ఎరువుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు
ABN , Publish Date - Aug 27 , 2026 | 11:32 PM
రైతులకు అందాల్సిన ఎరువుల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి భవానిశంకర్ అన్నారు.
- రైతులకు అవసరమైనవి సిద్ధంగా ఉంచాలి
- జిల్లా వ్యవసాయాధికారి భవానిశంకర్
సీతానగరం, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): రైతులకు అందాల్సిన ఎరువుల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి భవానిశంకర్ అన్నారు. గురువారం మండలంలోని గ్రోమోర్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిష్టర్లు, విక్రయ రికార్డులు, ధరల పట్టికలను క్షుణ్ణంగా పరిశీలించారు. అందుబాటులో ఉన్న నిల్వలు, విక్రయాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు అవసరమైన ఎరువులను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పనిసరిగా రైతులకు రశీదు ఇవ్వాలని, స్టాక్ వివరాలను ఎప్పటిప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఎరువులు నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదన్నారు. పంట అవసరాలకు అనుగుణంగా ఎరువుల వినియోగంపై రైతులకు సాంకేతిక సలహాలు అందించాలని తెలిపారు. ఎరువుల కొరత లేకుండా మండల స్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో మండల వ్యవసాయాధికారి ఎస్.అవినాష్, సిబ్బంది, గ్రోమోర్ కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.