Share News

పప్పీతో షికారుకు వెళుతున్నారా!

ABN , Publish Date - Aug 31 , 2026 | 01:53 AM

పెంపుడు కుక్కలను వాకింగ్‌కు తీసుకువెళ్లడం తప్పనిసరి. అయితే వాటిని నడిపించే విధానంలో తప్పులు దొర్లకుండా చూసుకుంటున్నామా? ఈ సందర్భంలో పాటించవలసిన నియమాలు...

పప్పీతో షికారుకు వెళుతున్నారా!

పెట్‌ కేర్‌

పెంపుడు కుక్కలను వాకింగ్‌కు తీసుకువెళ్లడం తప్పనిసరి. అయితే వాటిని నడిపించే విధానంలో తప్పులు దొర్లకుండా చూసుకుంటున్నామా? ఈ సందర్భంలో పాటించవలసిన నియమాలు ఏవైనా ఉన్నాయా? తెలుసుకుందాం!

పెంపుడు కుక్కల శరీర దారుఢ్యానికి, మానసికోల్లాసానికీ వాటిని క్రమం తప్పకుండా వాకింగ్‌కు తీసుకువెళ్తూ ఉండాలి. క్రమం తప్పని నడకతో కుక్కల గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడంతో పాటు కండరాలు, కీళ్ల కదలికలు మెరుగ్గా ఉంటాయి. అలాగే పైబడే వయసుతో కుక్కలు బరువు పెరిగే సమస్య కూడా తప్పుతుంది. అయితే కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లడం అంటే, మెడకు బెల్టు కట్టి నడిపించుకుంటూ తిప్పడం మాత్రమే కాదు. కుక్కలకు అసౌకర్యం, హాని కలగకుండా ఉండాలంటే, వాటి మెడకు బిగించే బెల్టు, లీష్‌ మొదలు, వాటిని నడిపించే తీరు కూడా సక్రమంగా సాగేలా చూసుకోవాలి. అందుకోసం కొన్ని నియమాలు పాటించాలి.

సరైన లీష్‌ లేదా కాలర్‌

  • మరీ బిగుతుగా, మరీ బరువుగా లేదా కుక్క మెడకు తగని లీష్‌ లేదా కాలర్‌ను బిగిస్తే నడక ఇబ్బందికరంగా మారుతుంది.

  • మరీ ముఖ్యంగా కుక్క పిల్లలు, పగ్‌, పమేరియన్‌ లాంటి చిన్నపాటి కుక్కలు మెడ ఒరుసుకుపోయి ఇబ్బంది పడతాయి.

  • కుక్క సౌకర్యంగా అన్ని వైపులకూ కదలగలిగేలా వాటి వాకింగ్‌ పరికరాలను ఎంచుకోవాలి.

లాగడం లేదా ఈడ్చుకెళ్లడం

  • నడక ఒక పెద్ద కుస్తీ పోటీలా మారకూడదు. లీష్‌ పట్టుకుని అదే పనిగా లాగితే కుక్క మెడ మీద ఒత్తిడి పడుతుంది. దాంతో నడకకు బయల్దేరిన ప్రతిసారీ ఆందోళనకు లోనవుతుంది.

  • లీష్‌ను వదులుగా ఉంచి, కుక్క సౌకర్యంగా, తగినంత వేగంగా నడవగలిగే వీలు కల్పించాలి.

  • నడిపించే ప్రతిసారీ కుడి లేదా ఎడమ.. ఏదో ఒక వైపు నడకనే అలవాటు చేయాలి.

నడక వ్యాయామం కాదు

  • ప్రతి కుక్కకూ నడకకు మించిన వ్యాయామం అవసరం లేకపోయినా, కుక్కల వయసు, ఆరోగ్య సమస్యల ఆధారంగా వ్యాయామం తీవ్రతను అంచనా వేయాలి.

  • పరిగెత్తించడం మంచిదనే ఉద్దేశంతో వయసు పైబడిన కుక్కలనూ, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే కుక్కలనూ, కీళ్ల నొప్పులతో అవస్థలు పడే కుక్కలను బలవంతంగా పరిగెత్తించకూడదు.

  • అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్న, వయసులో చిన్నవైన కుక్కలను పరిగెత్తించవచ్చు.

  • సుదీర్ఘమైన, వేగమైన పరుగును కుక్కలకు నెమ్మదిగా అలవాటు చేయాలి. అలసట, వగర్చడం, పదే పదే ఆగడం, కుంటడం, వేగాన్ని అందుకోలేకపోవడం లాంటి లక్షణాలను గమనిస్తే, వెంటనే నడక లేదా పరుగును ఆపేయాలి.


సరిపడా సమయం

  • వాసన చూడడం, పరిసరాలను అన్వేషించడం కుక్కల నైజం. ఆ సమయాన్ని వాటికి ఇవ్వాలి.

  • కొందరు కుక్కల నడకను కొద్ది దూరాలకే పరిమితం చేస్తారు లేదా నడకను వేగంగా ముగించేస్తారు. ఇది తప్పు. కుక్కలు నడవగలిగే దూరం నడిపించాలి.

  • కుక్కలను ప్రతి రోజూ ఒకే సమయానికి నడకకు తీసుకువెళ్లాలి. నడకకు ముందు నీళ్లు తాగించాలి.

  • నడిపించే దారి కూడా కుక్కలకు సురక్షితమైనదై ఉండాలి. కాలిపోయే రోడ్డు లేదా పేవ్‌మెంట్స్‌, జారుడుగా ఉండే ప్రదేశాలు, గుంతల రోడ్లు, నిల్వ నీళ్లున్న ప్రదేశాలు, వ్యర్థాలతో నిండిన ప్రాంతాలను కుక్కల నడకకు ఎంచుకోకూడదు.

  • నడక తర్వాత మరీ ముఖ్యంగా వానాకాలంలో కుక్కల పాదాలు, పొట్ట దిగువ ప్రదేశం శుభ్రం చేయాలి.

  • కుక్క వయసు, బ్రీడ్‌, బరువు, శరీర తీరు, ఆరోగ్యం ఆధారంగా పశువైద్యుల సలహా మేరకు నడక దూరం, వ్యాయామం తీవ్రతలను ఎంచుకోవాలి.

ఇవి కూడా చదవండి..

సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు

ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని

తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 01:53 AM