అది మనలోనే ఉంది
ABN , Publish Date - Mar 13 , 2026 | 01:33 AM
ఒక ఊరిలో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను వీధివీధికి తిరిగి, ఇంటింటి ముందూ నిలబడి ‘‘అమ్మా! భిక్షం పెట్టండి, అయ్యా! దానం చెయ్యండి’’ అని దీనంగా అడిగేవాడు. కొందరు పొమ్మనేవారు...
సద్బోధ
ఒక ఊరిలో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను వీధివీధికి తిరిగి, ఇంటింటి ముందూ నిలబడి ‘‘అమ్మా! భిక్షం పెట్టండి, అయ్యా! దానం చెయ్యండి’’ అని దీనంగా అడిగేవాడు. కొందరు పొమ్మనేవారు. మరికొందరు ‘‘అడుక్కుతినే బదులు ఏదైనా పని చేసి బతకవచ్చు కదా!’’ అనేవారు. ఇంకొందరు గొణుక్కుంటూ పిడికెడు అన్నం, మునుపటి రాత్రి మిగిలిన పప్పు, కూర లాంటివి తెచ్చి అతని పాత్రలో పడేసేవారు. అతడు వాటిని తీసుకొని ఊరుబయట ఉన్న ఒక చెట్టు దగ్గరకు వెళ్ళేవాడు. భిక్ష ద్వారా తెచ్చుకున్నది తిని, నీరు తాగి, ఆ చెట్టు కిందనే నిద్రపోయేవాడు.
ఇలా ఒక రోజు, రెండు రోజులు కాదు... ఏకంగా నలభై సంవత్సరాలు జరిగింది. ఒక రోజు ఆ భిక్షగాడు అడుక్కుంటూ, అడుక్కుంటూ ఒక ఇంటిముందు కూలబడి ప్రాణాలు వదిలాడు. ఊళ్ళోని జనం అందరూ వచ్చారు. అతను చనిపోయాడని గ్రహించారు. ‘ఏం చేద్దాం?’ అని ఆలోచించారు. భిక్షగాడి మృతదేహాన్ని ... ఊరు చివర్లో ఎక్కడైతే అతను నలభయ్యేళ్ళపాటు ఏ చెట్టు కింద నిద్రపోయేవాడో... అక్కడే పూడ్చి పెడదామనే నిర్ణయానికి వచ్చారు. ఆ మృతదేహాన్ని అక్కడకు తీసుకువెళ్ళి, గొయ్యి తవ్వడం ప్రారంభించారు. కొంత లోతు తవ్వేసరికి... బంగారు ఆభరణాలు, రత్నాలతో నిండిన ఒక గంగాళం బయటపడింది. అందరూ ఆశ్చర్యపోయారు. ‘ఈ భిక్షగాడు ఎంత దురదృష్టవంతుడు! ఎంతటి మూర్ఖుడు! ఊరకే కాళ్ళు అరిగేలా ఊరంతా తిరిగి అడుక్కొనే బదులు ఒక రోజైనా ఇక్కడ గొయ్యి తవ్వే ప్రయత్నం చేసి ఉంటే... జీవితాంతం మహారాజులా బతికి ఉండేవాడు. అతని ఖర్మ అలా ఉంది. అడుక్కుతినే రాత ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుంది’ అనుకున్నారు. ఆ నిధిని బయకు తీశారు. భిక్షగాడి శవాన్ని అక్కడ పూడ్చిపెట్టారు. అతను జీవితమంతా సేకరించుకున్న చిరిగిపోయిన, చీలికలైన తుండు గుడ్డలను కూడా అందులో పడేశారు.
ఒక సందర్భంలో ఓషో ఈ కథ చెబుతూ... మన అందరి బతుకులు ఆ భిక్షగాడి జీవితంలాగానే ఉన్నాయన్నారు. మనం ‘జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్’ అని ప్రార్థిస్తూ ఉంటాం. జ్ఞానానందమయుడైన ఆ దైవం మనలోపలే ఉంటే... మనం బయటకు ఎక్కడికో పరుగులు తీస్తాం. ఏవేవే ఆశ్రమాలకు వెళ్తాం. అక్కడ గురువుల కాళ్ళకు, స్వామీజీల కాళ్ళకు మొక్కుతాం. జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుతాం. అయితే జ్ఞాన భాండాగారం, విశ్వజ్ఞాన గ్రంథాలయం మనలోపలే ఉందంటారు స్వామి వివేకానంద. మనం అంతర్ముఖులైనప్పుడే ఆ జ్ఞానానందాన్ని అందుకోగలం. ఎవరి కాళ్ళ మీద పడడంవల్లో, అర్థించడంవల్లో దాన్ని సాధించలేం. అది మనలోనే ఉందని తెలుసుకుంటేనే... దాన్ని పొందగలం.
రాచమడుగు శ్రీనివాసులు
ఈ వార్తలు కూడా చదవండి..
స్వదేశీ రక్షణ తయారీకి సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ ఊతం: మంత్రి నారాయణ
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు
జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
Read Latest International News And Telangana News And AP News And Telugu News