ఈ కళ్యాణం సీతారాములకేనా?
ABN , Publish Date - Mar 20 , 2026 | 01:32 AM
దక్షిణ అయోధ్యగా ఖ్యాతి పొందిన భద్రాచలం మరో వారం రోజుల్లో జరగబోయే కల్యాణ మహోత్సవాలకు సిద్ధమవుతోంది. మునుపటి వేడుకల్లో గోత్ర నామాలతో సహా అనేక అంశాలు భక్తుల్లో....
దక్షిణ అయోధ్యగా ఖ్యాతి పొందిన భద్రాచలం మరో వారం రోజుల్లో జరగబోయే కల్యాణ మహోత్సవాలకు సిద్ధమవుతోంది. మునుపటి వేడుకల్లో గోత్ర నామాలతో సహా అనేక అంశాలు భక్తుల్లో ఎన్నెన్నో సందేహాలు, ప్రశ్నలు రేకెత్తించాయి. మరి ఈ పరాభవ నామ సంవత్సరంలో జరగబోయేది త్రిమూర్తులలో ఒకరైన రామనారాయణ (విష్ణుమూర్తి), లక్ష్మీదేవిల వివాహమా? లేక విష్ణుమూర్తి అవతారమైన శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవితో కళ్యాణమా?
గత విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి-దశమి సందర్భంగా భద్రాచలంలో ఉద్దండ పండితులు, ఘనాపాఠీల ఆధ్వర్యంలో శ్రీ సీతారామ (రామనారాయణ?) కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగాయి. ఆ సమయంలో అర్చక మహాశయుల్లో రాముణ్ణి ఏ విధంగా రామనారాయణుడిగా, సీతాదేవిని మహాలక్ష్మిగా ఆహూతులకు పరిచయం చేయాలనే తపనే తప్ప... ఆధ్యాత్మిక వైభోగం ఏమాత్రం కనిపించలేదు.
వాల్మీకి, ఆంధ్ర వాల్మీకి రాసినదేమిటి?
వాల్మీకి మహర్షి కూర్చిన బీజాక్షరాల సమాహారమే 24 వేల శ్లోకాల ’ధ్వని కావ్య’మైన సంస్కృత రామాయణం. అష్టాక్షరీ మంత్రంలోని ‘ర’ శబ్దాన్ని, పంచాక్షరీ మంత్రంలోని ‘మ’ శబ్దంతో కలిపి వశిష్ట మహర్షి ఏ పుణ్య ముహూర్తంలో ‘రామ’ నామాన్ని నిర్ణయించారో కానీ... అది యుగయుగాలకు తారకమంత్రమయింది. సంస్కృతం రానివారి కోసం.... ఆంధ్ర వాల్మీకిగా, వాసుదాసుగా ప్రసిద్ధికెక్కిన వావిలికొలను సుబ్బారావు 150 సంవత్సరాలకు పూర్వం... వాల్మీకి రామాయణాన్ని పూర్వ కాండలతో ఉత్తర కాండను కలిపి.. 24 వేల పద్యాలతో, సులభమైన వ్యాఖ్యానంతో... ‘మందరం’ అనే పేరుతో రసరమ్యంగా తెలుగులోకి అనువదించారు. ఆ గ్రంథాల ప్రకారం... వైవస్వత మన్వంతరం, త్రేతాయుగం, విళంబి నామ సంవత్సరం, చైత్ర మాస శుక్లపక్ష నవమి తిథి నాడు... పునర్వసు నక్షత్రంలో బుధవారం రోజున శ్రీరామ జననం జరిగింది. శ్రీరాముడికి ఆ ఏడాది చైత్ర బహుళ పంచమి నాడు నామకరణం, తొమ్మిదో యేట పరాభవ నామ సంవత్సరంలో ఉపనయనం జరిగాయి. ఆయనకు పన్నెండేళ్ళు, సీతకు ఆరేళ్ళు ఉన్నప్పుడు... సౌమ్య నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ త్రయోదశి - ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో... సీతారాముల కళ్యాణం జరిగింది. అంతేకాని చైత్ర శుద్ధ నవమి నాడు కాదు. అది వేరే సంగతి. వాల్మీకి రామాయణంలోని అత్యద్భుతమైన ఘట్టాలలో ’శ్రీ సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం‘ ప్రధానమైనవి. శివ ధనుర్భంగం అనంతరం..., జనకుడి ఆహ్వానం మేరకు దశరథ మహారాజు మిథిలా నగరానికి వచ్చాడు. వివాహంలో వధూవరుల వంశవృక్షం, నేపథ్యం, ప్రవర అవశ్యంగా తెలియాలి. తదనుగుణంగా, ఇక్ష్వాకు వంశానికి కులగురువైన వశిష్టుడు సూర్యవంశ క్రమాన్ని, జనక మహారాజు తన వంశ క్రమాన్ని వివరించారు. ఆ ప్రకారం శ్రీరాముడిది వశిష్ట గోత్రం, సీతాదేవిది గౌతమస గోత్రం. ఇక శ్రీరామ పట్టాభిషేకం... ధాత నామ సంవత్సరం చైత్ర శుద్ద సప్తమి, గురువారం, పుష్యమి నక్షత్రంలో జరిగింది.
గోత్రాలు, ప్రవర మార్చేశారు...
గత ఏడాదితో సహా ఇటీవల భద్రాచలంలో నిర్వహిస్తున్న రామనారాయణ, లక్ష్మీదేవిల కళ్యాణం సందర్భంగా... ఎదురుకోలు, కల్యాణం, పట్టాభిషేక ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మిథిలా కళ్యాణమండపం దగ్గర చేపడుతున్న వివాహ తంతు ద్వారా... విజ్ఞానవంతులైన అర్చక, పండిత మహాశయులు... ఇటీవలి కాలంలో ఆహూతులను గందరగోళానికి గురిచేస్తున్నారు. ‘అచ్యుత గోత్రోద్భవాయా’ అని రామనారాయణ స్వామిని శ్రీరామచంద్రుడి స్థానంలోకి తెచ్చారు. క్షత్రియుడైన శ్రీరాముణ్ణి ‘అచ్యుత గోత్రం’తో బ్రాహ్మణుడిగా క్షణంలో మార్చేశారు. సీతాదేవి స్థానంలో సీతామహాలక్ష్మిని తెచ్చి... ప్రవర మార్చారు, ‘సౌభాగ్య గోత్రం’ ఇచ్చేశారు. శ్రీరాముడి ‘వశిష్ట గోత్రం’, సీతాదేవి ‘గౌతమస గోత్రం’... ఎలా, ఎందుకు, ఎక్కడికి మాయమైపోయాయో తెలియదు. వైష్ణవ సంప్రదాయాల ప్రకారం మహా విష్ణువు శాస్త్రోక్త ఆవిర్భావాన్ని ‘ఆది మధ్యాంత రహితమైన నిత్య స్వరూపం’గా పేర్కొనడం జరిగింది. శ్రీమహావిష్ణువు కారణజలధిపై యోగనిద్రలో విరాజిల్లుతూ ఉంటాడని భాగవత పురాణం వివరిస్తోంది. విష్ణువును సాధారణ అర్థంలో జన్మించినవాడిగా కాకుండా... సర్వసృష్టికి మూలకారకుడిగా అవతరించిన పరతత్త్వ స్వరూపుడిగా భావిస్తారు. అలాంటప్పుడు ఆయన అచ్యుత గోత్రోద్భవుడు ఎలా అవుతాడు? త్రిమూర్తుల వివాహాలను సైతం సాధారణ వేదోక్త వివాహ క్రియల రూపంలో జరిగినవిగా కాకుండా... ఒక తాత్త్విక ఆధ్యాత్మిక సంఘటనగా భావించాలి.
ఆ ప్రస్తావనలు భావ్యమేనా?
విష్ణు పురాణం, భాగవతం తదితర గ్రంథాల ప్రకారం క్షీరసాగర మథనం సమయంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆ సమయంలో ఆమె స్వయంగా మహా విష్ణువును తన నిత్య సహచరుడిగా (భర్తగా) ఎంచుకుంది. అప్పటి నుంచి ఆమె వైకుంఠంలో విష్ణువుతో నిత్యసహవాసం, నిత్యనివాసం చేస్తూ ఉన్నదని వైష్ణవ సంప్రదాయం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వివరిస్తుంది. అలాంటప్పుడు ఆమె ‘సౌభాగ్య గోత్రోద్భవి’ ఎలా అయింది? లక్ష్మీదేవి ఆవిర్భావం, స్వయంగా విష్ణువును వరించడం, అనంతరం ఆయనతో నిత్య సంబంధంగా ఉండడం లాంటి విషయాలకు అతీతంగా... వారి వివాహం వేద విధానం ప్రకారం జరిగిందని చెప్పే స్పష్టమైన దాఖలాలు (నా పరిమిత జ్ఞానం మేరకు) శాస్త్రాలలో కనిపించవు. అంతేకాదు... వారి వర్ణం, ప్రవర, గోత్రం తదితర వివరాల గురించి కూడా ఎక్కడా ప్రస్తావన లభించదు. అలాంటప్పుడు అచ్యుత, సౌభాగ్య గోత్రాల సాధికారత ఏమిటి? అంతా అగమ్యగోచరం! విశేషమేమిటంటే... గతంలోని ఎదుర్కోలు వేడుకలో సీతాదేవి, శ్రీరాముడి పక్షం వహించిన ఇద్దరు ‘విశిష్ట వశిష్టుల స్థాయి’ ఆచార్యవర్యులు మాటల ద్వంద్వ యుద్ధం చేశారేమో? అనిపించింది. సీతారాముల గుణగణాలను, గొప్పదనాలను వర్ణించేటప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉండాలి. వారివారి వివాహానికి ముందునాటి విషయాలనే చెప్పాలి కానీ జరగబోయేవి ఎలా చెబుతారు? రామాయణాన్ని తమదైన శైలిలో అన్వయించుకుంటూ... వివాహానంతర కాండలలో ఉన్న విషయాలను ప్రస్తావించడం భావ్యమా? కనీసం ఈ పరాభవ నామ సంవత్సరంలోనైనా... భక్త రామదాసు భావాలకు, వాల్మీకి మహర్షి సంస్కృత రామాయణ రచనకు, ఆంధ్ర వాల్మీకి యథాతథ తెలుగు అనువాదానికి అనుగుణంగా వచ్చే శుక్రవారం భద్రాచలం క్షేత్రంలో నిర్వహించే వేడుకను... రామనారాయణ, మహాలక్ష్మీ కళ్యాణంగా కాకుండా... శ్రీ సీతారాముల కళ్యాణంగా జరిపించాలి. కళ్యాణానికి వచ్చే ఆహూతులకు, టీవీ ప్రేక్షకులకు అర్థమయ్యేలా, తప్పుదారి పట్టించకుండా సరళమయిన తెలుగులో చెప్పాలి. ఎదుర్కోలు, పట్టాభిషేకం వివరాలు కూడా అలాగే చెప్పాలి. ఆ వేడుక పవిత్రతను కాపాడాలి.
వనం జ్వాలా నరసింహారావు
ఈ వార్తలు కూడా చదవండి..
నిన్ను చంపేస్తాం.. రాజాసింగ్‌కు ఆగంతకుల బెదిరింపు..
హైదరాబాద్‌లో తమ్ముడి రాక్షసత్వం.. అక్కను హత్య చేసి.. ఆపై దారుణంగా..
యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు...
Read Latest Telangana News And AP News And International News And Telugu News