భజతాం కల్పవృక్షాయ
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:23 AM
భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో... కాలాన్ని దాటి కోట్లాది భక్తుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహనీయులలో శ్రీరాఘవేంద్ర తీర్థులు అగ్రగణ్యులు. ద్వైత సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా స్థిరపరచడంతో పాటు... భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను సమన్వయపరచి, సమాజానికి ఆదర్శప్రాయమైన జీవనమార్గాన్ని చూపిన జగద్గురువు.
భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో... కాలాన్ని దాటి కోట్లాది భక్తుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహనీయులలో శ్రీరాఘవేంద్ర తీర్థులు అగ్రగణ్యులు. ద్వైత సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా స్థిరపరచడంతో పాటు... భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను సమన్వయపరచి, సమాజానికి ఆదర్శప్రాయమైన జీవనమార్గాన్ని చూపిన జగద్గురువు. ఆయన నామస్మరణ నేటికీ భక్తులకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తోంది.
‘‘ఒక వృక్షం రుచికరమైన పండ్లను ఇతరులకు ఇస్తుంది కానీ వాటిని తాను తినదు. నదిలో నీరు ఎటువంటి భేదభావం లేకుండా అన్ని ప్రాణుల దాహార్తి తీరుస్తుంది. అదే విధంగా శ్రీరాఘవేంద్రస్వామి ఎలాంటి స్వార్థాపేక్ష, భేదభావం లేకుండా సకల సజ్జనులను కరుణిస్తారు. అందుకే ఆయనను ‘భజతాం కల్పవృక్షాయ అని స్తుతిస్తాం’’ అని శ్రీసువిద్యేంద్రుల తీర్థులు ప్రశంసించారు.
బ్రహ్మలోకానికి చెంది శంఖుకర్ణుడు... బ్రహ్మ శాపం వల్ల భూలోకంలో ప్రహ్లాద మహారాజుగా అవతరించి ధర్మాన్ని స్థాపించాడు. ఆయన కలియుగంలో శ్రీ రాఘవేంద్ర తీర్థులుగా అవతరించి, మంత్రాలయంలో శ్రీరామసేవ చేస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడని భక్తుల విశ్వాసం. క్రీస్తుశకం 1595 ప్రాంతంలో... తమిళనాడులోని భువనగిరిలో తిమ్మన్నభట్ట, గోపికాంబ దంపతులకు శ్రీరాఘవేంద్రులు జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు వేంకటనాథుడు. చిన్న వయసునుంచే అసాధారణమైన మేధస్సును ప్రదర్శించిన వేంకటనాథుడు... వేదాలు, వ్యాకరణం, మీమాంస, న్యాయం, వేదాంతం తదితర శాస్త్రాలలో అపూర్వమైన పాండిత్యాన్ని సంపాదించారు. గృహస్థాశ్రమంలో తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఆయన అనుభవించినప్పటికీ ధర్మాన్ని ఎన్నడూ వీడలేదు. కొన్నాళ్ళకు శ్రీ సుధీంద్ర తీర్థుల ఆజ్ఞ ప్రకారం సన్యాసాన్ని స్వీకరించి... ‘శ్రీరాఘవేంద్ర తీర్థ’ అనే యతి నామాన్ని పొందారు. తదనంతరం శ్రీమఠాధిపతిగా ద్వైత సిద్ధాంత ప్రచారాన్ని దేశమంతటా సాగించారు.
అపార ద్వైత వేదాంత సంపద
శ్రీరాఘవేంద్రులు కేవలం మహిమలు ప్రదర్శించిన యోగి కాదు... అపూర్వ తత్త్వవేత్త, శాస్త్రకర్త. ఆయన రచించిన గ్రంథాలు నేటికీ ద్వైత వేదాంత అధ్యయనంలో ప్రామాణిక స్థానాన్ని పొందాయి. వాటిలో ముఖ్యమైనవి... న్యాయముక్తావళి వ్యాఖ్యానం, తత్వప్రకాశికా వ్యాఖ్యానం, తాత్పర్యచంద్రికా వ్యాఖ్యానం, గీతా వివృతి, ఉపనిషత్ ఖండార్థాలు, పురుషసూక్త వ్యాఖ్యానం, హిరణ్యగర్భ సూక్త వ్యాఖ్యానం లాంటివి. శ్రీమధ్వాచార్యులు, శ్రీ జయతీర్థులు, శ్రీ వ్యాసరాజుల పరంపరలోని గంభీర తత్త్వాన్ని సులభంగా, అర్థమయ్యే విధంగా వివరించడం శ్రీ రాఘవేంద్రుల రచనల ప్రత్యేకత. ద్వైత వేదాంతాన్ని కేవలం మఠాలకే పరిమితం చేయకుండా... గ్రామాలు, పట్టణాలకు తిరుగుతూ ప్రజలకు బోధించారు. ఆయన బోధల్లో ‘శ్రీహరే పరబ్రహ్మ, వాయుదేవుడే పరమ గురువు. భక్తి లేకుండా జ్ఞానం పరిపూర్ణం కాదు. శాస్త్రాధ్యయనం ఆచరణతో కలిసినప్పుడే ఫలిస్తుంది. సమాజ సేవ కూడా భగవత్సేవలో భాగమే’ లాంటి అంశాలు ప్రధానమైనవి. ప్రజల్లో ధర్మ జాగృతితో పాటు విద్య, వేద పారాయణం, అన్నదానం, పేదల పరిరక్షణ, పండితులకు గౌరవం తదితర కార్యక్రమాలకు ఆయన విశేష ప్రాధాన్యం ఇచ్చారు. జాతి, వర్ణం, ఆర్థిక స్థితి తదితర భేదాలు లేకుండా... ఆశ్రయం కోరిన ప్రతి ఒక్కరినీ ఆదరించారు. ‘కరుణాసాగరుడు’గా ప్రసిద్ధుడయ్యారు. ‘‘రాఘవేంద్రుణ్ణి సమస్యలున్నాయని వేడుకోవద్దు... ఆ సమస్యలకు చెప్పండి నా స్వామి రాఘవేంద్రుడని’’ అనేది ఆయనను నమ్ముకున్న భక్తుల నినాదం.
శ్రీరాఘవేంద్రులు 1671లో మంత్రాలయంలో సజీవ బృందావన ప్రవేశం చేశారు. ఆయన 700 ఏళ్ళపాటు బృందావనంలో యోగనిష్ఠలో ఉండి అందరినీ అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. ఈ రోజుకూ ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు మంత్రాలయానికి వెళ్ళి... గురు సార్వభౌముని ఆశీస్సులు పొందుతున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామివారు భక్తుల మనోరథాలను నెరవేర్చే కల్పవృక్షస్వరూపుడు. ఆయన కృప లోకంలో అందరికీ శాంతి, ధర్మం, భక్తి, జ్ఞానాలను ప్రసాదించాలని ప్రార్థిద్దాం.
(రేపటి నుంచి 31 వరకూ శ్రీరాఘవేంద్ర స్వామి 355వ ఆరాధన మహోత్సవాలు)
శ్రీమధ్వ ప్రచార పరిషత్
9440258841
కరుణాసాంద్రుడు
ఈ వార్తలను కూడా చదవండి
ట్రాన్స్‌ఫార్మర్లలో ఆయిల్ చోరీ
విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి