ట్రాన్స్‌ఫార్మర్లలో ఆయిల్ చోరీ
ABN , Publish Date - Aug 27 , 2026 | 11:33 PM
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలో ఆయిల్ చోరీ చేస్తున్న అంతర్‌జిల్లా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు.
- ముగ్గురు అంతర్ జిల్లా దొంగల అరెస్టు
- పరారీలో మరో ఇద్దరు
కొత్తకోట, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలో ఆయిల్ చోరీ చేస్తున్న అంతర్‌జిల్లా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వనపర్తి జిల్లా, కొత్తకోట మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్‌పీ బాలాజీ తెలి పిన వివరాల ప్రకారం.. పెబ్బేర్ పట్టణానికి చెందిన డాకురి పెద్ద లింగన్న అలియాస్ డక్క లింగ, మహంకాళి కిషోర్, కార్నె అంజన్న, కార్నె విషేక్, డాకురి ఉపేంద్ర ముఠాగా ఏర్పడ్డారు. పగటి వేళ ట్రాన్స్‌ఫ్మారర్లు ఉన్న ప్రాంతాలను పరిశీలించి, రాత్రి పూట వాటిని ధ్వంసం చేసి ఆయిల్ చోరీ చేస్తున్నారు. ఈ నెల 23న విలియంకొండ సమీపంలోని ట్రాన్స్‌ఫార్మరు వద్ద ఉన్న వీరిని గమనించి న రైతు లక్ష్మీకాంత్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐలు విక్రమ్, భాస్కర్ రంగంలోకి దిగి ప్రత్యేక గస్తీ నిర్వహించారు. 26వ తేదీన రాత్రి కానాయపల్లి శివారులో అనుమానస్పదంగా తిరుగుతున్న కర్నె అంజన్న, కర్నె విషేక్, ఉపేంద్రలను అదుపులోకి తీసుకొని విచారించడంతో వాస్తవాలు బయటపడ్డాయి. ఉమ్మడి జిల్లాలో వీరిపై 23 కేసులు ఉన్నాయని డీఎస్‌పీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో కూడా వీరిపై కేసులున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి రూ. 2 లక్షలు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వారిని ఆత్మకూర్ కోర్టులో హజరు పరిచి, న్యాయాధికారి ఆదేశానుసారం రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ ఓడీ రమేష్, ఎస్‌ఐలు విక్రమ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.