టెన్నిస్ కోర్టులో మాయాజాలం
ABN , Publish Date - Oct 14 , 2026 | 03:12 AM
భారత టెన్నిస్ యవనికపై సరికొత్త శకం మొదలైంది. పోర్చుగల్‌లోని లాగోస్ వేదికగా జరిగిన డబ్ల్యూ35 టోర్నమెంట్‌లో అద్భుత విజయం సాధించిన 17 ఏళ్ల మాయా రాజేశ్వరన్ రేవతి...
భారత టెన్నిస్ యవనికపై సరికొత్త శకం మొదలైంది. పోర్చుగల్‌లోని లాగోస్ వేదికగా జరిగిన డబ్ల్యూ35 టోర్నమెంట్‌లో అద్భుత విజయం సాధించిన 17 ఏళ్ల మాయా రాజేశ్వరన్ రేవతి... రెండు దశాబ్దాల క్రితం భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా నెలకొల్పిన రికార్డును తిరిగరాసింది. ఆట తీరుతోనే కాకుండా తన అంకితభావంతో దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదుగుతున్న ఈ యువకెరటం ప్రయాణం వెనుక ఎన్నో అసాధారణ నిజాలు దాగి ఉన్నాయి. అవి ఆమె మాటల్లోనే...
‘‘నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటే.. తమిళనాడు కోయంబత్తూరులోని ఓ సాధారణ వాతావరణం నుంచి నేడు ప్రపంచ టెన్నిస్ కోర్టుల వరకు సాగిన ప్రయాణం ఒక అద్భుతంలా అనిపిస్తుంది. మా నాన్న రాజేశ్వరన్ నన్ను ఎనిమిదేళ్ల వయసులో శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ కోసం టెన్నిస్ రాకెట్ పట్టించారు. ఆ రోజుల్లో సరదాగా ఆడిన ఆట నా జీవిత గమ్యాన్ని పూర్తిగా మార్చేస్తుందని ఊహించలేకపోయాను. కోర్టులో నేను చూపే ప్రతిభను గుర్తించిన మా కుటుంబం నాకు మద్దతుగా నిలిచింది. పదేళ్ల వయసు వచ్చేసరికి ఈ క్రీడనే నా సర్వస్వంగా భావించి ప్రొఫెషనల్ బాట పట్టాలని దృఢంగా నిర్ణయించుకున్నాను. చదువును, ఆటను సమన్వయం చేయడం కష్టంగా మారడంతో రెండేళ్లకే రెగ్యులర్ స్కూల్‌కు స్వస్తిచెప్పి, పూర్తిగా హోంస్కూలింగ్‌పై దృష్టిపెట్టాను. ఆటపై మరింత ఏకాగ్రత కుదిరేందుకు ఈ నిర్ణయం నా కెరీర్‌కు ఒక మైలురాయిగా నిలిచింది.
పట్టుదలతో విజయాల బాట
కోయంబత్తూరులోని ప్రొసర్వ్ టెన్సిస్ అకాడమీలో నా ప్రయాణం ఊపందుకుంది. ఐటీఎఫ్ జూనియర్ టోర్నీలలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాను. చెన్నై ఓపెన్, హైదరాబాద్ ఓపెన్, మలేషియా ఓపెన్‌లలో విజయాలు సాధించడం నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఆ తర్వాత జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో జరిగిన అంతర్జాతీయ టోర్నీల్లోనూ సత్తా చాటుతూ నా కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాను. కోర్టులో దూకుడుగా ఆడటం, శక్తిమంతమైన ఫోర్‌హ్యాండ్‌లను సంధించడం, పదునైన సర్వీసులతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేయడం నా శైలిగా మార్చుకున్నాను. జూనియర్ గ్రాండ్ స్లామ్‌లైన ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లలో అడుగుపెట్టి నా అనుభవాన్ని మరింత పెంచుకున్నాను. ఈ క్రమంలో డబుల్స్ విభాగంలోనూ సత్తా చాటుతూ గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్స్ వరకు వెళ్లడం నా మానసిక స్థైర్యాన్ని బాగా పెంచింది.
దిగ్గజాల నీడలో మెరుగైన శిక్షణ
ముంబైలో జరిగిన డబ్ల్యూటీఏ 125 టోర్నమెంట్ నా కెరీర్‌లో అత్యంత కీలకమైన మలుపు. అన్‌ర్యాంక్‌డ్ వైల్డ్‌కార్డ్ క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన నేను.. ఇర్యానా షిమనోవిచ్, జరీనా డియాస్, మేయ్ యమగూచి వంటి అగ్రశ్రేణి క్రీడాకారిణులను సైతం ఓడించి సెమీఫైనల్ వరకు దూసుకెళ్లాను. ఆ టోర్నమెంట్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన నన్ను.. స్పెయిన్‌లోని ప్రసిద్ధ రఫెల్ నాదల్ అకాడమీ పిలిచి మరీ శిక్షణ ఇచ్చింది. అక్కడ ప్రపంచస్థాయి మౌలిక వసతుల నడుమ కఠినమైన శిక్షణ పొంది మానసికంగా, శారీరకంగా నన్ను నేను సిద్ధం చేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రాన్స్‌లోని ఎలైట్ టెన్నిస్ సెంటర్‌కు మారి నా టెక్నిక్‌ను మరింత మెరుగుపరుచుకున్నాను. నిపుణులైన కోచ్‌ల పర్యవేక్షణలో నా సర్వీసులు, గ్రౌండ్‌స్ట్రోక్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది.
లాగోస్‌లో రికార్డు
తాజాగా పోర్చుగల్‌లోని లాగోస్‌లో జరిగిన డబ్ల్యూ35 టోర్నమెంట్ నా జీవితంలో మరిచిపోలేని మైలురాయి. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం క్వాలిఫయర్ హోదాలో బరిలోకి దిగి, ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతమైన ఏకాగ్రత ప్రదర్శించాను. ముఖ్యంగా జస్టినాతో మ్యాచ్‌లో తొలి సెట్‌లో 0-5తో బాగా వెనుకబడిపోయాను. కేవలం 25 నిమిషాల్లో సెట్ చేజారకూడదనే ఏకైక ఆలోచనతో ప్రశాంతంగా ఆడుతూ రీబ్యాక్ సాధించాను. ఇక ఫైనల్ మ్యాచ్ పాయింట్ సమయంలో ఒత్తిడి నాపై పడకుండా ఉండేందుకు మనసులోనే ఓ పాట పాడుకుంటూ ఆడాను. ఫైనల్ పోరులో స్పెయిన్ క్రీడాకారిణి సెలీనా సెర్వినోపై 6-4, 6-2తో వరుస సెట్లలో విజయం సాధించి నా తొలి ప్రొఫెషనల్ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాను. ఇదే టోర్నీలో ఉక్రెయిన్ ప్లేయర్ యెల్జా వెటో కోట్లియార్‌తో కలిసి డబుల్స్ టైటిల్‌ను కూడా ముద్దాడి డబుల్ ధమకా సాధించాను. సరిగ్గా 17 ఏళ్ల 3 నెలల వయసులో ఈ ఘనత సాధించడం ద్వారా.. 2004లో హైదరాబాద్ ఓపెన్‌లో సానియా మీర్జా నెలకొల్పిన 17 ఏళ్ల 10 నెలల రికార్డును నేను అధిగమించాను’’.
సానియానే స్ఫూర్తి
ఎవరో నన్ను సానియాతో పోలుస్తుంటారు. కానీ ఆమె సాధించిన ఘనతలు, ఆమె దేశానికి తెచ్చిపెట్టిన కీర్తి అనన్యసామాన్యం. సానియా ఎప్పటికీ ఒక దిగ్గజమే. నాకు శాశ్వత ఆరాధ్యురాలే. చిన్నతనంలో ఆమెను చూసే నేను రాకెట్ చేతబట్టాను. ఇప్పటికీ ఆమె ఇంటర్వ్యూలు, పాడ్‌కా్‌స్టలు వింటూ ఎంతో నేర్చుకుంటున్నాను. నేడు ఆమె రికార్డును దాటడం సంతోషంగా ఉన్నప్పటికీ, ఆమె స్థాయిని అందుకోవడం సులభం కాదు. ప్రస్తుతం జూనియర్ సర్క్యూట్‌లో 16వ ర్యాంకులో ఉన్న నేను.. రాబోయే రోజుల్లో ప్రపంచ టాప్-10 ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించడమే లక్ష్యంగా శ్రమిస్తున్నాను. దేహదారుఢ్యాన్ని మరింత పెంచుకుంటూ, గాయాలపాటు కాకుండా కెరీర్‌ను సుదీర్ఘంగా కొనసాగించడమే నా ప్రణాళిక. మైదానంలో ఫలితాల గురించి అతిగా ఆలోచించకుండా ఆటను పూర్తిగా ఆస్వాదిస్తూ భారత్ తరఫున అంతర్జాతీయంగా మరిన్ని విజయాలు సాధించడమే నా ముందున్న ఏకైక లక్ష్యం.
ఇవి కూడా చదవండి...
.స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై ఎస్‌ఈసీ ఏం చెప్పారంటే
గన్నవరం ఎయిర్‌పోర్టుకు తమిళనాడు సీఎం విజయ్.. ఘన స్వాగతం
Read Latest AP News And Telugu News