Share News

వారే పునీతులు

ABN , Publish Date - Aug 28 , 2026 | 01:07 AM

భగవంతుడు అనుగ్రహించిన జీవితాన్ని సార్థకం చేసుకోవడమే మానవ జీవన పరిమార్థం. అలా జీవించినవారు మహాత్ములుగా చరిత్రలో నిలుస్తారు. క్రైస్తవ జీవన యానంలో... జీవితాన్ని చరితార్థం చేసుకుని, దేవుని సాన్నిధ్యాన్ని పొందినవారిని ‘పునీతులు’ అంటారు.

వారే పునీతులు

భగవంతుడు అనుగ్రహించిన జీవితాన్ని సార్థకం చేసుకోవడమే మానవ జీవన పరిమార్థం. అలా జీవించినవారు మహాత్ములుగా చరిత్రలో నిలుస్తారు. క్రైస్తవ జీవన యానంలో... జీవితాన్ని చరితార్థం చేసుకుని, దేవుని సాన్నిధ్యాన్ని పొందినవారిని ‘పునీతులు’ అంటారు. వారిలో ప్రతి ఒక్కరి వెనుకా త్యాగమయమైన జీవితం ఉంటుంది. వారి ప్రభావంతో జరిగిన కొన్ని అద్భుతమైన సంఘటనలు ఉంటాయి. క్రైస్తవ సమాజంపైన, చర్చిలపైన వారు ఆధ్యాత్మికమైన ప్రభావాన్ని చూపిస్తారు. ఈ అంశాలన్నిటినీ క్రైస్తవ విశ్వగురువైన పోప్‌ తన ప్రతినిధి బృందంతో పరిశీలించాక... అటువంటి ఘన చరితులను ‘పునీతులు’గా ప్రకటిస్తారు.

క్రైస్తవ ధర్మంలో సన్యాసం అనేది చిన్న వయసులోనే ప్రారంభం అవుతుంది. పన్నెండేళ్ళపాటు మతానికి, దైవానికి సంబంధించిన అనేక అంశాలను అధ్యయనం చేస్తారు. ప్రజలకు, దేవునికి మధ్యవర్తులుగా ఉంటారు. వారు అన్నిటినీ వదిలిపెడతారు కానీ ప్రజలను విడిచిపెట్టరు. సమాజంలోనే తిరుగుతారు. ప్రజల మధ్య నివసిస్తూ... వారికి దైవ జ్ఞానాన్ని బోధిస్తారు. వివిధ రూపాల్లో సేవలు చేస్తారు. అక్కడే వారి పునీత ప్రస్థానం మొదలవుతుంది. అయితే సన్యాసులు, బోధకులు (గురువులు) కోట్ల మంది ఉండవచ్చు. వారిలో పునీతులు ఉండవచ్చు. కానీ వారిలో ప్రతి ఒక్కరూ పునీతులు కాలేరు. జీవితమంతా సత్కార్యాలు చేసినవారు, జీవితాన్ని ప్రభువుకోసం సమర్పించినవారు మరణించిన తరువాత.. వారి ప్రార్థన ద్వారా అద్భుతాలు జరిగితే... అప్పుడు వారిని పునీతులుగా పోప్‌ ప్రకటిస్తారు. అటువంటివారికి ఎలాంటి హోదాలు, పదవులు అవసరం లేదు. ప్రభువు మార్గంలో నడిచి, సత్కార్యాలు చేసి, తదనంతరం వారి ద్వారా అద్భుతాలు జరగడం మాత్రమే పునీతత్వానికి కొలమానం. పేతురు, పౌలు, స్టీఫెన్‌ మొదలుకొని మదర్‌ థెరిసా వరకూ ఎంతోమంది పునీతులయ్యారు. వారిలో గృహస్తులు కూడా ఉన్నారు. క్రీస్తు వెలిగించిన ప్రేమ జ్యోతి వెలుగులో... ఆయనలా జీవించడమే పునీతత్వానికి సోపానం.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌

9866755024


ఈ వార్తలను కూడా చదవండి

పొగాకుపై అపరాధరుసుంను రద్దు చేయాలి

ఎరువుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు

Updated Date - Aug 28 , 2026 | 01:07 AM