Share News

భయం కాదు.. అవగాహన అవసరం

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:58 AM

బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ అనగానే అందరూ భయపడతారు. పెద్ద శస్త్రచికిత్స కాబట్టి ఎముకను మార్చేస్తారేమోనని అనుకుంటారు. కానీ ఇది ఎముకను మార్చే ఆపరేషన్‌ కాదు. రక్తాన్ని...

భయం కాదు.. అవగాహన అవసరం

బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ అనగానే అందరూ భయపడతారు. పెద్ద శస్త్రచికిత్స కాబట్టి ఎముకను మార్చేస్తారేమోనని అనుకుంటారు. కానీ ఇది ఎముకను మార్చే ఆపరేషన్‌ కాదు. రక్తాన్ని తయారుచేసే మూల కణాలను అందించే ప్రత్యేక చికిత్స ఇది. దీన్ని స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ లేదా హెమటోపొయటిక్‌ స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ అని కూడా అంటారు.

మన శరీరంలోని కొన్ని పెద్ద ఎముకల మధ్య భాగంలో బోన్‌మ్యారో ఉంటుంది. ఇది రక్తకణాలను తయారుచేసే కర్మాగారం లాంటిది. ఎర్ర రక్త కణాలు శరీరానికి ఆక్సిజన్‌ను అందిస్తాయి. తెల్ల రక్తకణాలు ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ప్లేట్‌లెట్లు రక్తస్రావం ఆగడానికి సహాయపడతాయి. ఈ కణాలన్నీ బోన్‌మ్యారోలో ఉండే స్టెమ్‌ సెల్స్‌ నుంచి తయారవుతాయి.

లుకేమియా, లింఫోమా, మల్టిపుల్‌ మైలోమా వంటి రక్త క్యాన్సర్లలో ఈ వ్యవస్థ దెబ్బతినవచ్చు. అలాగే అప్లాస్టిక్‌ అనీమియా, థలసీమియా, కొన్ని జన్యుపరమైన రక్త వ్యాధులు లేదా రోగనిరోధక లోపాల్లో కూడా బోన్‌మ్యారో సరిగా పని చేయకపోవచ్చు. అప్పుడు ఆరోగ్యకరమైన స్టెమ్‌ సెల్స్‌ను రోగికి అందించి, మళ్లీ రక్తకణాల తయారీ ప్రారంభమయ్యేలా చేయడమే బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ లక్ష్యం.

ఈ చికిత్సలో రెండు ముఖ్యమైన రకాలున్నాయి. మొదటిది ఆటోలాగస్‌ ట్రాన్స్‌ప్లాంట్‌. ఇందులో రోగి సొంత స్టెమ్‌ సెల్స్‌ను ముందుగా సేకరించి భద్రపరుస్తారు. తర్వాత అధిక మోతాదులో కీమోథెరపీ ఇచ్చి, వ్యాధిగ్రస్థ కణాలను తగ్గిస్తారు. ఆ తర్వాత భద్రపరిచిన స్టెమ్‌ సెల్స్‌ను తిరిగి రోగికి ఎక్కిస్తారు.

రెండవది ఆలోజెనిక్‌ ట్రాన్స్‌ప్లాంట్‌. ఇందులో స్టెమ్‌ సెల్స్‌ మరొక వ్యక్తి నుంచి తీసుకుంటారు. దాతగా సోదరుడు, సోదరి, తల్లితండ్రులు, పిల్లలు, సంబంధం లేని సరిపోలే దాత లేదా బొడ్డుతాడు రక్తం ఉపయోగించవచ్చు. దాత సరిపోతాడా లేదా అన్నది తెలుసుకోడానికి హెచ్‌ఎల్‌ఎ పరీక్ష చేస్తారు. సోదరుడు లేదా సోదరిలో పూర్తిగా సరిపోలే అవకాశం సుమారు నలుగురిలో ఒకరికి ఉంటుంది.


ఆలోజెనిక్‌ ట్రాన్స్‌ప్లాంట్‌లో ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుంది. దాత నుంచి వచ్చిన రోగనిరోధక కణాలు రోగి శరీరంలో మిగిలిన క్యాన్సర్‌ కణాలను గుర్తించి, వాటిపై దాడి చేయగలవు. రోగి శరీరంలో మిగిలిన క్యాన్సర్‌ కణాలను గుర్తించి, వాటిపై దాడి చేయగలవు. దీనిని గ్రాఫ్ట్‌ వర్సెస్‌ ట్యూమర్‌ ప్రభావం అని అంటారు. కొన్ని లుకేమియాల్లో ఈ ప్రభావం చాలా ఉపయోగపడుతుంది. అయితే అదే సమయంలో దాత కణాలు కొన్నిసార్లు రోగి చర్మం, పేగులు, లేదా కాలేయంపై ప్రభావం చూపవచ్చు. దీనిని గ్రాఫ్ట్‌ వర్సెస్‌ హోస్ట్‌ డిసీజ్‌ అని అంటారు.

ట్రాన్స్‌ప్లాంట్‌కు ముందు రోగి ఆరోగ్యాన్ని పూర్తిగా పరీక్షిస్తారు. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు బాగా పని చేస్తున్నాయా అని చూస్తారు. రక్త పరీక్షలు, స్కాన్లు, బోన్‌మ్యారో పరీక్షలు చేస్తారు. చికిత్స సమయంలో మందులు, రక్తం, ప్లేట్‌లెట్లు, స్టెమ్‌ సెల్స్‌ ఇవ్వడానికి ఛాతీ దగ్గర సెంట్రల్‌ లైన్‌ అనే చిన్న ట్యూబ్‌ వేస్తారు.

స్టెమ్‌ సెల్స్‌ సాధారణంగా రక్తం నుంచి సేకరిస్తారు. ప్రత్యేక యంత్రం ద్వారా రక్తం నుంచి స్టెమ్‌ సెల్స్‌ను వేరే చేస్తారు. కొన్నిసార్లు నడుము ఎముకల దగ్గర బోన్‌మ్యారో నుంచి కూడా స్టెమ్‌ సెల్స్‌ తీసుకుంటారు.

ట్రాన్స్‌ప్లాంట్‌కు ముందు కీమోథెరపీ లేదా కొన్నిసార్లు రేడియేషన్‌ ఇస్తారు. దీని వల్ల వ్యాధిగ్రస్థ కణాలు తగ్గుతాయి. కొత్త స్టెమ్‌ సెల్స్‌ను స్వీకరించడానికి శరీరం సిద్ధపడుతుంది. తర్వాత స్టెమ్‌ సెల్స్‌ను రక్తనాళం ద్వారా ఇస్తారు. ఇది రక్తం లేదా ప్లేట్‌లెట్లు ఇవ్వడంలాగే ఉంటుంది. ఈ కణాలు బోన్‌మ్యారోలోకి వెళ్లి, కొత్త రక్త కణాలను తయారుచేయడం ప్రారంభిస్తాయి. దీనికి ఎంగ్రా్‌ఫ్టమెంట్‌ అని అంటారు.

ట్రాన్స్‌ప్లాంట్‌ తర్వాత మొదటి కొన్ని వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో తెల్ల రక్తకణాలు తక్కువగా ఉండడం వల్ల ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే రోగిని ప్రత్యేక గదిలో ఉంచుతారు.

నోటి పుండ్లు, వాంతులు, విరోచనాలు, జుట్టు రాలడం, అలసట, రక్తం లేదా ప్లేట్‌లెట్లు అవసరం కావడం వంటి దుష్ప్రభావాలు రావచ్చు. వీటిలో చాలా వరకూ తాత్కాలికం. వైద్యం బృందం పర్యవేక్షణలో ఇవి నియంత్రించగలిగినవే. కొందరు యువ రోగుల్లో భవిష్యత్తులో పిల్లలు కలగడంపై ప్రభావం ఉండవచ్చు. అందుకే చికిత్సకు ముందు ఫెర్టిలిటీ గురించి వైద్యులతో మాట్లాడడం మంచిది.


ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఫాలోఅప్‌ చాలా ముఖ్యం. ముఖ్యంగా మొదటి 100 రోజులు జాగ్రత్తగా ఉండాలి. జ్వరం, వణుకు, దగ్గు, విరోచనాలు, రక్తస్రావం లేదా చర్మంపై దద్దు ర్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ పెద్ద చికిత్సే! కానీ సరైన రోగిలో, సరైన సమయంలో, అనుభవం ఉన్న కేంద్రంలో చేస్తే, ఇది ప్రాణాలను కాపాడగలదు. ఈ చికిత్స గురించి భయపడడం కన్నా, సరైన అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం.

డాక్టర్‌ కృష్ణా రెడ్డి

డైరెక్టర్‌ ఆంకాలజీ సర్వీసెస్‌

హెచ్‌ఓడీ అండ్‌ చీఫ్‌ కన్సల్టెంట్‌,

మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ

ఈ వార్తలు కూడా చదవండి...

మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 12:58 AM