శాంతి... డ్రోనాచార్య
ABN , Publish Date - May 11 , 2026 | 05:16 AM
ఒకప్పుడు ప్రతి పైసా కోసం కష్టపడిన ఆమె ఇప్పుడు... సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. డ్రోన్ పైలట్‌గా మారి కలను సాకారం చేసుకోవడమే కాదు...
సంకల్పం
ఒకప్పుడు ప్రతి పైసా కోసం కష్టపడిన ఆమె ఇప్పుడు... సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. డ్రోన్ పైలట్‌గా మారి కలను సాకారం చేసుకోవడమే కాదు...
తనలాంటి అట్టడుగు వర్గాల మహిళలకు మార్గదర్శి అయ్యారు. పోరాటాలతో నిండిన జీవితం... స్వయంకృషితో ఎదిగిన నేపథ్యం... ‘డ్రోన్ దీదీ’గా గుర్తింపు పొందిన శాంతి విశ్వకర్మ కథ ఇది.
పట్టుదల... కృష్టి... మాటల్లో చెప్పడం సులువే. కానీ చేతల్లో చూపేవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి ఓ అరుదైన మహిళే శాంతి విశ్వకర్మ. ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం... రాజ్‌నంద్‌గావ్ జిల్లా... డోంగర్‌గఢ్ ప్రాంతం... అందులోకి అడుగు పెడితే సాంకేతికతను అందిపుచ్చుకున్న మహిళలు తారసపడతారు. డ్రోన్ పైలెట్లుగా వ్యవసాయ క్షేత్రంలో అద్భుతాలు చేస్తుంటారు. ఒకప్పుడు పూట గడవని గిరిజన, అట్టడుగు వర్గాల మహిళలు నేడు గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నారు. ఈ మార్పునకు ప్రధాన కారణం... శాంతి. తన ప్రాంతంలోనే కాదు... చుట్టుపక్కల గ్రామాల్లోని మహిళలకు కూడా ఆమె శిక్షణ ఇచ్చి, డ్రోన్ పైలెట్లుగా తీర్చిదిద్దుతున్నారు.
చిన్నప్పుడే పెళ్లి...
‘‘ఉపాధ్యాయురాలిని కావాలనేది నా చిన్ననాటి కల. కానీ తొమ్మిదో తరగతి కాగానే నాకు పెళ్లి చేసేశారు. దాంతో నా కల చెదిరింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు ఆపకూడదని నిర్ణయించుకున్నాను. అదే విషయం మా అత్తింటివారికీ స్పష్టం చేశాను. నా భర్త కుల్దీప్ మద్దతుగా నిలిచారు. ఆయన సహకారంతో బీఎస్సీ చదివాను.
సొంత వ్యాపారం...
డిగ్రీ పూర్తయ్యాక ఇంట్లోనే మా అక్కాచెల్లెళ్లతో అప్పడాలు, మురుకులు తయారీ మొదలుపెట్టాను. వాటిని మార్కెట్‌కు తీసుకువెళ్లి నేనే అమ్మేదాన్ని. క్రమంగా వ్యాపారం వృద్ధి పొందింది. మా ప్రాంతంలోని ఇతర మహిళలు కూడా ఆసక్తి చూపారు. దాంతో వారికీ పని కల్పించాను. పచ్చళ్లు, స్నాక్స్ కూడా ప్రారంభించాను. భగవంతుడిపై భారం వేసి, మన పనిని మనం నిజాయతీగా చేస్తే ఫలితం అదే వస్తుందని బలంగా నమ్మేదాన్ని. ఏ పని మొదలుపెట్టినా పట్టుదలగా ప్రయత్నించడం అలవాటు చేసుకున్నాను.
డ్రోన్ శిక్షణ...
డిగ్రీ పూర్తయ్యాక ఏడాదికి ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలనే నియమం పెట్టుకున్నాను. ఆ క్రమంలో డ్రోన్‌లు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నమో డ్రోన్ దీదీ’ కార్యక్రమం గురించి తెలిసింది. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు మద్దతుగా మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లను అందించడం ఈ పథకం లక్ష్యం. దానికి దరఖాస్తు చేసుకున్నాను. ఒకరోజు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. పలు దశల తరువాత గ్వాలియర్‌లో శిక్షణకు ఎంపికయ్యాను. రెండేళ్ల కిందటే శిక్షణ పూర్తయింది. డ్రోన్ పైలెట్ అయ్యాను.
వెనకడుగు వేయద్దు...
నా దృష్టిలో జీవితం, పోరాటం... రెండూ సమాంతరమైన అంశాలు. టీచర్‌ను కావాలన్న కల పెళ్లితో చెదిరిపోయినా... పరిస్థితులకు అనుగుణంగా డిగ్రీ పట్టా, ఆ తరువాత వ్యాపారమనే లక్ష్యాలను నిర్దేశించుకున్నాను. మార్కెట్‌లో నాదైన ముద్ర వేశాక... డ్రోన్ పైలెట్‌గా మరో అధ్యాయం మొదలుపెట్టాను. ప్రతి దశలో ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. గమ్యం చేరాలంటే వాటిని అధిగమించాలి. నేటి తరం అమ్మాయిలకు నేను కోరేది ఒక్కటే... ఒక లక్ష్యం పెట్టుకున్నాక వెనకడుగు వేయద్దు. నిజాయతీగా ప్రయత్నిస్తే విజయం తథ్యమనేది నా జీవితం నాకు నేర్పిన పాఠం.
రైతులకు అండగా...
డ్రోన్ వినియోగంలో నైపుణ్యం నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. దాని ద్వారా రైతుల పొలాల్లో పురుగు మందులు, ఎరువులు చల్లుతున్నాను. నెలకు పాతిక వేల రూపాయల వరకు సంపాదిస్తున్నాను. ఇది నా వ్యాపారానికి అదనపు రాబడి. ఈ నైపుణ్యాన్ని నాలాంటి మహిళలకు కూడా నేర్పాలనుకున్నాను. ఔత్సాహికులను ఆహ్వానించాను. అలా ఇప్పటివరకు వందలమంది మహిళలకు డ్రోన్ శిక్షణ ఇచ్చాను. అంతా ఉచితంగానే. మా డోంగర్‌గఢ్‌లో ఇప్పుడు నేను నా పేరుతో కంటే ‘డ్రోన్ దీదీ’గానే అందరికీ తెలుసు. దీన్ని ఒక బలమైన మార్పునకు పునాదిగా భావిస్తున్నాను.’’
ఈ వార్తలు కూడా చదవండి...
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News