మహిళల అస్థిత్వానికి ప్రతీకే ‘లాపతా లేడీస్’!
ABN , Publish Date - May 11 , 2026 | 05:20 AM
‘కళకు పరిమితులు ఉండవు’ అనడానికి ఆషిమా మెహ్రోత్రా వేసే పెయింటింగ్స్ నిదర్శనం. మన సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల దగ్గర నుంచి, మన పురాతన వారసత్వ...
‘కళకు పరిమితులు ఉండవు’ అనడానికి ఆషిమా మెహ్రోత్రా వేసే పెయింటింగ్స్ నిదర్శనం. మన సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల దగ్గర నుంచి, మన పురాతన వారసత్వ సంస్కృతి సంప్రదాయాల దాకా అనేక అంశాలపై ఆమె వేసిన పెయింటింగ్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ‘ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్’ (ఐఆర్‌టీఎస్) ఉన్నతాధికారి అయిన ఆషిమా ఒక వైపు తన వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తునే.. మరో వైపు తన కళను సమాజహితానికి ఉపయోగించాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా‘లాపతా లేడీస్’ పెయింటింగ్‌ను 64వ ‘నేషనల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఆర్ట్’లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆమెను ‘నవ్య’ పలకరించింది.
మీ పెయింటింగ్స్‌కు స్ఫూర్తి ఎవరు?
పెయింటింగ్ ఒక సృజనాత్మక ప్రక్రియ మాత్రమే కాదు. మన ఉనికిని ఆస్వాదించే మార్గం కూడా! విశ్వ శక్తి, జీవరాశుల మధ్య నెలకొని ఉన్న పరస్పర సంబంధం నుంచి కలిగే ప్రేరణే నా పెయింటింగ్స్! ఒకప్పుడు ఆకాశంలో కనిపించే రకరకాల ఆకృతులు ఒక స్పూర్తి. కాలంతో పాటుగా నేను పరిణతి చెందాను. నా పెయింటింగ్స్ వ్యక్తిగత వ్యక్తీకరణ స్థాయి నుంచి తాత్విక అన్వేషణగా పరిణామం చెందాయి. ఈ దశలో కళకు, కళాకారిణికి మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోతాయి. పెయింటింగ్ ప్రక్రియ ధ్యానంగా మారిపోతుంది.
‘నేషనల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఆర్ట్’లో పెయింటింగ్స్‌ను ప్రదర్శించిన మొట్టమొదటి రైల్వే అధికారి మీరు. మీ వృత్తిని, అభిరుచిని ఎలా సమన్వయం చేసుకోగలుగుతున్నారు?
అడ్మినిస్ట్రేటివ్ పాత్రనూ, లోతైన కళాత్మక సాధననూ సమన్వయం చేసుకోవడం కచ్చితంగా ఒక సవాలే! కానీ అది అసాధ్యం మాత్రం కాదు. దానికి క్రమశిక్షణ, లక్ష్యం పట్ల స్పష్టత, మానసిక నిబద్ధత అవసరం. నేను పనిచేసే రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో వారంలో ఏడు రోజులు అనుక్షణం అప్రమత్తంగానే ఉండాలి. కొన్నిసార్లు పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. సమయ పాలన, అవసరమైన పనులలో మాత్రమే శక్తిని వినియోగించడం లాంటి మెళకువలు నేర్చుకున్నా. దీనివల్ల నా వృత్తితో పాటుగా నా అభిరుచిని కూడా ఆస్వాదించగలుగుతున్నా. నేను రైల్వే శాఖలో పురాతన సంస్కృతి పరరక్షణ (హెరిటేజ్ కన్జర్వేషన్) విభాగానికి అధిపతిని. మన దేశంలో అనేక ప్రాంతాల్లో హెరిటేజ్ రైళ్లను మా విభాగమే నడుపుతుంది. సాంస్కృతిక పరిరక్షణ అనేది నా మనసుకు చాలా దగ్గరగా ఉన్న అంశం. ఇక వృత్తి కచ్చితత్వాన్ని నేర్పిస్తే... కళ ఆత్మ పరిశీలనకు తోడ్పడుతోంది. ఇవి రెండు ఒక దానికి మరొకటి ప్రత్యామ్నాయాలుగా కాకుండా ఒకటిగా మారిపోయాయి. దీని వల్ల నా పని సులువుఅవుతోంది.
సమకాలీన భారతీయ చిత్రకళా రంగంపై మీ అభిప్రాయమేమిటి?
భారతీయ చిత్రకళారంగం అనగానే- ‘వైవిధ్యం’ అనే పదం గుర్తుకొస్తుంది. సంప్రదాయ రూపాల నుంచి అబ్‌స్ట్రాక్ట్, మిక్స్‌డ్ మీడియా, కాన్సెప్షువల్ ఆర్ట్‌కు మన కళారంగం పరిణతి చెందింది. నేటి కళాకారులు స్వదేశీ మూలాలను కలిగి ఉంటూనే... ప్రపంచంలోని అనేక అంశాలను స్పృశించగలుగుతున్నారు. అస్థిత్వం, లింగ వివక్ష, పర్యావరణం మొదలైన విషయాలను అన్వేషిస్తున్నారు. విజువల్ ఆర్ట్, ఇన్‌స్టాలేషన్, పర్ఫార్మెన్స్, డిజిటల్ మీడియా లాంటి విభిన్న విభాగాల మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేస్తున్నారు. భారతీయ తాత్విక చింతన, సౌందర్య శాస్త్రం పట్ల ఆదరణ కూడా పెరుగుతోంది.
మీ పెయింటింగ్స్‌లో ‘లాపతా లేడీస్’కు అనేక ప్రశంసలు లభించాయి కదా..
సామాజిక, సాంస్కృతిక సందర్భాల్లో మహిళల అదృశ్యం, గుర్తింపు, అగోచరత్వాల గురించిన నేను చేసిన అన్వేషణే- లాపతా లేడీస్ (అదృశ్యమయిన మహిళలు). ఈ శీర్షికే ఒక వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. మహిళలు భౌతికంగా మన మధ్య ఉన్నప్పటికీ సామాజికంగా.. మానసికంగా తప్పిపోయిన స్థితిలో ఉండే స్థితే లాపతా! మహిళలకు సంబంధించి వినిపించని కథలను వినిపించడం, అస్థిత్వాలను కనుమరుగు చేసే సామాజిక నిర్మాణాలను ప్రశ్నించడం, లోటును ఉనికిగా మార్చే ఒక వేదికను సృష్టించడం, భావోద్వేగ స్పందనను ప్రేరేపించడం ‘లాపతా లేడీస్’ ముఖ్యోద్దేశం.
భారతీయ చిత్రకళా రంగంలో మహిళల పాత్ర?
నా ఉద్దేశంలో మహిళలు చిత్రకళారంగాన్ని పునర్‌నిర్వచిస్తున్నారు. వారు ఈ మధ్యకాలంలో ఆవిష్కర్తలుగా కూడా మారారు. ఎన్‌కాస్టిక్ ఆర్ట్, ఇన్‌స్టలేషన్స్, డిజిటల్ మీడియాతో ప్రయోగాలు చేస్తున్నారు.
మీ పెయింటింగ్స్‌లో కొన్నింటిని రైల్వే మ్యూజియంలో, జోనల్ రైల్వే కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు కదా! అలాంటి ప్రదేశాలలో మీ పెయింటింగ్స్ ఎలా ఇమిడిపోతాయి?
ఇది సంప్రదాల గ్యాలరీలు కావు. కానీ వీటిని ప్రజలు ప్రతి రోజూ సందర్శిస్తూ ఉంటారు. కొందరు వాటిని చూసి స్ఫూర్తి పొందే అవకాశమూ ఉంటుంది. ఏ కళ ఉద్దేశమైనా- ప్రజలకు చేరువ కావడమే! అనేక రకాల ఒత్తిళ్లతో ఉన్న వారు ఈ పెయింటింగ్స్‌ను చూస్తే- ఒక క్షణం ఆగి ఆలోచించవచ్చు కదా! అందుకే అక్కడ ప్రదర్శనకు పెట్టాం!
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
‘‘మన దేశంలో హెరిటేజ్ రైళ్ల ఉద్దేశం ప్రయాణికుల రవాణా కాదు. అవి కదులుతున్న చారిత్రక, సాంస్కృతిక, ఇంజనీరింగ్ వారసత్వ మ్యూజియాలు. ఆహ్లాదకరమైన మార్గాల్లో ప్రయాణించే ఆ రైళ్లు వినూత్నమైన అనుభవాలను అందిస్తాయి. వీటికి ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది..’’
ఈ వార్తలు కూడా చదవండి...
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News