Share News

సాధికారతకు మార్గదర్శి

ABN , Publish Date - Oct 14 , 2026 | 02:58 AM

పుట్టుకతోనే సంక్రమించిన వైకల్యం, ఆర్థిక సమస్యలు, అంతంతమాత్రమైన అవకాశాలు...

సాధికారతకు మార్గదర్శి

పుట్టుకతోనే సంక్రమించిన వైకల్యం, ఆర్థిక సమస్యలు, అంతంతమాత్రమైన అవకాశాలు...

ప్రతి అవరోధాన్నీ ఆత్మస్థైర్యంతో అధిగమించారు సరబ్జీత్‌ కౌర్‌. అంతేకాదు... మూడువేల మందికి పైగా మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు మార్గదర్శి అయ్యారు. ఏ వైకల్యమూ దృఢ సంకల్పాన్ని ఓడించలేదని నిరూపించిన పంజాబ్‌ గ్రామీణ మహిళ కథ ఇది.

‘‘స్వయంసమృద్ధి సాధించడానికి ఎల్లప్పుడూ విస్తృతమైన వనరులే అవసరం లేదు... చిన్న చిన్న అడుగులు, కలిసికట్టుగా చేసే ప్రయత్నాలు గొప్ప మార్పుని సృష్టిస్తాయి’’ అంటారు సరబ్జీత్‌ కౌర్‌. పంజాబ్‌లోని బఠిండా జిల్లా సీఖూ అనే చిన్న గ్రామం కేంద్రంగా ఆమె ప్రారంభించిన ప్రయాణం ఎంతోమంది మహిళల జీవితాలకు కొత్త దారి చూపించింది. ‘‘నేను ఏదో అద్భుతం చేశానని చాలామంది అంటూ ఉంటారు. ‘నా కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టుకోవాలి, నా బిడ్డను బాగా చదివించుకోవాలి’ అనే ఆరాటమే నాకు చోదక శక్తి. అంతకుమించిన ప్రత్యేకతలేవీ నాలో లేవు’’ అని చెబుతారామె.

ఆ ఆలోచన వెంటాడేది...

పోలియో కారణంగా పుట్టుకతో సంక్రమించిన వైకల్యం సరబ్జీత్‌కు జీవితంలో ఎదురైన తొలి సవాలు. ‘‘అందరిలా నడవలేను. తోటి పిల్లల్లా పరుగులెడుతూ ఆటలు ఆడలేను. ఆర్థికంగానూ మాది బాగా వెనుకబడిన కుటుంబం. ఈ వాస్తవాలు నన్ను కొన్నిసార్లు బాధపెట్టాయేమో కానీ... ఎప్పుడూ భయపెట్టలేదు. నా దృష్టిని పూర్తిగా చదువు మీదే పెట్టాను’’ అని చెప్పిన సరబ్జీత్‌... ఇంటర్‌ వరకూ చదివారు. ఉద్యోగం చేసి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేది ఆమె లక్ష్యం. కానీ ఆ ప్రాంతంలో పెద్దగా అవకాశాలు లేవు. వేరే చోటుకు వెళ్ళి ఉద్యోగం చెయ్యడానికి వైకల్యం అడ్డొచ్చింది. ఇంట్లోనే కుట్లు, అల్లికలు లాంటివి చేసేవారు.. కొన్నాళ్ళకు పెళ్ళయింది. ఒక అబ్బాయి పుట్టాడు. అతను పెరుగుతున్న కొద్దీ... భవిష్యత్తు గురించి ఆమెకు ఆందోళన ఎక్కువయింది. ఇంట్లో చిన్న చిన్న ఖర్చులకు కూడా ఇబ్బందిగా ఉండేది. ‘‘టైలరింగ్‌ ద్వారా నేను సంపాదించిన డబ్బు వేణ్ణీళ్ళకు చన్నీళ్ళలా ఉన్నా... పెద్ద ఖర్చు ఏదైనా వస్తే ఎంతో సతమతమయ్యేవాళ్ళం. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఏం చెయ్యాలనే ఆలోచన నన్ను అనుక్షణం వెంటాడేది. ఆ సమయంలో ‘హెచ్‌పిసిఎల్‌- మిట్టల్‌ ఎనర్జీ లిమిటెడ్‌’ (హెచ్‌ఎంఈల్‌) చేపట్టిన ఒక కార్యక్రమం నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది’’ అని గుర్తుచేసుకున్నారు సరబ్జీత్‌.


4-navya.jpg

22 గ్రామాలు... 3 వేల మంది

బఠిండా ప్రాంతంలో స్వయం సహాయక మహిళా గ్రూపులు (ఎస్‌హెచ్‌జి) ఏర్పాటు చేయాలని హెచ్‌ఎంఈల్‌ నిశ్చయించింది. ఆ క్రమంలో సీఖూలో ‘శ్రీ గురు రవిదాస్‌’ పేరిట ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. సరబ్జీత్‌ విద్యార్హతలను గుర్తించి... కమ్యూనిటీ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. ఒక ట్రైసైకిల్‌ కూడా సమకూర్చారు. ‘‘గ్రామంలో ఇంటింటికీ వెళ్ళి మహిళలతో మాట్లాడడం, బృందాల్లో వారిని చేర్పించి, స్వయం ఉపాధి మార్గాలపై అవగాహన కల్పించడం... ఇదీ నా పని. 2017లో మా గ్రూప్‌ మొదలయింది. టైలరింగ్‌ ద్వారా మా బృందంలోని మహిళలకు ఆదాయం బాగుండడంతో... మరింతమంది మహిళలు ముందుకు వచ్చారు. వారందరికీ శిక్షణ, ఉపాధి కోసం మా కార్యకలాపాలను విస్తరించాం’’ అని చెప్పారు సరబ్జీత్‌. ఈ తొమ్మిదేళ్ళ కాలంలో... ఆమె సేవలు 22 గ్రామాలకు విస్తరించాయి. మూడువేల మందికి పైగా మహిళలు ఆమె మార్గదర్శకత్వంలో ఎస్‌హెచ్‌జిలు ఏర్పాటు చేసి... వివిధ వృత్తుల ద్వారా స్వయంసమృద్ధి సాధించారు. ‘‘వైకల్యాన్ని నేను ఎప్పుడూ సమస్యగా చూడలేదు. నాకు అందుబాటులోకి వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నాను. ఇప్పుడు నా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. మా అబ్బాయి ఉన్నత విద్య చదువుతున్నాడు’’ అని చెబుతున్నారామె.

నేనే ఉదాహరణ

ఇప్పుడు సరబ్జీత్‌ పర్యవేక్షణలో పన్నెండు ఉత్పత్తి యూనిట్లు నడుస్తున్నాయి. టైలరింగ్‌తో పాటు పశువుల దాణా తయారీ, బేకరీ, శానిటరీ ప్యాడ్స్‌ తయారీ... ఇలా వివిధ అంశాల్లో శిక్షణ పొందిన మహిళలు నెలకు పదిహేను వేలకు పైగా సంపాదిస్తున్నారు. ‘‘ఇప్పడు ప్రతిరోజూ నాలుగు నుంచి అయిదు సమావేశాలను నిర్వహిస్తున్నాను. చాలామంది మహిళల్లో తాము ఏదీ చెయ్యలేమనే ఆత్మన్యూనతా భావం ఉంటుంది. వారు పెరిగిన వాతావరణం, కుటుంబాల్లో పురుషాధిక్యత దీనికి ప్రధాన కారణాలు. తగిన అవకాశాలను కల్పిస్తే... ఎన్నడూ ఊహించని విజయాలను వారు సాధించగలరు. దానికి నేనే ఉదాహరణ అని వారికి చెబుతున్నాను’’ అంటున్న సరబ్జీత్‌... గట్టి సంకల్పం ఉంటే... మనిషి పురోగతిని ఏదీ ఆపలేదని నిరూపించారు.

ఇవి కూడా చదవండి...

.స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై ఎస్‌ఈసీ ఏం చెప్పారంటే

గన్నవరం ఎయిర్‌పోర్టుకు తమిళనాడు సీఎం విజయ్.. ఘన స్వాగతం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 02:58 AM