సంభవామి యుగే యుగే
ABN , Publish Date - Mar 13 , 2026 | 01:44 AM
శ్రీమన్నారాయణుడికి రూపాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిలో పరమపదంలో కొలువై ఉండే పరమపదనాథుడు ఒకటి. క్షీరసాగరంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా,... నారదుడు, తుంబురుడు తదితర...
తెలుసుకుందాం
శ్రీమన్నారాయణుడికి రూపాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిలో పరమపదంలో కొలువై ఉండే పరమపదనాథుడు ఒకటి. క్షీరసాగరంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా,... నారదుడు, తుంబురుడు తదితర భక్త గణాల పూజలు అందుకుంటూ, బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలకు అందుబాటులో ఉంటూ, ఆదిశేషునిపై హాయిగా పరుండి ఉండే రూపం శేషశాయి రూపం మరొకటి. ఇది ‘వ్యూహ స్వరూపం’ అని మనకు తెలుసు. ఇలాంటి వ్యూహ స్వరూపాలు 24 ఉన్నాయి.
ఇక భూలోకంలో ఆయన ధరించిన అవతారాల విషయానికి వస్తే...
పవిత్రాణాయ సాధూనాం... వినాశాయచ దుష్కృతామ్... ధర్మసంస్థాపనార్థాయ... సంభవామి యుగే యుగే...
సాధు రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపన చేయవలసిన అవసరం వచ్చినప్పుడు తాను అవతరిస్తూనే ఉంటానని గీతాచార్యుడు హామీ ఇచ్చాడు. ఆ మాటకు అనుగుణంగా వివిధ కాలాలలో, వివిధ రూపాలలో భగవంతుడు అవతరించాడు. అవి పది. వాటికే ‘దశావతారాలు’ అని పేరు. అవతారం అంటే ‘దిగి రావడం’ అని అర్థం. శ్రీవైకుంఠంలోని దివ్య స్థితి నుంచి తన భక్తుల కోసం ఈ భూమిపైకి దిగివచ్చే స్థితిని అవతారం అంటారు. వివిధ కాలాలలో, వివిధ అవరాలను బట్టి ఎలాంటి రూపాన్ని ధరించడానికైనా భగవంతుడు వెనుకాడలేదు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, దశరథరామ, బలరామ, కష్ణ, కల్కి అనేవి ఆ దశావతారాలు. ఇవన్నీ శ్రీమన్నారాయణుడి వైభవాన్ని సామాన్య జనులకు నేరుగా తెలియజేసే రూపాలు. వీటిని వైభవ అవతారాలని, విభవ అవతారాలని కూడా పిలుస్తారు.
దేవ్‌గఢ్ దశావతార ఆలయం
చారిత్రకంగా చూస్తే దేవాలయ నిర్మాణ పరిణామ క్రమంలో కూడా ఈ దశావతారాల ప్రస్తావన కనిపిస్తుంది. సామాన్యశకం నాలుగో శతాబ్దంలో... గుప్తుల కాలంలో నిర్మితమైన దశావతార దేవాలయం ఇందుకు ఒక ఉదాహరణ. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లా దేవ్‌గఢ్‌లో ఉన్న ఈ ఆలయం దేవనాగర శైలిలో నిర్మితమయింది. గుప్తులు శిల్ప, ఆలయ కళలను విశేషంగా ఆదరించారు. వివిధ పౌరాణిక గాథలను ఆలయ నిర్మాణంలో భాగంగా శిల్పాల రూపంలో చెక్కించడం అనేది వారి కాలంలో మరింతగా విస్తరించింది. ఈ దేవాలయ నిర్మాణ శైలిని పరిశీలిస్తే ఎన్నో విశేషాలు కనిపిస్తాయి.


శిల్పాల్లో పౌరాణిక ఘట్టాలు
ఎత్తైన ఒక వేదిక మీద ప్రధాన ఆలయం, నాలుగు మూలల్లో నాలుగు ఉపాలయాలు ఉంటాయి. నాలుగు దిక్కుల్లో... నలువైపులా నిర్మించిన సోపానాలు ఉంటాయి. ప్రధాన గర్భాలయం వైపు ప్రధాన ద్వారం ఉండగా... ఇతర దిశలో అలంకరించిన కిటికీలు ఉంటాయి. వాటిని ‘దేవ కోష్ఠములు’ అని పిలుస్తారు. వాటిలో గజేంద్ర మోక్షం, శయనించి ఉన్న విష్ణువు రూపం, అహల్యా శాప విమోచన ఘట్టం లాంటివి ఉంటాయి. అంతేకాదు... మహా భారత, భాగవత గాథలతో పాటు రామాయణంలోని కొన్ని ఘట్టాలను కూడా శిల్పాలుగా మలిచారు. ‘విష్ణు ధర్మోత్తర పురాణం’లో వివరించిన ‘సర్వతోభద్ర ఆలయ నిర్మాణ శైలి’కి ఈ ఆలయం ఒక వాస్తవ రూపం అనడంలో సందేహం లేదు. అలాగే వివిధ కాలాలలో, వివిధ ప్రాంతాలలో దశావతార దేవాలయాలు, ఒక్కొక్క అవతారానికి విశేష ఆలయాలు నిర్మితమయ్యాయి. వాటిలో ఏడు మన తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నాయి. వాటి గురించి మున్ముందు తెలుసుకుందాం.
డి.యన్.వి. ప్రసాద్,
స్థపతి, 9440525788
ఈ వార్తలు కూడా చదవండి..
స్వదేశీ రక్షణ తయారీకి సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ ఊతం: మంత్రి నారాయణ
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు
జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
Read Latest International News And Telangana News And AP News And Telugu News