Share News

మహా శుభరాత్రి

ABN , Publish Date - Mar 13 , 2026 | 01:36 AM

రంజాన్‌ మాసంలోని చివరి పది రోజుల్లో దైవం అనుగ్రహించిన అత్యంత శ్రేష్టమైన, మనోహరమైన రాత్రి ‘షబె ఖద్ర్‌’ వస్తుంది. ఘనమైన ఈ రాత్రినాడే మానవులకు...

మహా శుభరాత్రి

సందేశం

రంజాన్‌ మాసంలోని చివరి పది రోజుల్లో దైవం అనుగ్రహించిన అత్యంత శ్రేష్టమైన, మనోహరమైన రాత్రి ‘షబె ఖద్ర్‌’ వస్తుంది. ఘనమైన ఈ రాత్రినాడే మానవులకు మార్గదర్శనం కోసం దివ్య ఖుర్‌ఆన్‌ను అల్లాహ్‌ అల్లాహ్‌ అందించాడు. షబె ఖద్ర్‌ రోజున ‘దివ్య ఖుర్‌ఆన్‌ వహీ’ (దైవ సందేశం) అవతరించింది. అనంతరం ఇరవై మూడేళ్ళ వ్యవధిలో దైవ ప్రవక్త మహమ్మద్‌ ఆవతరణ జరిగింది.

‘షబె ఖద్ర్‌’ను వెయ్యి రాత్రులతో సమానమైనదిగా భావిస్తారు. వెయ్యి నెలలు అంటే దాదాపు ఎనభై మూడేళ్ళ నాలుగు నెలలు. ఈ ఒక్క రాత్రి దైవారాధనలో గడిపితే... ఎనభై మూడేళ్ళు గడిపినట్టేనని పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. మానవుల ఉపాధి, జీవన్మరణాలు, కర్మలకు సంబంధించిన నిర్ణయాలు జరిగే రాత్రి ఇది. దైవదూతలు దివి నుంచి భువికి వచ్చి... దైవ కారుణ్యాన్ని భూమండలమంతా కురిపిస్తారు. ఎవరైతే ఈ రాత్రి పూర్తి ఏకాగ్రతతో ప్రార్థన చేసి, తమ తప్పులను, పాపాలను శాశ్వతంగా విడిచిపెట్టి... దైవాన్ని క్షమాపణలు కోరుకుంటారో... వారి క్షమాపణలను దైవం స్వీకరిస్తాడు. దైవ ప్రసన్నత కోరుతూ ఈ రాత్రి ఆరాధనలో నిమగ్నమయినవారు దేవుని దృష్టిలో అత్యంత గౌరవనీయులు అవుతారు. దైవారాధనలో గడపకుండా ఈ రాత్రిని వృధా చేసినవారు సకల శుభాలను కోల్పోతారు.

‘‘మేము దివ్య ఖుర్‌ఆన్‌ను ఘనతగలిగిన ఈ రాత్రి అవతరింపజేశాం. ఈ రాత్రి వెయ్యి నెలలకన్నా శ్రేష్టమైనది’’ అని దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ తెలిపారు. దైవ ప్రవక్త రంజాన్‌ మాసంలోని చివరి పది రోజుల్లో... అయిదు బేసి రాత్రుల్లో (21, 23, 25, 27, 29) చాలా ఎక్కువగా ఆరాధనలు చేసేవారు. అలాగే... ఇతరులను దైవారాధన చేయాల్సిందిగా ప్రోత్సహించేవారు. షబె ఖద్ర్‌... మగ్రిబ్‌ నమాజ్‌ నుంచి ప్రారంభమై, ఫజ్ర్‌ నమాజ్‌ వరకూ ఉంటుంది. ఈ రాత్రి నమాజ్‌ దివ్య ఖుర్‌ఆన్‌ పారాయణం, దైవనామస్మరణలతో గడపాలి. గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందాలి. దేవుణ్ణి క్షమాపణ కోరాలి. ఈ రాత్రి దేవదూతలు, మహనీయుడైన హజ్రత్‌ జిబ్రీల్‌ భూమిపైకి దిగి వస్తారు. దైవారాధనలో నిమగ్నమైనవారికోసం దేవదూతలు ప్రార్థన చేస్తారు. ఈ రాత్రి ఎలాంటి చెడుకు ఆస్కారం లేదు. ఎందుకంటే శుభమైన ఈ రాత్రిలో దైవ నిర్ణయాలన్నీ మానవాళి మేలు కోసమే.


‘‘తల్లిదండ్రులపట్ల దుష్ప్రవర్తనతో మెలిగేవారు, బంధువులతో సంబంధాలు తెంచుకొనేవారు, ఈర్ష్యాద్వేషాలు కలిగినవారు, మద్యపానం చేసేవారు... వీరి ఆరాధనలను అల్లాహ్‌ స్వీకరించడు. షబె ఖద్ర్‌ పట్ల పరిపూర్ణ విశ్వాసంతో, దైవం ప్రసాదించే ప్రతిఫలాన్ని ఆశించి, ఆరాధనకోసం నిలిచి ఉండే వ్యక్తి... గతంలో చేసిన పాపాలన్నిటి నుంచి క్షమాపణ పొందుతాడు’’ అని హదీస్‌ గ్రంథం చెబుతోంది.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

ఈ వార్తలు కూడా చదవండి..

స్వదేశీ రక్షణ తయారీకి సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌ ఊతం: మంత్రి నారాయణ

మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు

జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 13 , 2026 | 01:36 AM