Share News

‘జిగినీ’ జిలుగులు

ABN , Publish Date - Sep 06 , 2026 | 03:45 AM

అమ్మమ్మ, నానమ్మల కాలంలో విశేషంగా ప్రాచుర్యం పొందిన జిగినీ నెక్లెస్‌ కొత్త నగిషీలద్దుకుని ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లో దీన్ని వారసత్వపు ...

‘జిగినీ’ జిలుగులు

అమ్మమ్మ, నానమ్మల కాలంలో విశేషంగా ప్రాచుర్యం పొందిన జిగినీ నెక్లెస్‌ కొత్త నగిషీలద్దుకుని ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లో దీన్ని వారసత్వపు నగగా పరిగణించేవారు. కాలర్‌బోన్‌పై చక్కగా అమరే ఈ నెక్లెస్‌... అడ్డిగ, నాన్‌పట్టీల మాదిరి కనిపిస్తుంటుంది. కంటెలా బిగుతుగా కాకుండా వదులుగా ఉండే పట్టీ లేదా వెడల్పాటి చిన్న గొలుసు, రంగురంగుల రాళ్లతో నిండిన పెండెంట్‌ ఈ నగ ప్రత్యేకత. మెయిన్‌ పెండెంట్‌కు ఇరు పక్కలా రెండు లేదా మూడు చిన్న పెండెంట్లు అమర్చిన డిజైన్లు; పెండెంట్‌ను పోలిన చెవి దిద్దులు, జుంకాలు కూడా ఉండేవి. వీటితోపాటు నేటి పోకడలకు అనుగుణంగా మార్చిన సింపుల్‌ డిజెన్లు ఎన్నో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. బంగారంతో రూపొందించిన జిగినీలు కూడా బడ్జెట్‌ ధరకే లభిస్తుండడంతో యువతులు ఎక్కువగా వాటిపై దృష్టి సారిస్తున్నారు.

జిగినీలను ప్రాచీన చోళుల కాలంలోనే రూపొందించినట్లు చెబుతారు. మొదట దేవాలయాల్లోని దేవతా విగ్రహాలను అలంకరించడానికి రాజకుటుంబాలకు చెందిన మహిళల కోసం ఈ పొట్టి హారాలను తయారుచేసేవారు. క్రమంగా వీటిని దేవదాసీలు నాట్య ప్రదర్శనలప్పుడు ధరించడంతో అవి సామాన్య మహిళలను సైతం ఆకర్షించాయి. అలా అందరికీ పరిచయమైన జిగినీ నెక్లెస్‌ చాలా కాలంపాటు పెళ్లి కూతురికి ప్రధాన ఆభరణంగా కొనసాగింది.

జిగినీ నెక్లెస్‌.. మెడను అంటిపెట్టుకుని పొట్టిగా చోకర్‌లా కనిపిస్తుంటుంది. మెడ ఎలా ఉన్నా దానిపై చక్కగా అమరుతుంది. నెక్లెస్‌ మధ్యలో అమర్చిన లాకెట్‌.. ముఖాన్ని కాంతివంతంగా మెరిపిస్తుంది. లాకెట్‌పై నెమలి, హంస, ఏనుగు, తామరపువ్వు, ప్రకృతిలోని ప్రధానాంశాలు, లక్ష్మీదేవి తదితర ఆకృతులను రూపొందిస్తారు. వీటిలో గుండ్రంగా, అండాకారంలో, చతురస్రాకారంలో లేదంటే ఇతర అనువైన ఆకృతుల్లో కట్‌ చేసిన కెంపులు, పచ్చలు, నీలాలు, వజ్రాలు, క్యూబిక్‌ జిర్కోనియా స్టోన్స్‌ను పొదుగుతారు. లాకెట్‌కు బంగారు గుండ్లు, ముత్యాలు, ఇతర డాంగిల్స్‌ను వేలాడదీసి అదనపు హంగులద్దుతారు.


జిగినీ తయారీకి ఎక్కువ బంగారం అవసరం ఉండదు. కేవలం పదమూడు నుంచి ఇరవై గ్రాముల్లోనే గ్రాండ్‌ డిజైన్లను రూపొందిస్తున్నారు డిజైనర్లు. లైట్‌ వెయిట్‌తో భారీగా కనిపించే డిజైన్లు, అలాగే ఏ సందర్భంలోనైనా పెట్టుకోవడానికి వీలుగా ఉండే సింపుల్‌ డిజైన్లు సరసమైన ధరలకే లభ్యమవుతున్నాయి. ఇక స్టెర్లింగ్‌ వెండి, పంచలోహాలతో తయారుచేసినవి; యాంటిక్‌ ఫినిషింగ్‌తో కూర్చినవి; గోల్డ్‌ ప్లేటెడ్‌ మైక్రో ఫినిషింగ్‌తో రూపొందించినవి కూడా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌లలో విరివిగా లభ్యమవుతున్నాయి.

కంజీవరం పట్టుచీరల మీద అద్భుతంగా సూటవుతాయి ఈ జిగినీ సెట్లు. రౌండ్‌ లో కట్‌, డీప్‌ హార్ట్‌, బ్రాడ్‌ బోట్‌ నెక్‌ డిజైనరీ బ్లౌజులు ధరిస్తే ఈ నెక్లెస్‌ అందంగా కనిపిస్తుంది. పండుగలు, శుభకార్యాలప్పుడు ధరించే సంప్రదాయ దుస్తులపై పొడవాటి చంద్రహారం, మామిడి పిందెల హారం లేదా కాసుల పేరుతో పాటు ఈ జిగినీ నెక్లె్‌సను పెట్టుకుంటే గ్రాండ్‌ లుక్‌ వస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌‌రెడ్డి

సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల

రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 03:45 AM