లేటు వయసులో... అలుపులేని పరుగు
ABN , Publish Date - Feb 05 , 2026 | 02:35 AM
74 ఏళ్ళ దక్షా కనావియా పరుగుకు పర్యాయపదం. ఉద్యోగ విరమణ తరువాత విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో మారథాన్‌లలోకి అడుగుపెట్టిన ఆమె రికార్డుల మోత మోగిస్తున్నారు. ‘50కె పింక్‌మార్‌థాన్’కు...
74 ఏళ్ళ దక్షా కనావియా పరుగుకు పర్యాయపదం. ఉద్యోగ విరమణ తరువాత విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో మారథాన్‌లలోకి అడుగుపెట్టిన ఆమె రికార్డుల మోత మోగిస్తున్నారు. ‘50కె పింక్‌మార్‌థాన్’కు మస్కట్‌గానూ వ్యవహరించిన ఆమె క్రమశిక్షణ, అంకితభావం ఉంటే విజయం ఏ వయసులోనైనా సాధ్యమేనని నిరూపిస్తున్నారు.
‘‘చిన్న వయసులో కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, చదువు, ఉద్యోగం... జీవితం వెనుక పరుగెత్తి అలిసిపోయాను. బ్యాంక్ మేనేజర్‌గా రిటైరయ్యాక... హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చనుకున్నాను. కానీ మళ్ళీ పరుగు అందుకోవాల్సి వచ్చింది. ఈసారి జీవితంలో కాదు, ట్రాక్ మీద. నేను పుణేలో పుట్టాను. ముంబయిలో పెరిగాను. మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. చదువులో, ఆటల్లో నా తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించేవారు. హైస్కూల్లో ఉన్నప్పుడు ఎన్నో పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాను. ఈలోగా... కొన్ని కారణాలవల్ల మా నాన్న త్వరగా రిటైర్ కావాల్సి వచ్చింది. చిన్న ఇంట్లో అందరం సర్దుకోవాల్సి వచ్చేది. దీంతో కుటుంబానికి నా వంతుగా ఎలా సాయపడాలని ఆలోచించేదాన్ని. పదో తరగతి పూర్తికాగానే... పొద్దున్న కాలేజీకి వెళ్ళి, సాయంత్రం దుకాణాల్లో పని చేసేదాన్ని. డిగ్రీ తరువాత టెలికాం శాఖలో, మున్సిపల్ కార్పొరేషన్‌లో విధులు నిర్వహించాను. పెళ్ళి, పిల్లలు, సంసారం... వీటిని నెరవేరుస్తూనే బ్యాంక్ పరీక్షలు రాశాను. బ్యాంక్ ఉద్యోగినయ్యాను. 38 ఏళ్ళు ఉద్యోగాలు చేశాక బ్యాంక్ మేనేజర్‌గా రిటైరయ్యాను. కానీ ఒక కొత్త అధ్యాయం నాకోసం ఎదురుచూస్తోందని నాకు తెలీదు.
దినచర్యలో భాగంగా...
2011లో... నాకు ఆస్టియోపోరోసిస్ ఉందని నిర్ధారణ అయింది. నడవడం కష్టమయ్యేది. దానికితోడు అంతకుముందు నుంచీ ఉన్న మధుమేహం... ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడ్డాను. ‘కొన్నాళ్ళు ఇలాగే ఉండిపోతే... మంచానికే పరిమితమైపోతానేమో?’ అని భయపడ్డాను. ఫిజియోథెరపీకి వెళ్ళాను. వైద్య నిపుణుల సలహాతో యోగ, సూర్యనమస్కారాలు, స్విమ్మింగ్ మొదలుపెట్టాను. మరింత ఫిట్‌నెస్ కోసం రన్నింగ్ చేయాలని మిత్రులు సూచించారు. అలా... 63 ఏళ్ళ వయసులో పరుగును నా దినచర్యలో భాగం చేసుకున్నాను. ఈ క్రమంలో పింక్ మారథాన్ కమ్యూనిటీతో పరిచయమయింది. నన్ను కూడా ఆ బృందంలో చేరాలని ప్రోత్సహించారు. అది నా జీవితంలో చాలా పెద్ద మలుపు. అప్పటివరకూ మారథాన్ అంటే నాకు తెలీదు. నొప్పి లేకుండా నడవడం ఒక్కటే అప్పట్లో నా లక్ష్యం. కానీ క్రమంగా నా దృక్పథంలో మార్పు వచ్చింది. 5కె రన్ తో మొదలైన నా పరుగు 10కె, అలా్ట్రస్, 24 గంటలరేసుల నుంచి 100 కిలోమీటర్ల ఛాలెంజ్‌ల వరకూ సాగింది. ముంబయి నుంచి పుణే, సిల్వాసా నుంచి ముంబయి, గ్వాలియర్ నుంచి ఢిల్లీ, భారత సైన్యంతో పాటు అమృతసర్ నుంచి వాఘా సరిహద్దు... ఇలా దేశంలో వివిధ ప్రాంతాల్లో పరుగులు పెట్టాను. 100 కిలోమీటర్ల దూరాన్ని 19 గంటల్లో అధిగమించాను. మహారాష్ట్ర రాష్ట్ర క్రీడా పోటీలు, జాతీయ క్రీడా పోటీల్లో మూడు స్వర్ణ పతకాలు అందుకున్నాను. ఈ వయసులో నేను సాధించిన విజయాలతో రెండు గిన్నిస్ రికార్డులు, మూడు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులు, ఏడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (బ్రిటన్) నమోదు చేశాను. ఇటీవల ‘50కె పింక్ మారథాన్’కు మస్కట్‌గా వ్యవహరించాను.
మనసు చెప్పేది వినండి...
పరుగు కోసం, మారథాన్ల కోసం నేను ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. సానుకూల దృక్పథంతో ఆలోచించడం, సంతోషంగా ఉండడం నా రహస్యం. రోజూ పొద్దున్నే యోగా... ఆ తరువాత రన్నింగ్ చేస్తాను, కాసేపు నాకు ఇష్టమైన డ్యాన్స్ చేస్తాను. ఒక స్వచ్ఛంద సంస్థలో వాలంటీర్‌గా కూడా పని చేస్తున్నాను. అలాగని అంతా సజావుగా జరిగిపోలేదు. సయాటికా, వెన్నెముక సమస్యలతో కొన్నేళ్ళ క్రితం రెండు నెలలు మంచానికే పరిమితమయ్యాను. బాగా విశ్రాంతి తీసుకొని కోలుకున్నాను. కానీ అప్పుడు కూడా పరుగు ఆపాలని అనుకోలేదు. 100 కిలోమీటర్లు కుదరకపోతే 50 కిలోమీటర్లు చేస్తాను, లేదంటే 20, 10, 5.... కానీ ఓపిక ఉన్నంతవరకూ పరుగు కొనసాగిస్తూనే ఉంటాను. ‘‘ఈ వయసులో ఇంత ఉత్సాహంగా ఎలా ఉంటున్నార’’ని చాలామంది అడుగుతూ ఉంటారు. వయసు గురించి ఆలోచించడం మానేయండి. ఎందుకంటే వృద్ధాప్యం అనేది ఒక వాస్తవం. కాబట్టి మీ శరీరం చెప్పేది వినండి, మార్పును ఆమోదించండి. ఆరోగ్యం గురించి నిరంతరం శ్రద్ధ తీసుకోండి. నా స్ఫూర్తితో కొందరైనా లేటు వయసులో కొత్తగా ఏదైనా ప్రారంభించి, తమ కలల్ని నిజం చేసుకుంటే... నాకు అంతకుమించిన సంతృప్తి మరేదీ ఉండదు.’’
ఈ వార్తలు కూడా చదవండి..
తుర్కియే విమానం ఇంజిన్‌లో మంటలు.. కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
భార్యను చంపేందుకు కుట్ర..! రెండు సార్లు ఫెయిలై.. మూడో ప్రయత్నంలో..
For More National News And Telugu News