విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి
ABN , Publish Date - Aug 27 , 2026 | 11:16 PM
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లోని గిరిజన సంక్షేమ బాలుర సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు గురువారం యూనిఫాం, దుప్పట్లు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్‌లను పంపిణీ చేశారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లోని గిరిజన సంక్షేమ బాలుర సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు గురువారం యూనిఫాం, దుప్పట్లు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెను ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చదువుల్లో రాణించాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో బోధించాలన్నారు. వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, డీఆర్‌డీఓ దత్తారావు, ఈసీడీఓ శకుంతల, సిబ్బంది పాల్గొన్నారు.
నివేదికలు సమర్పించాలి
జిల్లాలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలతో నివేదికలు సమర్పించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలతో కూడిన నివేదికలు సిద్ధం చేయాలని తెలిపారు. లావుని పట్టా, సీలింగ్, ప్రభుత్వ భూములు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ఆస్తులు, విచారణ సంస్థలు అటాచ్ చేసిన ఆస్తులను నిషేధిత జాబితాలోని కేటగిరీలలో చేర్చాలని తెలిపారు. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు, కాలువల అభివృద్ధి పనుల కొరకు సేకరించిన భూములను జాబితాలో చేర్చాలని తెలిపారు. సాదాబైనామా, రెవెన్యూ సదస్సులు, భూభారతిలో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని చెప్పారు. ప్రజావాణిలో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ఆర్డీవోలు లోకేశ్వర్ రావు, కిష్టయ్య, సర్వే ల్యాండ్ రికార్స్ ఏడీ వినయ్, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు పాల్గొన్నారు.