అమ్మతనానికి పట్టాభిషేకం
ABN , Publish Date - Nov 26 , 2026 | 05:59 AM
అందాల పోటీలంటే కేవలం గ్లామర్, ర్యాంప్‌వాక్, బాహ్య సౌందర్యం మాత్రమే కాదు.. బాధ్యత, ఆత్మవిశ్వాసం, సామాజిక స్పృహ కూడా అని నిరూపించారు జెన్నిఫర్ బారెటో...
అందాల పోటీలంటే కేవలం గ్లామర్, ర్యాంప్‌వాక్, బాహ్య సౌందర్యం మాత్రమే కాదు.. బాధ్యత, ఆత్మవిశ్వాసం, సామాజిక స్పృహ కూడా అని నిరూపించారు జెన్నిఫర్ బారెటో. ఏడేళ్ల చిన్నారికి తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ప్రపంచవ్యాప్తంగా 116 దేశాల అందగత్తెలను వెనక్కినెట్టి 2026 ‘మిస్ యూనివర్స్’ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్న మొట్టమొదటి తల్లిగా, వివాహితగా సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ ప్యూర్టోరికో ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవిత ప్రయాణం ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిదాయకం.
జెన్నిఫర్ బారెటో అసలు పేరు జెన్నిఫర్ అబ్రూమోరా. డిసెంబర్ 17, 1998న పూర్టోరికో లోని మాయాగ్వెజ్‌లో జెఫ్రీ అబ్రూ వాజ్క్వెజ్, అలీసియా మోరా గోంజాలెజ్ దంపతులకు జన్మించారు. ప్యూర్టోరికో లోని అందమైన తీరప్రాంత పట్టణమైన ఇసబెలాలో ఆమె బాల్యం గడిచింది. ముఖ్యంగా ఆమె పెంపకంలో తాతయ్య అత్యంత కీలకపాత్ర పోషించారు. ఆయన చెప్పిన జీవితపాఠాలు, కుటుంబ విలువలే తనను ఈ స్థాయికి చేర్చాయని జెన్నిఫర్ ఎప్పుడూ గుర్తుచేసుకుంటారు. ఇసబెలాతోపాటు సమీపంలోని శాన్‌సెబాస్టియన్, అగ్విడాల్లా పట్టణాల్లో ఆమె పాఠశాల విద్యాభ్యాసం సాగింది. 5 అడుగుల 11 అంగులాల పొడవుండే జెన్నిఫర్‌కు చిన్నప్పటి నుంచే ఆటలంటే ప్రాణం. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి హైస్కూల్ వరకు ఆమె చురుకైన వాలీబాల్ క్రీడాకారిణిగా రాణించింది. మరోవైపు, చిన్నతనంలో తన తల్లి అలీసియాతో కలిసి టీవీలో మిస్ యూనివర్స్ పోటీలను ఆసక్తిగా చూస్తూ పెరిగిన ఆమె.. అప్పుడే తన మనసులో ఆ విశ్వసుందరి కిరీటంపై అంతులేని ఆశలు పెంచుకుంది.
ప్రేమ... పెళ్లి... మాతృత్వపు మధురిమలు
వ్యక్తిగత జీవితంలో జెన్నిఫర్ ఒక నిండైన గృహిణి.. బాధ్యతాయుతమైన తల్లి. తన సొంత పట్టణం ఇసబెలాకే చెందిన యాన్ కార్లోస్ బారెటో కాల్డెరాన్‌తో ఆమె వివాహం జరిగింది. యాన్ కార్లోస్ అమెరికా ఆర్మీలోని ప్రతిష్ఠాత్మక 101వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌లో సార్జెంట్‌గా, లాజెస్టికల్ సపోర్ట్ విభాగంలో దేశానికి సేవలు అందిస్తున్నారు. సైనిక కుటుంబం కావడంతో ఎన్నో సవాళ్లు, బదిలీలు ఉన్నప్పటికీ భర్త ప్రోత్సాహంతో జెన్నిఫర్ తన కలను సాకారం చేసుకున్నారు. ఈ దంపతులకు 2019లో ‘పెనెలోప్’ అనే కుమార్తె జన్మించింది. తల్లి అయిన తర్వాత తన ఆలోచనా విధానం, జీవిత దృక్పథం పూర్తిగా మారిపోయాయని జెన్నిఫర్ చెబుతుంటారు. మాతృత్వం తనకు అపారమైన సహనాన్ని, ప్రేమను నేర్పిందని, సమాజంలోని మహిళలు, తల్లుల మానసిక ఆరోగ్యంపై తనకు మరింత అవగాహన, బాధ్యత పెరిగాయని ఆమె తరచూ చెబుతుంటారు.
సేవే పరమావధిగా...
జెన్నిఫర్ కేవలం ఒక అందగత్తె మాత్రమే కాదు, అత్యున్నత విద్యావంతురాలు, సామాజిక కార్యకర్త కూడా. రీసెర్చ్ సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. ఆ తర్వాత సైకాలజీ, క్లినికల్ సోషల్ వర్క్ విభాగంలో రెండు మాస్టర్స్ డిగ్రీలు సాధించారు. చదువుకున్న విద్య సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో 2021లో టెక్సా్‌సలోని ఫోర్డ్‌హుడ్‌లో అమెరికా రక్షణశాఖ పరిధిలో ఆమె తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఫ్యామిలీ అడ్వకసీ ప్రోగ్రాం కింద ఎడ్యుకేటర్‌గా, క్రైసిస్ కో రెస్పాండర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గృహ హింస, పిల్లల వేధింపులకు గురైన సైనిక కుటుంబాలకు మానసిక ధైర్యాన్నిస్తూ అండగా నిలిచారు. ట్రామా ఇంటర్వెన్షన్, ఆత్మహత్యల నివారణ, పిల్లల సంరక్షణ వంటి సున్నితమైన అంశాలలో ఆమెకు ప్రత్యేక శిక్షణ ఉంది. ఆ తర్వాత ప్రివెన్షన్ స్పెషలిస్టుగా పదోన్నతి పొంది, సైనిక వర్గాలలో ప్రమాదకర ప్రవర్తనలను నివారించే ప్రణాళికలు రూపొందించారు. ఉద్యోగంతోపాటు టెక్సా్‌సలోని కార్ల్ ఆర్.డార్నాల్ ఆర్మీ మెడికల్ సెంటర్‌లో, ప్యూర్టోరికోలోని ‘పీడియాట్రిక్ డయాబెటిస్ అసోసియేషన్’లో వాలంటరీగా సేవలందిస్తూ తన సేవాభావాన్ని చాటుకున్నారు.

32 కిలోలు తగ్గి...
నిజానికి 2025 వేసవి వరకు జెన్నిఫర్‌కు మోడలింగ్ లేదా అందాల పోటీల ర్యాంప్‌వాక్‌లో కనీస అనుభవం కూడా లేదు. అయితే, వివాహితులు, తల్లులు కూడా పోటీల్లో పాల్గొనవచ్చని మిస్ యూనివర్స్ సంస్థ 2023లో ప్రకటించడం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. చిన్ననాటి కలలను నిజం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని భావించిన ఆమె ఎంతో పట్టుదలతో శ్రమించారు. పోటీల కోసం సిద్ధమయ్యే క్రమంలో కఠినమైన ఆహార నియమాలు, వ్యాయామాలతో దాదాపు 32 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. తనలోని ఆత్మవిశ్వాసంతో ఈ ఏడాది జూన్ 25న శాన్ సెబాస్టియన్ మునిసిపాలిటీ తరఫున పోటీపడి ‘మిస్ యూనివర్స్ ప్యూర్టోరికో 2026’ టైటిల్ గెలుచుకున్నారు. ఆ పోటీల్లో ఉత్తమ క్యాట్‌వాక్, ఉత్తమ చిరునవ్వు వంటి ప్రధాన అవార్డులను సైతం కైవసం చేసుకుని సత్తాచాటారు.
చరిత్ర సృష్టించిన సమాధానం
నవంబర్ 24న పూర్టోరికోలోని శాన్‌జువాన్‌లో జరిగిన 75వ మిస్ యూనివర్స్ వేదికపై 27 ఏళ్ల జెన్నిఫర్ తన అద్భుతమైన వ్యక్తిత్వంతో మెరిశారు. సొంతగడ్డపై వేలాదిమంది అభిమానుల కేరింతల మధ్య ఆమె అడుగులు వేశారు. తుది రౌండ్‌లో ‘నేటి నాయకుల నుంచి ప్రపంచానికి ఏమి అవసరం?’ అన్న ప్రశ్నకు ‘‘తమ విలువలకు కట్టుబడి ఉండి, ప్రజల మాట వింటూ ఇతరుల పట్ల సానుభూతి చూపే నాయకులు నేడు ప్రపంచానికి కావాలి’’ అని ఆమె ఇచ్చిన స్పష్టమైన, హృదయాన్ని హత్తుకునే సమాధానం న్యాయనిర్ణేతల మనసులు గెలుచుకుంది. 2025 విజేత మెక్సికో సుందరి ఫాతిమా బాష్ చేతుల మీదుగా కిరీటాన్ని అందుకుని.. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్యూర్టోరికోకు ఆరోసారి మిస్ యూనివర్స్ టైటిల్ అందించారు. అంతేకాకుండా, సొంతదేశంలోనే ఈ కిరీటం గెలుచుకున్న రెండో ప్యూర్టోరికో విజేతగా నిలిచారు. ఈ పోటీల్లో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నునెజ్ మొదటి రన్నర్‌పగా, వెనిజువెలా భామ క్లారా వేగాస్ రెండో రన్నర్‌పగా నిలిచారు. భారత్ తరఫున పోటీపడిన కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మెజో టాప్-30లో చోటు దక్కించుకున్నారు. మాతృత్వం అనేది మహిళల కలలకు, వృత్తిపరమైన లక్ష్యాలకు ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించిన జెన్నిఫర్ తన ‘యాంప్లిఫయింగ్’ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మహిళల మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్