

కమ్మగా

ఉగాది పండుగ రోజున ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడితోపాటు రకరకాల వంటకాలు చేసుకుంటూ ఉంటాం. ఎప్పటిలా కాకుండా ఈ ఉగాదికి కాస్త విభిన్నంగా ఈ రుచులు ప్రయత్నిద్దాం...

కోసాంబరి (కర్ణాటక)

కావాల్సిన పదార్థాలు

పెసరపప్పు- ఒక కప్పు, పచ్చి మామిడికాయ- ఒకటి, కేరట్లు- రెండు, కీరా- ఒకటి, టమాటా- ఒకటి, పచ్చి కొబ్బరి తురుం- అర కప్పు, పచ్చి మిర్చి- రెండు, ఎండు మిర్చి- ఒకటి, ఇంగువ- చిటికెడు, ఆవాలు- పావు చెంచా, జీలకర్ర- అర చెంచా, నూనె- రెండు చెంచాలు, కరివేపాకు- కొద్దిగా, కొత్తిమీర తరుగు- తగినంత, ఉప్పు- చిటికెడు

33-Navya.jpg

తయారీ విధానం

ఒక గిన్నెలో పెసరపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి నిండా నీళ్లు పోసి నాలుగు గంటలపాటు నానబెట్టాలి. తరువాత స్టయినర్‌లో వేసి నీళ్లన్నీ వడగట్టాలి. వెడల్పాటి గిన్నెలో నానిన పెసరపప్పు, సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, కేరట్‌ తురుం, సన్నగా తరిగిన కీరా ముక్కలు, పచ్చి కొబ్బరి తురుం, పచ్చి మిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. స్టవ్‌ మీద చిన్న గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తరువాత ఈ తాలింపును పెసరపప్పు మిశ్రమంలో వేసి, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. పైన కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి సర్వ్‌ చేయాలి.


333-Navya.jpg

హయగ్రీవ మద్ది (గోవా)

కావాల్సిన పదార్థాలు

పచ్చి శనగపప్పు- ఒక కప్పు, బెల్లం తురుం- ఒక కప్పు, లవంగాలు- రెండు, నెయ్యి- మూడు చెంచాలు, ఎండు కొబ్బరి ముక్కలు- పావు కప్పు, గసగసాలు- చెంచా, యాలకుల పొడి- అర చెంచా, పచ్చ కర్పూరం- చిటికెడు

తయారీ విధానం

ముందుగా పచ్చి శనగపప్పును గిన్నెలోకి తీసుకుని కడిగి నిండా నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి. తరువాత పప్పును కుక్కర్‌లో వేసి రెండు కప్పుల నీళ్లు పోసి పెద్ద మంట మీద మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. స్టవ్‌ మీద పాన్‌ పెట్టి అందులో బెల్లం వేసి మూడు చెంచాల నీళ్లు చిలకరించి కరిగించాలి. బెల్లం కరిగిన తరువాత లవంగాలు వేయాలి. బెల్లం పాకం పొంగుతున్నప్పుడు అందులో ఉడికించి పెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమం దగ్గరకు వచ్చే వరకు ఉడికించి స్టవ్‌ మీద నుంచి దించాలి. స్టవ్‌ మీద పాన్‌ పెట్టి నెయ్యి వేసి కరిగించాలి. ఆపైన ఎండు కొబ్బరి ముక్కలు, గసగసాలు వేసి రెండు నిమిషాలు వేయించి పచ్చి శనగపప్పు మిశ్రమంలో వేసి కలపాలి. తరువాత యాలకుల పొడి, పచ్చ కర్పూరం పొడి కూడా వేసి కలిపి వేడివేడిగా సర్వ్‌ చేయాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చర్యలు: సీఎం చంద్రబాబు

మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామం.. మరో నిందితుడిని విచారిస్తున్న సిట్

గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు: మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 19 , 2026 | 12:36 AM