Share News

బొల్లి బలాదూర్‌

ABN , Publish Date - Jul 07 , 2026 | 01:46 AM

మనం ‘బొలి’్లకి భయపడినంతగా మరే ఇతర చర్మ సమస్యకూ భయపడం. శాశ్వతంగా ఒంటి మీద తిష్ట వేస్తుందనీ, వంశపారంపర్యమనీ, పూర్తిగా నయం చేసే చికిత్సలు లేవనీ...

బొల్లి బలాదూర్‌

విటిలిగో

మనం ‘బొలి’్లకి భయపడినంతగా మరే ఇతర చర్మ సమస్యకూ భయపడం. శాశ్వతంగా ఒంటి మీద తిష్ట వేస్తుందనీ, వంశపారంపర్యమనీ, పూర్తిగా నయం చేసే చికిత్సలు లేవనీ... ఇలా బొల్లి చుట్టూ నెలకొని ఉన్న అపోహలే మన భయాలకు కారణం. కానీ బొల్లిని బ్రహ్మాండంగా వదిలించుకోవచ్చని భరోసా ఇస్తున్నారు చర్మ వైద్యులు.

చర్మానికి రంగునిచ్చే మెలనిన్‌ గురించి అందరికీ తెలిసిందే! మెలనోసైట్స్‌ అనే కణాలు మెలనిన్‌ను తయారుచేస్తాయి. ఇవి పని చేయడం మానేసినా, అవి నశించినా చర్మం మీద తెల్లని మచ్చలు ఏర్పడతాయి. అదే బొల్లి. ఈ సమస్య తలెత్తడానికి పలు కారణాలున్నాయి. విటిలిగో, ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. రోగ నిరోధక వ్యవస్థ, చర్మంలోని రంగు కణాలైన మెలనోసైట్స్‌ మీదే దాడి చేసే పరిస్థితి ఇది. ఇందుకు కొంత మేరకు వంశపారంపర్యం కారణమే అయినప్పటికీ, తల్లితండ్రులకు ఉన్నంత మాత్రాన కచ్చితంగా పిల్లలకు సంక్రమించాలనే నియమమేమీ లేదు. మానసిక ఒత్తిడి, చర్మానికి గాయమవడం, ఇతరత్రా ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు కూడా బొల్లిని ప్రేరేపిస్తాయి.

బొల్లి ఇలా...

బొల్లిని ప్రారంభంలోనే కనిపెట్టడం కీలకం. చర్మం మీద తలెత్తే కొత్త లక్షణాలను గమనిస్తూ ఉండాలి. అవేంటంటే...

  • మునుపు కనిపించని తెల్ల మచ్చలు శరీరం మీద కనిపించినప్పుడు...

  • పరిమాణం, సంఖ్యాపరంగా కొత్త మచ్చలు వేగంగా పెరుగుతున్నప్పుడు....

  • మచ్చ ఉన్న ప్రాంతలో వెంట్రుకలు కూడా తెల్లబడుతున్నప్పుడు....

  • ఒకేసారి శరీరం మీద వేర్వేరు చోట్ల కొత్త మచ్చలు పుట్టుకొచ్చినప్పుడు....


బొల్లి... రెండు రకాలు

విటిలిగోలో ప్రధానంగా రెండు రకాలుంటాయి. అవేంటంటే...

లిప్‌ టిప్‌ విటిలిగో: పెదవులు, కాళ్లు, చేతుల వేళ్లు, జననాంగాల చివర్లలో మచ్చలతో మొదలై, శరీరమంతా వ్యాపిస్తుంది, లేదా అక్కడికే పరిమితమైపోతుంది.

లోకల్‌ విటిలిగో: శరీరం మీద అక్కడక్కడా నాలుగైదు మచ్చలు తలెత్తి, ఆ ప్రాంతాలకే పరిమితమై ఉండిపోతాయి.

సమర్థమైన చికిత్సలున్నాయి

సాధారణంగా 80 నుంచి 90ు మందిలో లోకల్‌ విటిలిగో ఉంటుంది. దీనికి ఎంత త్వరగా కనిపెట్టి, చికిత్స తీసుకోగలిగితే, అంత సులభంగా, త్వరగా నయం చేసుకోవచ్చు. రోగి వయసు, మచ్చల పరిమాణం, వ్యాధి దశ ఆధారంగా ఏ చికిత్సను ఎంచుకోవాలన్నది చర్మ వైద్యులే నిర్ణయిస్తారు. కొందరికి పైపూత మందులు సరిపోతాయి. ఇంకొందరికి ఫొటో థెరపీ అవసరమవుతుంది. కొందరికి ఎక్సైమర్‌ లేజర్‌ చికిత్స అవసరమవుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన సర్జరీలు కూడా అవసరమవుతాయి. తాజాగా జాక్‌ ఇన్హిబిటర్స్‌ కూడా అందుబాటులోకొచ్చాయి. ఇవెంతో సమర్థమైన ఫలితాన్ని అందిస్తున్నాయి. చికిత్సతో బొల్లి పూర్తిగా తగ్గుతుందా? అనే అనుమానం సర్వత్రా నెలకొని ఉంది. కానీ చికిత్స ఫలితం రోగులందర్లో ఒకేలా ఉండదు. సదరు వ్యక్తి చికిత్సకు స్పందించే తీరు, రోగ నిరోధక శక్తి, శరీర తత్వాల మీదే చికిత్స ఫలితం ఆధారపడి ఉంటుంది. చికిత్సతో కొందర్లో బొల్లి పూర్తిగా తొలగిపోతుంది. ఇంకొందర్లో గరిష్ఠంగా నయమైపోతుంది. మరికొందర్లో వ్యాధి అక్కడితో ఆగిపోయి, మరింత పెరగకుండా అదుపులోకొస్తుంది. ఏదేమైనప్పటికీ బొల్లి చికిత్స సోరియాసిస్‌ చికిత్సలాగే సుదీర్ఘంగా సాగుతుంది. కాబట్టి చికిత్సను మధ్యలో ఆపడం సరికాదు. అలాగే మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటూ, పోషకభరితమైన సమతులాహారం తీసుకుంటూ ఉండాలి. బొల్లికి కారణం ఆటో ఇమ్యూన్‌ వ్యాధి అని తేలితే, థైరాయిడ్‌ లాంటివి లేవని నిర్థారించుకోవాలి. అలాగే బొల్లి ఉన్న వాళ్ల చర్మం ఒరిపిడికి లోనైన చోట, కొత్తగా బొల్లి తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో బొల్లికి అనేక చిట్కాలు, సూచనలు ప్రచారంలో ఉన్నాయి. వీటి వల్ల పలు రకాల దుష్ప్రభావాలకు గురయ్యే ప్రమాదం ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ అపోహలే!


బొల్లి చుట్టూ అనేక అపోహలు నెలకొని ఉన్నాయి. బొల్లి వంశపారంపర్యమనే మూఢనమ్మకంతో, ఈ చర్మ సమస్య ఉన్న యువతీయువకులు పెళ్లి చేసుకోడానికి వెనకాడుతూ ఉంటారు. బొల్లిని అంటు వ్యాధిగా అపోహపడేవారూ లేకపోలేదు. నిజానికి బొల్లి కలిగిన వ్యక్తులతో కలిసి జీవించడం, కలిసి భోజనం చేయడం, తాకడం వల్ల అది ఇతరులకు సోకదు. అలాగే ఈ సమస్య వంశపారంపర్యం కాదు. తల్లితండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించదు. అలాగే చేపలు, పాలు కలిపి తినడం వల్ల బొల్లి వస్తుందనే అపోహ కూడా ప్రచారంలో ఉంది. ఇది ఏమాత్రం నిజం కాదు. బొల్లి ఉన్నంత మాత్రాన ప్రాణాలకు ఎటువంటి హాని ఉండదు. బొల్లిని సమూలంగా తొలగించే చికిత్స లేదని, వైద్యులను కలవకుండా అలాగే సర్దుకుపోతూ ఉంటారు. కానీ ఇది కూడా నిజం కాదు.

కేస్‌ స్టడీ

ఒక మహిళ యుక్త వయసులో బొల్లి చికిత్స కోసం నా దగ్గరకొచ్చింది. కొంత కాలం చికిత్స తర్వాత, అర్థాంతరంగా మానేసింది. అదే మహిళ చాలా సంవత్సరాల తర్వాత 50 ఏళ్ల వయసులో మళ్లీ చికిత్స కోసం నా దగ్గరకు రావడంతో నేనామెను ఆసక్తికొద్దీ ఆరా తీశాను. మధ్యలో చికిత్స ఆపేసి, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ చికిత్స తీసుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారని అడిగాను. అప్పుడామె... తన కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామనీ, తనకు బొల్లి ఉంది కాబట్టి కూతురికి సంబంధాలు కుదరవేమోననే భయంతో, వ్యాధిని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాననీ చెప్పింది. బొల్లి చుట్టూరా సర్వత్రా నెలకొని ఉన్న భయాలు, అపోహలకు ఇదొక ఉదాహరణ. అయితే ఆమెకిచ్చిన చికిత్స సత్ఫలితాన్నిచ్చి, బొల్లి పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత ఆమె కూతురి పెళ్లి కుదిరి, ఆ పెళ్లికి నన్ను ఆహ్వానించడం కూడా జరిగింది.

5-Navya.jpg


ఇది బొల్లి కాదు

కొందరికి ఒళ్లంతా తెల్లగా మారిపోయి, వెంట్రుకలన్నీ తెల్లబడిపోతాయి. ఇది బొల్లి కాదు. ఇదొక మెటబాలిక్‌ డిజార్డర్‌. కొన్ని రకాల జన్యు సమస్యల్లో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చర్మం మీద తెల్ల మచ్చలు తలెత్తుతున్నట్టు గ్రహించిన వెంటనే చర్మ వైద్యులను సంప్రతించి అవి ఏ కోవకు చెందిన మచ్చలో కనిపెట్టే ప్రయత్నం చేయాలి.

సన్‌స్క్రీన్ తప్పనిసరి

ఈ చర్మ సమస్యతో చర్మంలో మెలనోసైట్స్‌ నశిస్తాయి. కాబట్టి సూర్యరశ్మి నుంచి రక్షణ దక్కదు. ఎండ ప్రభావం నుంచి తప్పించుకోవడం కోసం బొల్లి ఉన్న ప్రతి ఒక్కరూ సన్‌స్ర్కీన్స్‌ తప్పనిసరిగా వాడుకోవాల్సి ఉంటుంది.

డాక్టర్‌ విజయ్‌ కుమార్‌ లింగాపురం

కన్సల్టెంట్‌ డెర్మటాలజిస్ట్‌,

రెనోవా హాస్పిటల్స్‌,

కొంపల్లి, హైదరాబాద్‌.

ఈ వార్తలు కూడా చదవండి...

మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 01:46 AM