Share News

స్ఫూర్తి మంత్రం.. అభివృద్ధి పథం

ABN , Publish Date - Aug 31 , 2026 | 01:57 AM

ఒక లక్ష్యం... దాన్ని నెరవేర్చుకోవాలన్న బలమైన సంకల్పం... ఇవే తేజస్విని హెబాల్కర్‌ను నేడు ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇంజినీరింగ్‌ చదివే రోజుల్లో చిప్స్‌ తయారీ రంగంలో స్థిరపడాలని...

స్ఫూర్తి మంత్రం.. అభివృద్ధి పథం

సంకల్పం

ఒక లక్ష్యం... దాన్ని నెరవేర్చుకోవాలన్న బలమైన సంకల్పం... ఇవే తేజస్విని హెబాల్కర్‌ను నేడు ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇంజినీరింగ్‌ చదివే రోజుల్లో చిప్స్‌ తయారీ రంగంలో స్థిరపడాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా నెట్‌వర్కింగ్‌ వైపు ఆకర్షితులయ్యారు. ఇంటర్నెట్‌, డాట్‌కామ్‌ల విప్లవం ప్రారంభమైన రోజుల్లో కంప్యూటర్లతో దోస్తీ మొదలుపెట్టిన ఆమె... ఇప్పుడు అమెరికాలోని అతిపెద్ద ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో ఒకటైన ‘ఆల్‌స్టేట్స్‌’లో కీలక పదవిని అలంకరించారు. ఏఐ యుగంలోనూ పోటీపడుతూ మహిళలకు స్ఫూర్తిమంత్రమయ్యారు.

‘‘విచిత్రమైన ప్రయాణం నాది. పుట్టింది, పెరిగిందంతా ముంబయిలోనే. కానీ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాను. చదువు అవ్వగానే అక్కడే కొలువు. చివరకు అమెరికా నా గమ్యస్థానం అయింది. విశేషమేంటంటే మా అమ్మానాన్న కూడా యూఎ్‌సలోనే చదువుకున్నారు. నేను మొదటి నుంచీ చదువులో టాప్‌లో ఉండేదాన్ని. ముఖ్యంగా గణితం, సైన్స్‌పై మక్కువ ఎక్కువ. అమెరికాలోని ‘కార్నేజి మెలాన్‌ యూనివర్సిటీ’లో ఎలక్ర్టికల్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చదివాను. అదే విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ కూడా పూర్తి చేశాను. బీటెక్‌ చదివే రోజుల్లో చిప్‌ తయారీ రంగంలో స్థిరపడాలని అనుకున్నాను. ఎంఎ్‌సకు వెళ్లేసరికి నెట్‌వర్కింగ్‌ మీదకు మనసు మళ్లింది. ఎందుకంటే అది 1990ల కాలం. అప్పుడే ఇంటర్నెట్‌, డాట్‌కామ్‌ విప్లవం మొదలైంది. వేగవంతమైన నెట్‌వర్క్‌లు అతిపెద్ద ఆవిష్కరణలుగా ఆవిర్భవిస్తున్న కాలం. వీటన్నిటి నేపథ్యంలో ఏఎండీ, డెల్‌లలో ఇంటర్న్‌షిప్‌ తరువాత 2001లో నోకియాలో మేనేజర్‌గా మూడేళ్లు పని చేశాను. అక్కడి నుంచి ఇన్ఫోసిస్‌, సిస్కోలో రెండేళ్లు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించాను. ప్రముఖ గ్లోబల్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ కన్సల్టెన్సీ జెడ్‌ఎ్‌సలో ఎనిమిదేళ్లు వెస్ట్‌ రీజియన్‌ లీడ్‌గా సేవలు అందించాను. మార్కెట్‌ వ్యూహాలు, వాణిజ్యపరమైన ఆవిష్కరణలు, కస్టమర్‌ సపోర్ట్‌ లాంటి విభిన్న విభాగాలను సమన్వయం చేసుకొంటూ కంపెనీని అభివృద్ధి పథంలో నడిపే బాధ్యత నాది.


అందుకే ఎంబీయే...

నోకియాలో పని చేసే సమయంలో పెద్ద రౌటర్లు, స్విచ్‌లను తయారు చేసేవాళ్లం. వాటిలో నూతన ఆవిష్కరణలకు ప్రయత్నించే క్రమంలో నాకు వ్యాపారపరమైన అంశాలపై ఆసక్తి కలిగింది. దాంతో కొన్నేళ్లు నా కెరీర్‌ టెక్‌ ప్రపంచం, వ్యాపార కార్యకలాపాల మధ్య సాగింది. ఇదే క్రమంలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొనేందుకు ఎంఐటీ స్లోన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీయే చేశాను. తరువాత స్కేర్‌ ట్రేడ్‌లో చీఫ్‌ సర్వీస్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టాను. అందులో పదేళ్లకు పైగా పని చేశాను. ఆ సమయంలోనే ‘ఆల్‌స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ స్వ్వేర్‌ ట్రేడ్‌ను కొనుగోలు చేసింది. నా కెరీర్‌ను మలుపు తిప్పిన సందర్భం అది. ‘ఆల్‌స్టేట్‌’ అమెరికాలోని అతిపెద్ద పబ్లిక్‌ ఇన్సూరెన్స్‌ ప్రొవైడర్లలో ఒకటి. భారత్‌లోని బెంగళూరు, పుణేల్లో దీని కేంద్రాలు ఉన్నాయి. ఆ సంస్థకు ఆపరేషన్స్‌, ప్రాపర్టీ లయబిలిటీ డిజిటల్‌ ప్రాసెస్‌ ట్రాన్సర్మేషన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఎస్‌వీపీ)గా వ్యవహరిస్తున్నాను. అలాగే ఇండియా విభాగానికి ప్రెసిడెంట్‌గా ఉన్నాను. కంపెనీలో ఏడు వేలమందికి పైగా పని చేస్తున్నారు.

విభిన్నమైన పాత్ర...

ఏడాదిన్నరగా ‘ఆల్‌స్టేట్‌’లో పని చేసే క్రమంలో ఒక విభిన్నమైన పాత్రలోకి మారాను. కస్టమర్‌ సర్వీస్‌, బ్యాక్‌ ఆఫీస్‌, క్యాపబిలిటీ ఆపరేషన్స్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ చూసుకొంటున్నాను. ఏఐ విప్లవాన్ని అందిపుచ్చుకొని, అధునాత సాంకేతికతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను టెక్‌ రంగంలోకి అడుగుపెట్టే సమయంలో మహిళలు చాలా అరుదుగా కనిపించేవారు. అడ్డంకులు, పరిమితులు సవాళ్లు విసురుతుంటే, అన్నింటినీ ఛేదించుకొంటూ ముందుకు సాగాను. నాలాగా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని అనుకొనే మహిళలకు అండగా నిలుస్తున్నాను. వారి కోసం అవకాశాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాను. అంతిమంగా మహిళల సంఖ్యను పెంచేందుకు నా వంతు కృషి చేశాను. మా సంస్థలో కూడా అమ్మాయిలకు అనువైన వాతావరణం కల్పించడానికి, ప్రసూతి సమయంలో సహకారం అందించడానికి ‘ఆల్‌ మామా’ అనే కార్యక్రమం ప్రారంభించాను. ఇలాంటివి ఇంకా ఎన్నో తీసుకువచ్చాను.


సహానుభూతి అవసరం...

ప్రస్తుతం ఏఐ విప్లవం నడుస్తోంది. ఏఐ సాధనాల ద్వారా సాంకేతిక నైపుణ్యాలు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. అదే సమయంలో సహానుభూతి కూడా ఉండాలి. ఏఐ విశ్లేషణాత్మకమైన, సవాళ్లతో కూడిన కోడింగ్‌ తదితర క్లిష్టమైన పనులను కూడా చేయగలదు. కానీ మానవ సంబంధాలను నెరపలేదు. మనం నిర్మించుకొనే సంబంధాలు, సహానుభూతి అత్యంత ముఖ్యమైనవనేది నా భావన. ఇక నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో సాధించిన విజయాలంటే... నేను ప్రభావితం చేసిన వ్యక్తుల సంఖ్యేనని చెబుతాను. ఒక టీమ్‌ లీడర్‌గా విజయం సాధిస్తే, అది నాకే కాదు, నన్ను నమ్ముకున్న సంస్థకు కూడా మేలు చేస్తుంది. కొత్త సామర్థ్యాలను గుర్తించి, అత్యుత్తమ పనితీరు కనబరిచే బృందాలను నిర్మించడంపైనే ఒక లీడర్‌ గెలుపు ఆధారపడి ఉంటుంది. అంతేకాదు... ప్రతిఒక్క టీమ్‌లోని ప్రతిఒక్క సభ్యుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించి, లీడర్లుగా తీర్చిదిద్దగలిగితే అప్పుడే అసలైన విజయం సిద్ధించినట్టు.’’

ఇవి కూడా చదవండి..

సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు

ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని

తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 01:57 AM